ప్రజలు చైతన్యవంతులై తిరుగుబాటు చేయాలి ఆదోని సభలో నారా లోకేష్ పిలుపు

ప్రజలు చైతన్యవంతులై తిరుగుబాటు చేయాలి ఆదోని సభలో నారా లోకేష్ పిలుపు

జగన్ ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉంది
ఈ గడ్డపై 1000 కి.మీ చేరుకోవడం నా అదృష్టం
జగన్ కుటుంబం బతుకంతా చంచల్ గూడా జైల్లోనే
త్వరలో అబ్బాయిలిద్దరూ జైలులో ఉప్మా తినాల్సిందే
మంత్రి సురేష్ కు దమ్ముంటే జగన్ ను నిలదీయాలి
ఎస్సీలను కించపర్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
నిరూపించలేకపోతే సాక్షి టీవి, పేపర్లను మూసేస్తారా?
భారతీ రెడ్డికి యువనేత నారా లోకేష్ సవాల్

ఈ గడ్డపై నా పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకోవడం నా అదృష్టం. ఇంకా 3వేల కిలోమీటర్లు నడవాల్సి ఉంది. ప్రజల ఆశీర్వాదంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశాను. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నదే నా కల. పాదయాత్ర పూర్తయ్యేలోపు ప్రజల్లో చైతన్యం వచ్చి తిరుగుబాటు చేయాలి. జగన్ ను తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదోని శివారు కడికొత్త క్రాస్ వద్ద జరిగిన బహిరంగసభ లో యువనేత లోకేష్ మాట్లాడుతూ పాదయాత్ర ఆపడానికి పరదాల జగన్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఆయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకుంటే నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకుని ముందుకు సాగాను. ప్రజల్లో మార్పు మొదలైంది. కమలాపురం ఎస్సీ కాలనీలో ప్రజలు తాళాలు వేసుకొని వెళ్లారు. జగన్ కు బైబై రోజు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. తనకు సొంత పేపర్, టీవిలు లేవని జగన్ చెబుతున్నారు. సాక్షి పేపర్, టివి ఎవరివి? 5రూపాయల పేటిఎం బ్యాచ్ ఎవరిది? భారతదేశంలోనే అతి ధనవంతుడు ఎవరు? నన్ను నేరుగా ఎదుర్కోవడం చేతగాక భారతీరెడ్డిని రంగంలోకి దించాడు.

దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఏమి లేదు అని నేను అంటే ఆవిడ గారు లోకేష్ దళితుల్ని అవమానించాడు అంటూ గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టింది. ఎస్సీలను నేను కించపర్చినట్లు సాక్షిలో తప్పుడు రాతలు రాశారు. దీనిపై భారతీరెడ్డికి సవాల్ విసిరా, సౌండ్ రాలేదు. ఇప్పుడు చెబుతున్నా… సాక్ష్యాధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా, నిరూపించ లేకపోతే సాక్షిని మూసేస్తారా… ఇదే నా సవాల్? జగన్ ఒక ఊసరవెల్లి 3రాజధానుల నాటకమాడుతున్నాడు. కర్నూలుకు ఒక్క ఇటుక అయినా వేశాడా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు చాచికొట్టారు, ఇప్పుడు ఉందిగా సెప్టెంబర్, మార్చిపైనా అని పాడుతున్నారు. జగన్ కుటుంబం మొత్తం చంచల్ గూడా జైలులో బతుకుతోంది. పోకిరి సినిమాలో ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బ్రతికేస్తున్నారా అనే డైలాగ్ ఉంది. రేపో,మాపో అబ్బాయిలిద్దరూ చంచల్ గూడా జైలుకెళ్లి ఉప్మా తినాల్సిందే. కోడికత్తి డ్రామాను రక్తికట్టించేందుకు జబర్దస్త్ ఆంటీ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రజలకు అంతా అర్థమైంది. దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి మరీ చంద్రబాబును అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు.

మార్పు మొదలైంది. త్వరలో జగన్ కు బైబై

యువగళంతో మార్పు మొదలైందని లోకేష్ చెప్పారు. పరదాల జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డికి ప్రజలు షాక్ ఇచ్చారు. దేవరాజుపల్లె ఎస్సీ కాలనీలో గడపగడపకు కార్యక్రమానికి వెళ్తే ఊరు మొత్తం తాళం వేసుకొని వెళ్లిపోయారు. త్వరలో రాష్ట్రం మొత్తం తాళం వేసి పరదాల జగన్ కి బై బై చెప్పడం ఖాయం. నిసిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట. జగన్ కి డబ్బు లేదంట… వైసిపి భాషలో అడుగుతున్నా దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరు? జగన్ మాటలు వింటే అబద్దమే సిగ్గుపడుతుంది. విశాఖలో కాపుర పెడతానంటున్నాడు. నువ్వు బెంగుళూరు లో కాపురం పెట్టావ్, హైదరాబాద్ లో కాపురం పెట్టావ్, తాడేపల్లి లో కాపురం పెట్టావ్, ఇడుపులపాయలో కాపురం. కాపురం పెట్టడం కాదు… అమూల్ బేబీ ఏం పీకామ్ అన్నది ముఖ్యం. 2024 జగన్ లండన్ లో కాపురం పెట్టడం ఖాయం. ఆదోని అదిరిపోయింది. ఈ విజువల్ చూస్తే జగన్ ముఖచిత్రం మాడిపోవడం ఖాయం. ఆదోనిని రెండో ముంబై అని పిలిచేవారు. శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ మహాయోగి లక్ష్మమ్మ దేవాలయము, షాహి జామియా మసీదు ఉన్న పవిత్రమైన నేల ఆదోని. రాష్ట్రంలోనే అతి పెద్ద పత్తి మార్కెట్ ఉన్న ప్రాంతం ఆదోని. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ పుణ్యభూమి ఆదోని లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టమన్నారు.

జగన్ మహానటుడు, మేలు చేస్తున్నట్లు కలరింగ్

జగన్ బ్రహ్మాండమైన నటుడు. పైకి ప్రజలకు మేలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తాడు. తెలియకుండా మొత్తం దోచేస్తాడు అని లోకేష్ హెచ్చరించారు. అందుకే ఆయనకి కోడికత్తి జగన్ అని పేరు పెడుతున్నా. కోడికత్తి జగన్ రెండు పనికిమాలిన కార్యక్రమాలు తెచ్చాడు అందులో ఒకటి శాశ్వత గృహ హక్కు పధకం. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి దగ్గర నుండి అనేక ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లకు ఒన్ టైం సెటిల్మెంట్ స్కీం తెచ్చాడు. 10 వేలు కడితే ఇళ్ల రిజిస్ట్రేషన్ అంటూ 5వేల కోట్లు పేద ప్రజల నుండి కొట్టేసాడు. ఆ పత్రాలు పట్టికెళ్తే బ్యాంకులు లోన్లు ఇస్తారని ప్రచారం చేసారు. ఆ పత్రాలు పట్టికెళ్తే బ్యాంకులు ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అంటున్నాయి. కోడికత్తి జగన్ శాశ్వత భూహక్కు పధకం తెచ్చాడు. డ్రోన్ సర్వే అంటాడు. భూమి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా ఎంతోకొంత భూమి లాగేస్తున్నాడు. అదేంటి నా భూమి ఎలా తగ్గింది అని ప్రశ్నిస్తే అధికారుల చుట్టూ తిరగమని ఉచిత సలహా ఇస్తున్నారు. పైగా ఆయన బాబు గారి సొమ్ము ఎదో మీకు రాసిచ్చినట్టు పాస్ బుక్ పై ఈయన ఏడుపు మొహం ఫోటో వేసుకుంటున్నాడు. కోడికత్తి జగన్ పెద్ద ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్. ఆయన ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతాను. కోడికత్తి జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది అని వివరించారు.

పీల్చేగాలి పై కూడా పన్నేస్తాడు

విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు అని లోకేష్ చెప్పారు. . మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. కోడికత్తి జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. కోడికత్తి జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ కోడికత్తి జగన్ అని విమర్శించారు.

యువత భవిష్యత్తును దెబ్బతీశాడు

కోడికత్తి జగన్ యువతని భవిష్యత్తుని దెబ్బతీసాడని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. కోడికత్తి జగన్ మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం అని హామీ ఇచ్చారు.

మోటార్లకు మీటర్లతో రైతులకు ఉరితాళ్లు

కోడికత్తి జగన్ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. కోడికత్తి జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు అని లోకేష్ హెచ్చరించారు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. కోడికత్తి జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మీకు తెలియకుండా మీ వస్తువు దొంగిలిస్తే దొంగ అంటాం. ఏకంగా పోలీసుల డబ్బులే కొట్టేసాడు కోడికత్తి జగన్. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని విమర్శించారు.

బిసిల బ్యాక్ బోన్ విరిచిన జగన్

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు కోడికత్తి జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు అని లోకేష్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలల కోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఊరేగించారని ఆరోపించారు.

దమ్ముంటే జగన్ ను నిలదీయండి

ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబును నిలదీస్తానని వీరంగం వేస్తున్నాడు. దళితులకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేసిందుకు, సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించినందుకు దమ్ముంటే జగన్ ను నిలదీయండిఅని సవాల్ చేశారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది.టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు అని వివరించారు.

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్

కోడికత్తి జగన్ నేను రాయలసీమ బిడ్డ అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ అని లోకేష్ విమర్శించారు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా ను అభివృద్ది చేసింది టిడిపి జైరాజ్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్, విమానాశ్రయం ఏర్పాటు చేసింది టిడిపి అని వివరించారు.

ఆదోని ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ లీలలు

ఆదోని ఎమ్మెల్యే గారి పేరు సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఆదోని ని ముంబైలా మార్చేస్తాడు అని మీరు వరుసగా రెండు సార్లు గెలిపించారు అని లోకేష్ చెప్పారు. ఆదోనికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి పంచుకున్నారు. ప్రతి రోజు కూర్చొని వాటాలు వేసుకుంటారు. కొడుకు భూకబ్జాలు, సెటిల్మెంట్లు. భార్య గారికి రిజిస్టర్ ఆఫిస్ బాధ్యతలు అప్పగించారు. ఆదోని లో అభివృద్ధి నిల్లు… అవినీతి ఫుల్లు. అందుకే పేరు మార్చాను ఆయన సాయి ప్రసాద్ కాదు క్యాష్ ప్రసాద్. ప్రతి రోజూ క్యాష్ ఎంత వచ్చిందో కళ్లారా చూసుకుంటే తప్ప ఆయనకి నిద్ర పట్టదు అంట. ఆదోని పట్టణం సర్వే నంబరు 352లో 5 ఎకరాల్లో 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి ఎస్టేట్ వెంచర్ వేసింది. 72 మంది సామాన్యులు ఒకటిన్నర సెంటు ప్రకారం కొన్నారు. క్యాష్ ప్రసాద్ ఆ భూమిని కబ్జా చేసి మళ్ళీ వెంచర్ వేసారు. ప్లాట్లు కొన్న బాధితులు అడిగితే.. ఒకటిన్నర సెంటుకు రూ.లక్ష ఇస్తా.. లేదంటే మీ ఇష్టం అని బెదిరిస్తున్నారు. అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా ఉంది.ప్రస్తుతం ఎకరా రూ.10 కోట్లు ఉంది. క్యాష్ ప్రసాద్ కుమారుడు మనోజ్ రెడ్డి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ మండిగిరి కొండ, కొండాపురం కొండ ని మింగేసారు. డాణాపురం వద్ద 172ఎకరాలు సెంటు స్థలాల కోసం, ఆరెకల్ మెడికల్ కాలేజీ కోసం 43 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. భూమి కొనుగోళ్లలో క్యాష్ ప్రసాద్ గారికి భారీగానే ప్రజాధనాన్ని లూటీ చేసారు. ఎకరా 6 లక్షలకు కొని ప్రభుత్వానికి 13 లక్షలకు అమ్మేసారు అని ఆరోపించారు.

ఎన్ జిఓ ఆఫీసును కూడా మింగేశాడు

ఎస్కేడీ కాలనీలో ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా ఏపీ ఎన్జీఓ ఆఫీసు ఉంది. ఎన్జీఓలను భయపెట్టి. 32 ఏళ్లు లీజుకు రాయించుకుంటున్నారు. వైసీపీ ఆఫీసు కట్టారు. ఎమ్మెల్యే కొడుకు మనోజ్ రెడ్డి బియ్యం మాఫీయా నడుపుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. పట్టణంలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో బియ్యం డంపింగ్ కేంద్రాలు పెట్టి… అక్కడి పేదల బియ్యం నిల్వ చేసి.. కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇది పెద్ద కుంభకోణం. ఎమ్మెల్యే చెప్పిన వాళ్లే గ్రామంలో కర్ణాటక మద్యం అమ్మకాలు చేయాలి. ఇందులో నెల వాటాలు ఇవ్వాలి. ఈ కలెక్షన్ చేయడానికి ఒక మాఠానే పెట్టారు. కాంట్రాక్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం అని క్యాష్ ప్రసాద్ అమాయకుల దగ్గర నుండి కోట్లు కొట్టేసింది. ఆదోని లో రోడ్లు బాలేదు అని మాట్లాడినందుకు ఒక ఆటో డ్రైవర్ రవి ని ఇంటికి తీసుకెళ్లి చితకబాదారు క్యాష్ ప్రసాద్ గారు. గుడి కంబాల రీచ్ నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రూ.10 లక్షలు పైబడి ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా..ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ కి కప్పం కట్టాల్సిందే. ఆదోని పట్టణంలో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలన్నా.. ఎమ్మెల్యే కొడుకు మనోజ్ రెడ్డిని కలసి కప్పం కట్టాల్సిందే. ఆదోని మార్కెట్లో పెద్ద ఎత్తున జీరో వ్యాపారం జరుగుతుంది. అందులో పెద్ద ఎత్తున వాటా క్యాష్ ప్రసాద్ కి వెళ్తుంది. భారీ పర్శంటేజ్ తీసుకోని తనకి నచ్చిన కాంట్రాక్టర్లకు ఎల్లెల్సీ కాలువ లైనింగ్ పనులు అప్పజెప్పారు క్యాష్ ప్రసాద్. ఆ లైనింగ్ ఎప్పుడో కొట్టుకుపోయింది అంత నాణ్యమైన పనులు చేసారు. క్యాష్ ప్రసాద్ స్వార్ధం వలన బైపాస్ పనులు ఆగిపోయాయి. ఆయన కొన్న భూముల వైపు బైపాస్ వెళ్ళాలి అని డిపిఆర్ మార్చారు. అందుకే పనులు నిలిచిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపి హయాంలోనే ఆదోని అభివృద్ధి

ఆదోనిని అభివృద్ధి చేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, సాగు, తాగునీటి ప్రాజక్టులు నిర్మించాం. పేదలకు ఇళ్లు, కాలేజీలు నిర్మించాం. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు అని లోకేష్ పేర్కొన్నారు. జగన్ ఆదోని వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని అన్నారు, త్రాగునీటి సమస్య పరిష్కరిస్తా అన్నారు, బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తా అన్నారు. గెలిచిన తరువాత ఏపీలో ఆదోని ఉందనే విషయమే మర్చిపోయారు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం,  బైపాస్ నిర్మాణం పూర్తి చేస్తాం, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. ఆదోని టౌన్ లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది రోడ్లు వెడల్పు చేసి టౌన్ ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. టౌన్ లో ఉన్న అన్ని వార్డుల్లో సమస్యలు ఉన్నాయి, రోడ్లు, తాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన ఆదోని టౌన్ ని అభివృద్ధి చేస్తాం. మోడల్ టౌన్ గా ఆదోని ని మారుస్తాం. టిడిపి హయాంలో ఆదోనికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మైనారిటీ ఐ.టి.ఐ, మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ హైస్కూల్, ఇంటర్ ఉర్దూ కాలేజీ, సద్భావన భవన్ నిర్మాణాలను టిడిపి హయాంలో ప్రారంభించి 90 శాతం పనులు పూర్తి చేసాం. ఈ చేతగాని వైసిపి ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు పూర్తి చెయ్యలేదన్నారు.

ఆదోనికి పరిశ్రమలు తెస్తాం

ఇక్కడ ఉన్న అనేక జిన్నింగ్ మిల్లులు, ఆయిల్ మిల్స్ మూతపడ్డాయి. కార్మికులు అంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆదోనికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అతి పెద్ద పత్తి మార్కెట్ ఉన్నా సరైన వసతులు లేవు. మార్కెట్ లో వసతులు కల్పించడంతో పాటు పత్తి రైతుల్ని ఆదుకుంటాం. పండించిన పంట అమ్ముకోవడానికి మిర్చి రైతులు గుంటూరు వెళ్లి పడుతున్న కష్ఠాలు నాకు తెలుసు. నియోకవర్గంలోనే మిర్చి యార్డ్ ఏర్పాటు చెయ్యడంతో పాటు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటాం. యువత బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకి కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాం. ఆదోని లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత నాది. మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు గతంలో ఇచ్చిన యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ అమలు చేస్తాం. టిడిపి హయాంలో ఆదోని కి 8 వేల టిడ్కొ ఇళ్లు మంజూరు చేసాం. అందులో 6307 ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేసాం. మిగిలిన 10 శాతం పనులు పూర్తిచెయ్యలేని చెత్త ప్రభుత్వం జగన్ ది. ఇక్కడ ఉన్న ఇఎస్ఐ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. కొత్త భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటాం. ఎల్ఎల్సి ని ఆధునీకరించి 24 టిఎంసి నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. టిడిపి కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీతో సహా చెల్లిస్తా. అక్రమ కేసులు పెట్టిన వారిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *