వైసీపీకి చరిత్రలో గుర్తుండిపోయే ఘోర ఓటమి : చంద్రబాబు వెల్లడి

వైసీపీకి చరిత్రలో గుర్తుండిపోయే ఘోర ఓటమి : చంద్రబాబు వెల్లడి

వైసీపీ ప్రభుత్వం పోవాలి. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం
మంత్రులు, ఎం‌ఎల్‌ఏ ల అవినీతిపై తిరుగుబాటు మొదలైంది
రాష్ట్రంలో రివర్స్ పాలన
రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఎందుకు వెళ్లిపోయాయో చెప్పాలి
మీడియా సమావేశంలో వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు

వచ్చే ఎన్నికల్లో చరిత్రగుర్తుండిపోయేలా ఘోర ఓటమిని జగన్ చవిచూడక తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపార్టీతోనైనా కలిసి పోటి చేస్తాం. వైసీపీ ప్రభుత్వం పోవాలి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఇదే మానినాదం అని పేర్కొన్నారు. జగన్ పని అయిపోయింది, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని వెల్లడించారు. మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వర్షాలతో పంట నష్టపోతే కనీస మద్దతు ధర ప్రకటించలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని జగన్ పాలనలో అన్ని వ్యవస్ధలు భ్రష్టుపట్టిపోయి పతనావస్ధకు చేరుకున్నాయని ద్వజమెత్తారు. నాడు సన్ రైజ్ స్టేట్ గా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ నేడు దివాళ తీసింది.

రాష్ట్రంలో 1000 కి.మీ సువిశాల తీరప్రాంతం ఉంది, ఉన్న సహజవనరుల్ని వినియోగించుకుని విజన్ 2020 తో 2021 నాటికి ఆంధ్రప్రదేశ్ ని నెం. 1 చేయాలని ప్రణాళిక రూపొందించాం. నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 4 ఏళ్లు మొదటి స్ధానం సాధించాం. మౌళిక సదుపాయాల కల్పన, నీటినిర్వహణ, నధుల అనుసంధానంలో దేశంలో మొదటి స్ధానంలో నిలిచాం. ప్రపంచ దేశాలన్నీ తిరిగి పెట్టుబడులు తెచ్చాం. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ. 16 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం, అందులో రూ. 6 లక్షల కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి, 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ విషయాన్ని శాసనమండలి సాక్షిగా వైసీపీ ప్రభుత్వమే చెప్పింది. విశాఖలో 3 సమ్మిట్ లు నిర్వహించాం. పరిశ్రమలకు కావాల్సిన భూమి, విద్యుత్, నీరు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాం.

జగన్ రెడ్డి పాలనలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపి 14 స్థానంలో ఉందని కేంద్ర సంస్ధ తేల్చింది. ఆ నివేదిక ప్రకారం దేశం మొత్తంలో 2019 అక్టోబరు నుంచి 2022 డిశంబర్ వరకు మొత్తం ఎఫ్ డిఐ లు రూ.13,42,389 కోట్లు. దీనిలో మన వాటా కేవలం 0.42 శాతం మాత్రమే. ఈ విషయం వైసీపీ నేతలకు సిగ్గనిపించకపోవచ్చు, కానీ దీనివల్ల రాష్ట్ర యువత నష్టపోతారు. పెట్టుబడులు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇది ఎవరు చేసిన పాపం ? సహజవనరులు, సారవంతమైన భూములు, నైపణ్యం కల్గిన యువత ఉన్న రాష్ట్రం మనది. రాష్ట్రంలో 1 మేజర్, 11 మైనర్ పోర్టులున్నాయి, అలాంటి చోట ఎగుమతి సన్నద్దత సూచీలో రాష్ట్రం 7వ స్ధానంలో ఉంది.

ప్రజావేదిక కూల్చివేత విద్వంసంతో జగన్ రాష్ట్రంలో రివర్స్ పాలనకు తెరతీశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు. “పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం విధానాలను ఎప్పుడూ మారుస్తూ ఉంటుంది” అని -వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ అన్నారు. “ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకున్నందుకు పశ్చాత్తాపపడుతన్నా” శశి శేఖర్, ఆక్మే సోలార్ హోల్డింగ్స్, “జగన్ రెడ్డిది ప్రభుత్వ టెర్రరిజం. ఏపీపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ రెడ్డి చేతులారా నాశనం చేస్తున్నారు” అని మోహన్ దాస్ పాయ్, (అక్షయ పాత్ర సహ వ్యవస్థాపకులు), లులూ కంపెనీ ప్రతినిధులు భవిష్యత్ లో మళ్లీ ఏపీ ముఖం కూడా చూడం అన్నారంటే జగన్ రెడ్డి అరాచకం ఏ స్దాయిలో ఉందో అద్దం పడుతోంది.

“పీపీఏలను రద్దు చేయడం తప్పు. పారదర్శకంగా వ్యవహరించకపోతే. పెట్టుబడులు, రాష్ట్రంలో అభివృద్ధి దెబ్బతింటుంది” కేంద్ర ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్రానికి లేఖ రాసినా వినలేదు. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్, రూ. 67,000 కోట్లు, స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్రాజెక్టు అమరావతి రూ. 50,000 కోట్లు, ప్రకాశం జిల్లాలో కాగిత పరిశ్రమ రూ. 28,000 కోట్లు, రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ తిరుపతి రూ. 15,000 కోట్లు, అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరిస్ ,చిత్తూరు రూ. 9,500 కోట్లు, లూలూ గ్రూపు విశాఖ రూ. 2,200 కోట్లు, టైట్రాన్ బ్యాటరీస్, చిత్తూరు రూ. 727 కోట్లు, ప్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖ రూ. 450 కోట్లు, జాకీ అనంతపురం రూ. 290 కోట్లు పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే జగన్ రెడ్డి వాటిని కమీషన్ల కోసం వాటిని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు.

కియా కార్స్ టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసి మొదటి కారునుకూడా విడుదల చేశాం. కానీ జగన్ రెడ్డి మరోసారి ప్రారంభించారు. అప్పటికే అది ఉత్తత్పి ప్రారంభించింది కాబట్టి సరిపోయింది, లేదంటే దాన్ని కూడా వెళ్లగొట్టేవారు. ఏటీసీ టైర్స్, అపోలో టైర్స్, ఏసియన్ పెయింట్స్, కర్నూలు ఓర్వకల్ ఎయిర్ పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ నాడు మేం శంకుస్ధాపన చేస్తే జగన్ రెడ్డి సిగ్గులేకుండా మళ్లీ శంకుస్దాపన చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసింది మా ప్రభుత్వమే. పంప్డ్ స్టోరేజీని కూడా ఏపీలోనే తొలిసారి మొదలు పెట్టాం. జగన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే పిపిఎలు రద్దు చేశాడు. విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న సంస్థలను వేధించాడు. చివరకు కోర్టుకు వెళ్లి వాళ్లు క్లియరెన్స్ తెచ్చుకున్నారు. అంతా నాశనం చేసి ఇప్పుడు తిరిగి ఒప్పందాలంటున్నాడు. కర్నూలు విత్తన పరిశ్రమను నాశనం చేశారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

500 ఎకరాలు ఎవరు కొట్టేశారు?

ప్రతిపక్షనేతగా నాడు జగన్ బోగాపురం ఎయిర్ పోర్ట్ కి రైతులు భూములివ్వొద్దని, ఇచ్చిన భూములు మేం అధికారంలోక వస్తే వెనక్కి ఇస్తామని చెప్పి కోర్టుల్లో కేసులు వేసి ఎయిర్ పోర్ట్ కి అడ్డుపడ్డారు
అని చంద్రబాబు ఆరోపించారు. నాడు మేం భూసేకరణ పూర్తి చేసి 2019లో శంకుస్ధాపన చేశాం, కానీ నేడు జగన్ రెడ్డి మళ్లీ శంకుస్దాపన పేరుతో డ్రామాలాడుతున్నారు. దేశంలో మొదటి గ్రీన్ పీల్డ్ ఎయిర్ పోర్ట్ హైదరాబాద్ లో 5 వేల ఎకరాల్లో నిర్మించిన ఘనత టీడీపీదే. ఎయిర పోర్ట్ వల్ల హైదరాబాద్ అభివృద్ది చెందింది. బోగాపురం ఎయిర్ పోర్ట్ కి నాడు మేం 2700 ఎకరాలు కేటాయిస్తే ఇప్పుడు 2220 ఎకరాల్లో కడుతున్నారు. మిగిలిన 500 ఎకరాలు ఎవరు కొట్టేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి పెట్టబడులు ఎందుకు వెళ్లిపోయాయో చెప్పండి? నాలుగేళ్లలో ఎన్ని కంపెనీలు తెచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు? ఐటీ రంగం కుప్పకూలిపోయింది.

దేశంలోని మొత్తం ఐటీ ఎగుమతుల్లో రూ. 11.59 లక్షల కోట్లయితే అందులో ఏపీ వాటా కేవలం 1290 కోట్లు (0.1 శాతం) మాత్రమే. సీ.ఎం.ఐ.ఈ నివేదిక ప్రకారం 2019 నాటికి 3.6 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు 2023 నాటికి 6.5 శాతానికి పెరిగింది. జాతీయ స్ధాయిలో పట్టభద్రుల నిరుద్యోగం 17.23 శాతం ఉంటే రాష్ట్రంలో 35.14 శాతం ఉంది. అంటే రెంటు రెట్లు అధికంగా ఉంది. రాబోయో రోజుల్లో ఇంకా పెరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ విద్యార్దులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశారు. ఎస్.ఆర్.ఎం, విట్ వంటి ప్రవేట్ యూనివర్సిటీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. తెలంగాణలో చదివేందుకు ఎంసెట్ కి 70 లక్షల మంది విద్యార్దులు ధరఖాస్తు చేస్తున్నారు. దీన్ని చూసి మీ రాష్ట్రంలో కాలేజీలు కూడా లేవా అంటూ తెలంగాణ మంత్రులు హేళన చేస్తున్నారు. యువతకు డీఎస్సీ లేదు, ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు లేవు అని చంద్రబాబు వివరించారు.

కలిసి రాజకీయాలు చేయకూడదా?

దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు అంటున్నారు, అంటే రాష్ట్రంలో ఎవరూ కలిసి రాజకీయాలు చేయకూడదా? మీ తప్పుల్ని ప్రశ్నించకూడదా? అనై చంద్రబాబు ప్రశ్నించారు. రజనీకాంత్ హైదరాబాద్ గురించి మాట్లాడితే ఆయన్ని తిడుతున్నారు, రజనీకాంత్ ఇప్పుడు చెప్పారు, కానీ మన్నోహన్ సింగ్, బిల్ క్లింటన్ హైదారాబాద్ గొప్పతనం గురించి ఎప్పుడో చెప్పారు. హైదాబాద్ ని నాలెడ్జ్ ఎకానమీగా అభివృద్ది చేసి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత టీడీపీదే. మంచి పనులు చేస్తే ఎవరైనా కీర్తిస్తారు, చెడు పనులు చేస్తే చీకొడతారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే చీకోడుతున్నారు. నాడు హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ది చూడడానికి ప్రపంచమంతా పోటీ పడే పరిస్ధితి.

వరల్డ్ బ్యాంక్ ప్రెసిండెంట్, టోనీ బ్లెయర్, బిల్ క్లింటన్, సింగపూర్, మలేసియా ప్రధాన మంత్రులు సైతం వచ్చారు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉన్మాదుల మాదిరి విరుచుకుపడుతున్నారు. సిగ్గులేకుండా స్టిక్టర్లు ఇళ్లకు అంటిస్తారా ? వైసీపీ నేతల ముఖాలకు ఖైధీ నెం. 6093 రాసుకుని అంటించుకోండి. ప్రజల మద్య కుల,మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ప్రజలు వీటికి బలికావొద్దు, పవన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కాపు నాయకుల చేత తిట్టిస్తునారు. ప్రజలు జగన్ రెడ్డి కుట్రకు బలి కావద్దని ప్రజలంతా చైతన్యవంతులై వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు నాయడు పిలుపునిచ్చారు.

కేంద్రం చెప్పినా వినలేదు

అమరావతి పూర్తయితే రాష్ట్రానికి రూ.2 నుంచి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది, పోలవరం పూర్తయ్యి ఉంటే ప్రతి ఎకరాకు నీరందేది, నదులు అనుసందానం జరిగి ఉంటే అసలు కరువు ఉండేది కాదు అని చంద్రబాబు చెప్పారు. కేంద్రం చెప్పినా వినకుండా పోలవరం కాంట్రాక్టు సంస్ధను మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే కాఫర్ డ్యాం కొట్టుకుపోయిందని ఐఐటీ హైదరాబాద్ నివేదిక ఇచ్చింది. డబ్బులిచ్చి సర్వేలు చేయించి మళ్లీ మీ బిడ్డ వస్తానంటున్నాడు, ఇది బిడ్ద కాదు కాన్సర్ గడ్డ . ఇతన్ని భరించే శక్తి రాష్ట్ర ప్రజలకు లేదు. 11 కేసుల్లో ఏ1 ముద్దాయి, నాలుగేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలతో వేల కోట్లు కొల్లొకొట్టారు.

40 ఏళ్ల నుంచి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న బీసీ నేత ఆదిరెడ్డి అప్పారావు, వాసులై అక్రమ కేసులు పెట్టారు. వాళ్ల వ్యాపారాలపై జగన్ ప్రతాపం ఏంటి? రాష్ట్రంలో ఎవరూ వ్యాపారాలు చేయకూడదా? జగన్ కి సిమెంట్ కంపెనీలు, విద్యుత్ కంపెనీలకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయి. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు ఏమైంది? స్కిల్ డెవలప్ మెంట్ పై అక్రమ కేసులు పెట్టారు. తన నేరాల్ని కప్పి పెట్టుకుని ఎదుటివారిపై బురద చల్లడటే జగన్ పని అని చంద్రబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా ఎక్కడ జగన్ రెడ్డి విభజన హామీలు ఎక్కడ సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి సంబంధం లేని ముగ్గురు వ్యక్తులకు రాజ్యసభ ఎలా కట్టబెడతారో ప్రజలకు చెప్పాలి? అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పనిచేసే ప్రతి మీడియా సంస్థలో పనిచేసేవారికి విలువ లేకుండా చేస్తున్నారన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *