”మహాశక్తితో లోకేష్” పేరుతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి సమావేశం

”మహాశక్తితో లోకేష్” పేరుతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి సమావేశం

2024లో టిడిపి లీడింగ్ వార్తతోనే అరాచకశక్తుల పరార్!
మహిళల వంక కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం
నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను!
నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలుచేసి రక్షణ కల్పిస్తాం
తల్లీ, చెల్లికి న్యాయం చేయలేని వాడు మహిళలకేం చేస్తాడు?
అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే మహిళలకు మహాశక్తి
పేదరికం లేని రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దడమే టిడిపి లక్ష్యం
“మహాశక్తితో లోకేష్” కార్యక్రమంలో యువనేత లోకేష్

2024లో ఎన్నికల ఫలితాల్లో టిడిపి లీడింగ్ లో ఉందన్న వార్తలు వెలువడే సమయంలోనే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఆగిపోతాయని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో “మహాశక్తితో లోకేష్” పేరుతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమై మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకు న్నారు. ఈ కార్యక్రమానికి కడపకు చెందిన 10రూపాయల డాక్టర్ నూరిఫర్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మినహా ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాని నా తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు, ఎపి చరిత్రలో తొలిసారిగా రాజకీయాలు ఇంతలా దిగజారి పోయాయి. నెలరోజులపాటు అమ్మ మానసిక క్షోభ అనుభవించింది, ఇప్పటికీ వైసిపి నాయకులు అవమానిస్తూనే ఉన్నారు, అధికారంలోకి వచ్చాక నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను, మహిళలను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. నిర్భయ చట్టాన్ని అమలుచేయడం ద్వారా పటిష్టమైన రక్షణ కల్పిస్తాం.

సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మహిళలకేం న్యాయం చేస్తాడు? 145రోజుల సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకున్నాకే మహాశక్తి కార్యక్రమాన్ని మహానాడు సాక్షిగా చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలిఏడాదిలోనే ఈ కార్యక్రమాన్ని అమలుచేసి తీరుతాం. అప్పులు చేయడం ద్వారా కాకుండా అభివృద్ధి ద్వారానే సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. పేదరికం లేని రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దడమే టిడిపి లక్ష్యం. మహిళలను గౌరవించాలన్న ఆలోచన మనసులో రావాలి. ఇందుకోసం కెజి నుంచి పిజి వరకు మహిళలను గౌరవించాలనే ప్రత్యేక పాఠ్యాంశాలు తెచ్చి, సామాజిక చైతన్యం తెచ్చే బాధ్యత తీసుకుంటాం. చట్టసభల్లోకి విద్యావంతులను ఎన్నుకోవడం ద్వారా చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయి, అందుకే తెలుగుదేశం పార్టీ విద్యావంతులు, ఇంజనీర్లు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించింది. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించి, సామాజిక చైతన్యం కల్పిస్తాం. అంగన్ వాడీలకు జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరించి పీజీ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తాం. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో ఫీజు బకాయిల కారణంగా నిలచిపోయిన సర్టిఫికెట్లను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా విద్యార్థులకు అందజేస్తాం. అభివృద్ధి, సంక్షేమాలను జోడెడ్ల బండిలా కొనసాగించి, ప్రపంచంలోనే రాష్ట్రాన్ని నెం.1 గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తాం.

“మహాశక్తితో లోకేష్” కార్యక్రమంలో మహిళల ప్రశ్నలు – యువనేత సమాధానాలు:

నూరి ఫర్వీన్ : మీకు ఆడపడుచులు లేరు. మీరు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మహిళలకు ఏవిధంగా అండగా నిలుస్తారు?
లోకేష్ : నేను చిన్నప్పటి నుండి చెల్లి కావాలని అమ్మని అడిగేవాడిని. బ్రాహ్మణి గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. నా తల్లి భువనేశ్వరి నన్ను చిన్ననాటి నుండి క్రమశిక్షణతో పెంచింది. ఇప్పటికీ నేను ఏదైనా తప్పు మాట్లాడితే అమ్మ ఊరుకోదు. సమాజంలో తల్లులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని నేను కోరుకుంటాను. అంగన్వాడీకి పిల్లలను పంపుతున్న నాటి నుండి తల్లులు బిడ్డలకు క్రమశిక్షణ, మహిళలను గౌరవించాలనే బుద్ధిని నేర్పాలి. అంగన్ వాడీకి పంపే దగ్గరనుంచి మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించాలి. మహిళలను గౌరవించాలన్నది మనసునుంచి రావాలి.

ప్రశ్న : పాదయాత్ర చేస్తున్న ఈ సమయంలో ఫ్యామిలీని మిస్ అయినట్లు అన్పించడం లేదా?
లోకేష్ : నేను నా కొడుకు దేవాన్ష్ ను బాగా మిస్ అవుతున్నా. వాడితో నేను బాగా ఆడుకుంటాను. కానీ రాష్ట్రంలో మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు తమ సమస్యలు చెప్పుకునే వేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నేను యువగళం పాదయాత్రను చేపట్టాను. యువతలో చైతన్యం తీసుకురావాల్సి ఉంది. రాష్ట్రంలో యువత బాగా వెనుకబడిపోయారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరో పాత బీహార్ ను తలపిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నా.

సుబ్బాయమ్మ : అసెంబ్లీలో రోజా మహిళల గురించి ఏదేదో మాట్లాడుతుంది. కానీ రాష్ట్రంలో మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరూ మాట్లాడడం లేదు. ఆత్మ రక్షణ కోసం గన్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితులు మాకు లేవు. మీరు అధికారంలోకి వస్తే మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు?
లోకేష్ : కేంద్రం నివేదికల ప్రకారం ఏపీలో ప్రతిగంటకు మహిళలపై 2 దాడులు, మానభంగాలు వంటివి జరుగుతున్నాయి. ఏపీలో చట్టాలు ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. వైసిపి ఎమ్మెల్యేలు, మహిళామంత్రులు మహిళలను అవమానించే పరిస్థితి. మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను వేసుకోమని చెప్పింది. ఆమె దృష్టిలో చీర, గాజులు వేసుకునే వారు చేతకాని వాళ్లు. తెలుగు మహిళ నాయకులు రోజాకు చీర,సారె ఇవ్వడానికి వెళితే పోలీసులు చితకబాదారు. మహిళల పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఇది. సీఎం నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మను దారుణంగా రేప్ చేసి చంపేస్తే సీఎం పట్టించుకోలేదు. పరామర్శకు వెళ్లిన టీడీపీ ఎస్సీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం నమోదు చేశారు. మహిళలకు అన్నింటిలో సమాన హక్కు, మాట్లాడే హక్కు ఉంటుందని గుర్తుచేయడమే నా లక్ష్యం. చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించడం మా లక్ష్యం. చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేయడం బాబుగారి నైజం. వైసీపీ పాలనలో చట్టాలు కొందరికి చుట్టాలయ్యాయి.

ప్రశ్న : అంగన్వాడీ కార్యకర్తలం 48 ఏళ్లుగా గర్భవతులు, బాలింతలకు మేం సేవలు చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదు. పనిభారం పెరిగింది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఉద్యోగ భద్రత, సంక్షేమపథకాలు అమలు చేస్తారా?
లోకేష్ : టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల వేతనాలు పెంచుతాం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం. అంగన్వాడీలందర్నీ ఆదుకుంటాం. వైసీపీ ప్రభుత్వంలో మహిళలు మాట్లాడినా, పోస్టులు పెట్టినా, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినా వారిపై వైసీపీ వీధి కుక్కలు అసభ్యంగా పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు. ఇలాంటి వారిని మేం అధికారంలోకి వచ్చాక వదిలే పరిస్థితి లేదు.

ప్రశ్న : ప్రియాంక, సైకాలజిస్టు డాక్టర్: విద్యావిధానంలో సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విధానాలను వదిలేశాం. పిల్లలు నేటి కాలంలో అనేక రకాల మానసిక, శారీకర రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక పాఠశాల స్థాయి నుండే పిల్లలకు మానసిక, శారీరక నైపుణ్యాలకు సంబంధించిన పాఠ్యాంశాలను అమలుచేస్తారా?
లోకేష్ : వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని మానసిక ఒత్తిడికి గురిచేయడం, అవమానించడం, అసభ్యంగా మాట్లాడడం వంటివి చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక కేజీ టు పీజీ విద్యా విధానంలో పూర్తిగా మార్పులు తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సిలబస్ మారుస్తాం. ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ విధానాలపై అవగాహన పెంచడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా పెంచుతాం.

నూరి ఫర్వీన్ : మహిళల రక్షణ కోసం చట్టాలు చేసే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన మీ అమ్మను అవమానకరంగా మాట్లాడినప్పుడు మీరు ఎలా స్పందించారు?
లోకేష్ : నాతల్లిని వైసీపీ నాయకులు శాసనసభ సాక్షిగా అవమానించారు. నా తల్లి ఏనాడూ బయటకు రాలేదు, ఏ తప్పూ చేయలేదు. వైసీపీ వాళ్లు మాట్లాడిన మాటలకు నా తల్లి దాదాపు నెలరోజులు మానసిక క్షోభ నుండి బయటపడలేకపోయారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు రక్షణ ఉందా లేదా అని ప్రతి మహిళ ఆలోచించాలి. జగన్ పాలనలో రాజకీయాలు దిగజారిపోయాయి అనడానికి నా తల్లికి జరిగిన అవమానమే. నా తల్లికి జరిగిన అవమానం మరో తల్లికి జరగకూడదనేది మా అభిమతం. అసెంబ్లీలోనే మహిళలకు గౌరవం దక్కకపోతే సభ్య సమాజంలో ఎలా గౌరవం లభిస్తుంది. నా తల్లిని అవమానించిన వారిని ముఖ్యమంత్రి జగన్ కనీసం మందలించకపోగా వెకిలినవ్వులు నవ్వి తమ నాయకులను ప్రోత్సహించారు. మేం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని మహిళలను అవమానించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.

పార్వతి, కావలి: మాది కావలి. నా భర్త చనిపోయి 2సంవత్సరాలు పూర్తయ్యింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలిలో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను. నా కొడుకు బీటెక్ చదువుతున్నాడు. వ్యాపారం కోసం రూ.50వేలు అప్పు తీసుకుంటే వైసీపీ నాయకుడు నా వద్ద రూ.65వేలు వడ్డీ కట్టించుకున్నారు. అప్పు కట్టాలని నా మీదకు రాత్రి పూట 15మంది ఆడవాళ్లు, మగవాళ్లు తాగివచ్చి నా బిడ్డ, తల్లి ఎదుటే నడిరోడ్డు మీద పడేసి ఒంటిమీద చీర లేకుండా కొట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసు స్టేషన్ కు వెళ్లాను. అక్కడ నాకు న్యాయం జరగలేదు. స్టేషన్ నుండే నా తల్లికి ఫోన్ చేసి బాధను చెప్పుకున్నాను. నా కొడుకు చూస్తూ ఉండగానే వాళ్లు నన్ను కొట్టారు. అవమానం భరించలేక పోలీసు స్టేషన్ లోనే పురుగుల మందు తాగాను. నా కుటుంబ సభ్యులు నన్ను కాపాడుకున్నారు. నన్ను కొట్టి నాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు. మీరే నాకు న్యాయం చేయాలి.
లోకేష్ : మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, దాడులు చేయడం వైసీపీ నాయకులకు అలవాటైపోయింది. నీ తరపున లోకేష్ పోరాడతాడు. నీకు అండగా ఉంటాను. మేం అధికారంలోకి నిన్ను కొట్టినవాళ్లు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటాను. మరో ఆడపడుచుకు నీకు జరిగిన అవమానం జరగకుండా కాపాడుకుంటాం.

ప్రశ్న : ఎన్టీఆర్, చంద్రబాబు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 4ఏళ్లు పూర్తయినా మహిళల కోసం ఏమీ చేయలేదు. రాష్ట్రం 15ఏళ్లు వెనక్కి వెళ్లింది. మీరు అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని ఎలా కొనసాగిస్తారు?
లోకేష్ : అన్ని రంగాల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం మా లక్ష్యం. మేం అధికారంలోకి ఉండగా జిఎస్ డిపిలో నెం.1, పెట్టుబడుల్లో టాప్ -3 గా నిలచేది. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి. తాము ఇచ్చే పప్పు, బెల్లాలు మీదే పేదలు బ్రతకాలనేది జగన్ ధ్యేయం. మేం అధికారంలోకి వచ్చాక గతంలో ఏ విధంగా రాష్ట్ర పరిస్థితులు ఉండేవో వాటిని మళ్లీ పునరుద్ధరిస్తాం. ప్రపంచానికి ఏపీ ప్రజల టాలెంట్ ను పరిచయం చేస్తాం. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులను మారుస్తాం. ప్రపంచంలోనే నెం.1గా ఎపి తీర్చిదిద్దుతాం.

లావణ్య : మహాశక్తి ద్వారా మ్యానిఫెస్టోలో మహిళలకు నెలకు 1500 ఇస్తామన్నారు, గ్యాస్ సిలెండర్లు, ఉచిత బస్సు, ప్రతిబిడ్డకు 15వేలు, ఎప్పటినుంచి అమలుచేద్దామనుకుంటున్నారు? మద్యపాన నిషేధం ఎంతవరకు సాధ్యం? 70శాతం మహిళలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయనాయకులు చాలామంది గ్రాడ్యుయేట్స్ కాదు, విద్యావంతులను ఎన్నుకుంటే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి, టెన్త్ చదువుకున్న వారికి, సలహాదారులకు ఐఎఎస్, ఐపిఎస్ సలాం కొడుతున్నారు. ఈ పరిస్థితిని మీరు అయినా మారుస్తారా?
లోకేష్ : నేను స్టాన్ ఫర్డ్ లో చదివా, 2019లో మంగళగిరి ప్రజలు నన్ను తిరస్కంచారు, ప్రజలు ఆలోచించాలి. టిడిపి అధికారంలోకి వచ్చాక డాక్టర్లు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చారు. యనమల, గల్లా జయదేవ్, రాబోయే రోజుల్లో ఉన్నత విద్యావంతులకు అవకాశం కల్పిస్తాం. మంత్రులకన్నా ఎడ్వయిజర్స్ కు ఎక్కువ జీతాలు, ప్రభుత్వం కూడా ఎడ్వయిజర్ చేతిలో నడవడం బాధాకరం. అది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మహాశక్తిని అమలుచేస్తాం. సంక్షేమంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పేదవాళ్లకు అండగా నిలబడేది ప్రభుత్వం. సంక్షేమంపైనే నడవడం సాధ్యం కాదు, అభివృద్ధి కూడా ముఖ్యం, ఎకనమిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. ఈ ప్రభుత్వం అభివృద్ధి ఆపేసింది, అప్పులు చేసి సంక్షేమం అమలు, అప్పులు తీర్చాల్సింది మనమే, 9సార్లు విద్యుత్, 3సార్లు ఆర్టీసి చార్జీలు పెంచారు. పెట్రోల్, డీజిల్ పై అత్యధిక పన్నులు ఇక్కడే. ఈ భూమిపైనే ఎవరూ శాశ్వతం కాదు, ఎపి ప్రజలు శాశ్వతం, అభివృద్ధి ద్వారానే సంక్షేమం చేయాలన్నది మా లక్ష్యం. ఎపిలో మద్యనిషేధం జరగదు, మద్యంపై ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పుతెచ్చారు, రాబోయే 25సంవత్సరాలు ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. అందుకే మద్యం ధరలు విపరీతంగా పెంచారు. ఊరూరా వైన్ షాపు ఉంది, పరిశ్రమలు రాలేదు, మద్యం షాపుల ఉద్యోగులను టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారు, టిడిపి అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రిస్తాం, సమాజంలో చైతన్యం తెస్తాం.

అఖిల, డెంటల్ డాక్టర్ : గత నాలుగేళ్లుగా డెంటల్ విధానంలో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు లేవు. మీరు వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
లోకేష్ : మిగిలిన దేశాల్లో డెంటల్ విభాగంపై ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చుపెట్టి కార్యక్రమాలు అమలుచేస్తారు. కానీ ఏపీలో గత నాలుగేళ్లలో దంత సమస్యలపై ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. ఏపీలో డెంటల్ సమస్యలపై అవగాహన తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. మేం అధికారంలోకి వచ్చాక అనేక వర్క్ షాపులు నిర్వహించి డెంటల్ సమస్యలపై అవగాహన పెంచుతాం.

సుజాత, గైనకాలజిస్ట్ డాక్టర్ : మేం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో సర్టిఫికెట్లు తీసుకున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం నేడు యూనివర్శిటీ పేరు మార్చేసింది. రేపు మేం ఎక్కడికైనా వెళ్లాలంటే మా సర్టిఫికెట్ లోని యూనివర్శిటీ పేరు లేకపోయింది. మీరు వచ్చాక యూనివర్శిటీల పేర్లు మార్చకుండా చర్యలు తీసుకుంటారా?
లోకేష్ : ఏపీ ముఖ్యమంత్రి లక్షకోట్లు ప్రజా ధనాన్ని లూఠీ చేశాడు, అతనిపై 12 సీబీఐ చార్జి షీట్లు ఉన్నాయి. ఇతను 16నెలలు జైలులో ఉండి వచ్చాడు. ఏపీ ప్రజలు ఇలాంటి దొంగకు తాళాలు ఇచ్చినట్లుగా ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టారు. 1983కు ముందు సిద్ధార్థ మెడికల్ కాలేజీ తప్ప హెల్త్ యూనివర్శిటీ ఏపీలో లేదు. ఎన్టీఆర్ కేంద్రంతో మాట్లాడి ఏపీలో సిద్ధార్థ కాలేజీని హెల్త్ యూనివర్శిటీగా మార్పు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చారు, జగన్ ఆత్మలతో మాట్లాడి బిల్లుపెట్టి పేరు మార్చేశారు, బాబుగారు సిఎంగా ఉన్నపుడు వైఎస్సార్ కడపను మేము మార్చలేదు, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చుతాం. ఇంటిపట్టాలు, డ్రైవింగ్ లైసెన్సులపై కూడా ఆయన ఫోటో ఉంటోంది. ఇటువంటివి లేకుండా చట్టమే తెస్తాం.

కొడకలి వెంకటలక్ష్మి, గూడూరు : గూడూరు పక్కన చెన్నూరు మాది, మా అమ్మాయిని పొరుగున ఊళ్లో ఇచ్చాం, కొంతకాలం తర్వాత భర్త మా అమ్మాయిని ఇంటివద్ద దించి వెళ్లాడు, తర్వాత తాళిబొట్టుతో పాటు పెరుక్కుని తీసుకెళ్లాడు, నా కూతరు కూలీ పనికి రోడ్డుపై నరికి చంపాడు, ముగ్గరు పిల్లలు అనాధలయ్యారు. మాకు న్యాయం చేయాలని ఎందరో కాళ్లు పట్టుకున్నాను, ఎవరూ సమాధానం చెప్పలేదు, బడికి పంపే స్థోమత లేదు, నా కుమార్తెను చంపినవాడు నన్ను ఎవరు ఏం చేస్తారని అంటున్నారు, మీరే న్యాయం చేయాలి.
లోకేష్ : నీ కూతురు పిల్లలను చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. న్యాయ పోరాటం చేద్దాం. మీకు అండగా నేను ఉంటాను. ఏపీలో లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా ప్రభుత్వం మభ్య పెడుతోంది. దిశ చట్టంతో మహిళలను జగన్ మోసం చేస్తున్నాడు. నర్సరావుపేటలో అనూషను చంపేస్తే నిందితుడు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నాడు. డిగ్రీ కూడా చదవని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఇలాగే ఉంటుంది.

విజయలక్ష్మి : జగన్ సొంత చెల్లెళ్లకే న్యాయం చేయడం లేదు. మాకేం న్యాయం చేస్తాడు? మీరు అధికారంలోకి వచ్చాక మాకు అండగా నిలబడతారా?
లోకేష్ : 2019లో సాక్షి పత్రిక మొదటి పేజీలో నారాసుర రక్తచరిత్ర అంటూ ఫుల్ పేజీ వార్త రాశారు. కానీ చివరకు నిందితులంతా జగన్ కుటుంబ సభ్యుల్లోనే ఉన్నారు. వీళ్లంతా సీబీఐ కేసుల్లో ఇరుక్కుని, బయటపడేందుకు అనేక డ్రామాలు ఆడుతున్నారు. జగన్ తల్లిని, చెల్లిని ఉపయోగించుకుని సీఎం అయ్యాక వాళ్లను ఇంటి నుండి తరిమేశాడు. జగన్ సొంత చిన్నాన్న వివేకా కూతరు సునీతకు కూడా రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడో లేదో మహిళలంతా ఆలోచించాలి. మహిళలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు. దీన్ని ఆయన అనేక కార్యక్రమాల ద్వారా నిరూపించారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తాం. ఏపీ చరిత్రలో తొలి మహిళా స్పీకర్ ను తెచ్చింది టీడీపీ.

పఠాన్ ఫరీహా, కావలి : నా భర్త పేరు అమీర్ ఖాన్. మాది కావలి. వైసీపీ నాయకులు నా భర్తను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. మేం ప్రహరీ కట్టుకుంటే దాన్ని జేసీబీతో కూల్చేశారు. ఆ సమయంలో ఆ గోడకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఉన్న పక్షులు, కుందేళ్లు చనిపోయాయి. మాతోపాటు మాకు మద్దతుగా ప్రశ్నించిన టీడీపీ నాయకులు 12మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టి వేధిస్తున్నారు.
లోకేష్ : వైసీపీ ప్రభుత్వం ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతోంది. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే 15ఏళ్ల బాలుడు తన అక్కని వేధిస్తున్న వారిని ప్రశ్నించినందుకు వైసీపీ నాయకులు అతన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. వైసీపీ నాయకులు ఏపీని పాత బీహార్ లా మర్చేస్తున్నారు. ఏపీ పరిస్థితులన్నీ మార్చాలంటే టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉంది. మేం అధికారంలోకి వచ్చాక చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెట్టారో వారిపై జ్యుడీషియల్ విచారణ జరిపించి, ఉద్యోగాల నుంచి తొలగిస్తాం.

అనూరాధ : మీరు అధికారంలో ఉండగా కోటి మంది మహిళలకు పసుపు, కుంకుమ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కారు, ఏసీ ఉందనే పేరుతో సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేస్తారా?
లోకేష్ : జగన్ కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్. చార్జీలు, రేట్లు అన్నీ పెంచేసి, కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చాయి, కారు ఉంది అంటూ పథకాల్లో కోత పెడుతున్నారు. జగన్ వివిధ కారణాలు చూపి 6లక్షల మందికి పెన్షన్లు రద్దు చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక ఇలాంటి పరిస్థితులు రాకుండా చూస్తాం. చదువుకునే పిల్లలందరికీ ప్రోత్సాహం అందించాలనే తల్లికి వందనం కార్యక్రమాన్ని తెస్తున్నాం.

దేదీప్య, ఎంసీఏ విద్యార్థిని : వైసీపీ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. మీరు వచ్చాక పునరుద్దరిస్తారా?
లోకేష్ : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ-77తో ఫీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను రద్దు చేశారు. పీజీ చదువుకున్నవాళ్లు ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తెస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2లక్షల మంది సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలకు వెళ్లడం లేదు. ఇలాంటి వారికి ఒటిఎస్ ద్వారా సర్టిఫికెట్లు ఇప్పిస్తాం. జగన్ రద్దు చేసిన విదేశీవిద్య పథకాన్ని కూడా పునరుద్ధరిస్తాం. కేజీ టు పీజీ సిలబస్ ను మార్చి నైపుణ్యశిక్షణతో కూడిన విద్యను అందిస్తాం.

అనూష : మేము చాలా మధ్యతరగతి వాళ్లం. మాకు ఎలాంటి రాజకీయ బలం లేదు. మాలాంటి వాళ్లకు మీ పార్టీలో సీట్లు ఇస్తారా?
లోకేష్ : గ్రాడ్యుయేట్స్ చేసిన వారికి మేం ఒక వేదిక ఏర్పాటు చేసి మీలాంటి వారి సేవలను సమాజహితం కోసం ఉపయోగిస్తాం.

నూరి ఫర్వీన్ : డాక్టర్ చదివిన వారికి సరైన ఉద్యోగం దొరికే పరిస్థితులు లేవు. పీజీ చదివే స్థోమత లేక ఆగిపోతున్నాం. మీరు ఎలా ప్రోత్సహిస్తారు?
లోకేష్ : ఈ ప్రభుత్వం వచ్చాక రిక్రూట్ మెంట్ లేదు, ఎపిపిఎస్ సి రీవ్యాంప్ చేయాలి. జాబ్ నోటిఫికేషన్స్ టైం ప్రకారం ఇవ్వాలి, పద్ధతి ప్రకారం 5ఏళ్లలో ఉద్యోగాలు భర్తీచేస్తాం.

సుధ : దిశ చట్టం వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఎవరికీ మహిళలకు రక్షణ దొరకడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ కోసం ఎలాంటి చట్టం తెస్తారు?
లోకేష్ : జగన్ దేశంలో బలంగా ఉన్న నిర్భయ చట్టాన్ని కాదని దిశ చట్టం తెచ్చాడు. కానీ ఇది చట్టరూపం దాల్చలేదు. మహిళలపై దాడులు చేసిన వారిని శిక్షిచండం లేదు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం అధికారంలోకి వచ్చాక నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం.

ప్రశ్న : నా భర్త కాంట్రాక్టర్. టీడీపీ పాలనలో మేం అనేక పనులు చేశాం. వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా ఆపేసింది. మా పిల్లలను చదివించుకునే పరిస్థితి కూడా లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఏమైనా సాయం చేస్తారా?
లోకేష్ : గతంలో ఏ ప్రభుత్వమూ అంతకు ముందు ఉన్న పథకాలు రద్దు చేయలేదు. చేసిన పనులు బిల్లులు పెండింగ్ పెట్టలేదు. జగన్ రూ.1.30లక్షల కోట్లు బిల్లులు బకాయిలు పెట్టాడు. కాంట్రాక్టర్లను వేధిస్తున్నాడు. చట్టంలో ఉన్న ప్రకారం పెండింగ్ బిల్లులు వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేం తీసుకుంటాం.

సుధాలక్ష్మి : విద్యార్థులపై బలవంతంగా రుద్దబడిన ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేసి, విద్యార్థులకు మీడియం ను ఎంచుకునే స్వేచ్ఛనిస్తారా?
లోకేష్ : మీడియం ను ఎంచుకోవాల్సిన స్వేచ్చ, హక్కు విద్యార్థులకు ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం బలవంతంగా ఇంగ్లీషు మీడియం ను విద్యార్థులపై రుద్దుతోంది. మేం అధికారంలోకి వచ్చాక ఇంగ్లీషు మీడియం తప్పని సరి నిబంధనను రద్దు చేస్తాం. విద్యార్థులకు స్వేచ్ఛనిస్తాం

జ్యోతి : తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక నీరు ఇస్తారా?
లోకేష్ : పాదయాత్రలో కొన్నిచోట్ల మహిళలు 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని చూశాను. మేం అధికారంలోకి ప్రతి ఇంటికీ ఉచితంగా నీటి కుళాయి అందజేసే బాధ్యత తీసుకుంటాం, శుద్దిచేసి తాగునీటిని అందజేస్తాం.

రజని : ప్రభుత్వ పక్కా ఇళ్లను అందిస్తారా?
లోకేష్ : పేదవాళ్లకు పక్కా ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేం టిడ్కో ఇళ్లు కట్టించాం. కానీ జగన్ వాటిని ఇవ్వడం ఇష్టం లేక పెండింగ్ పనులు పూర్తిచేయకుండా, లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తాం. గ్రామాల్లో పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం. గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టాలంటే రూ.7లక్షలు ఖర్చవుతోంది. కట్టలేక ఇళ్లు వదిలేస్తున్నారు. కానీ ప్రజలు పక్కా ఇంటిని కోరుకుంటున్నారు. ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మేం అధికారంలోకి వచ్చాక మెరుగైన టెక్నాలజీతో గ్రామాల్లో కూడా టిడ్కో తరహా ఇళ్లు నిర్మిస్తాం.

రమాదేవి, న్యాయవాది : నెల్లూరులో ఓ జడ్జిని గంజాయి బ్యాచ్ వేధించింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నెల్లూరు మేయర్ ను వేధిస్తే పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అసభ్యంగా పోస్టులు పెట్టి వేధిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా పోలీసులను ప్రయోగించి వేధిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో గ్యాంగ్ రేప్ అనే సంస్కృతి వచ్చింది. వీటిని నివారించేందుకు మీరు అధికారంలోకి వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
లోకేష్ : ఏపీ ప్రజలు గంజాయి, జగన్ కు బైబై చెప్పాలి. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు డీలర్ల ద్వారా గంజాయి అన్ని ప్రాంతాలకు సప్లయ్ చేస్తున్నారు టీడీపీ పాలనలో గంజాయి సాగవుతున్న విశాఖ ప్రాంతంలో పటిష్టమైన నిఘా పెట్టి అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. గంజాయి సాగుచేసే వారిని మార్చి, వాళ్లతో కాఫీ తోటలు పండించేలా ప్రోత్సహించాం. ఏపీలో యువతులను వైసీపీ నాయకులు గంజాయికి బానిసలుగా చేసి లైంగికంగా వేధిస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక గంజాయిని అరికడతాం. చట్టాలను పటిష్టం చేసి గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతాం. నాయకుడు సక్రమంగా ఉంటే ఇలాంటివి జరగవు, సమాజంలో భయం లేదా భక్తి ఉండాలి, వైకాపా నాయకులే మహిళలను కించపర్చేలా వ్యవహరిస్తున్నారు.
2024లో టిడిపి లీడింగ్ అని రాగానే అన్ని అరాచకాలు బంద్ అవుతాయి, లోకేష్ తప్పుచేసినా బాబుగారు వదిలిపెట్టరు, చట్టాలను చుట్టాల్లా వాడుతున్నారు, మేం వచ్చాక ఆటోమేటిక్ గా నేరాలు కంట్రోల్ అవుతాయి.

ప్రశ్న : రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మీరు ఎలా పరిష్కరిస్తారు?
లోకేష్ : టీడీపీ పాలనలో సైబర్ నేరాల నియంత్రణకు అమరావతిలో ఓ కేంద్రం పెట్టాం. కానీ జగన్ పాలనలో సైబర్ నేరాలు పెరిగాయి. నేటి టెక్నాలజీలో ఒక్క బటన్ దూరంలో వసతులు అందుబాటులో ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చాక సైబర్ నేరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న : నాకొడుకు కూరగాయలు తేవడానికే బయటకు వెళ్లడు, అలాంటిది 4వేల కి.మీ. ఎలా తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మాకే బాధ కలుగుతోంది.
లోకేష్ :  ప్రజల ఆదరణే నన్ను నడిపిస్తుంది, ప్రజల్లో చైతన్యం తెస్తాం, సైకో పోతాడు, సైకిల్ వస్తుంది. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బాధలు చెప్పుకుంది, ఎమ్మెల్యే షాపు ధ్వంసం చేశారు, వెంటనే బాబుగారు అమరావతి పిలిపించి ఆదుకున్నారు, ఎంతోమందిని ఈ ప్రభుత్వం బలిచేసింది. రోడ్డుపైకి లాగుతోంది. మహిళలకు రక్షణ కరువైంది. మహిళలు, ప్రజల్లో చైతన్యం తెచ్చి సైకో పాలనను అంతం చేయడమే నా లక్ష్యం. దీనికోసం ఎంత దూరమైనా నడుస్తా.

మునిరాజమ్మ : వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు మమ్మల్ని రోడ్డున పడేశారు. మీరు నన్ను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు.
లోకేష్ : వైసీపీ నాయకులు వేధిస్తే…మేం ఆదుకుంటాం. అది మా చిత్తశుద్ధి. మహిళలకు మేం ఎప్పడూ అండగా ఉంటాం.

అమ్మలేనిదే ఈ సృష్టి లేదు. మహిళలకు నిజమైన స్వాతంత్ర్యాన్ని తెచ్చింది అన్న ఎన్టీఆర్. ఆస్తిలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. చంద్రబాబు వచ్చాక మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని డ్వాక్రా ద్వారా తెచ్చారు. 1999లో చంద్రబాబు 70లక్షల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. నేడు జగన్ పాలనలో గ్యాస్ కొనలేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు మహిళల కోసం 2014-19 మధ్య 17 సంక్షేమ పథకాలను అమలు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలంటే ఎవరైనా, ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా భయపడేవారు. ఒంగోలులో ఓ వ్యక్తి మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని భయపడి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విధంగా మహిళలను మేం కాపాడుకున్నాం. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయి. నిత్యావసరాలు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్, డీజిల్, టమోటా, పచ్చిమిర్చి సెంచరీ కొట్టాయి. మహిళలపై భారం పెరిగింది. జగన్ ఎన్నికల సమయంలో అమ్మఒడి ప్రతి విద్యార్థికి ఇస్తానని మోసం చేశారు. 45ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశాడు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు. నా ముందు మరో 2వేల కిలోమీటర్ల పాదయాత్ర ఉంది. మహిళల కష్టాలు తెలుసుకుని వారి కన్నీళ్లు తుడవడానికి సిద్ధంగా ఉన్నాను.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *