
కాలగర్భంలో కలిసి పోనున్న న్యూయార్క్..?
- NewsTechnology
- May 23, 2023
- No Comment
- 34
ఆకట్టుకునే భవనాలు, ఆకాశాన్నంటే కట్టడాలు న్యూయార్క్ సొంతం. ఎటుచూసినా ఎత్తైన బిల్డింగ్ లతో ప్రపంచదేశాలను ఆకట్టుకునే న్యూయార్క్ నగరానికి ఇప్పుడు పెను ప్రమాదం పొంచి ఉందా..? ఆ నగరం త్వరలోనే సముద్రంలో మునిగిపోనుందా..? అందాల న్యూయార్క్ నగరం.. ఇక కాలగర్భంలో కలిసి పోనుందా..? అంటే అవుననే అంటున్నారు… అమెరికన్ సైంటిస్టులు. న్యూయార్క్ సిటీ నెమ్మదిగా మునిగిపోతుందన్న ఓ నివేదికను వారు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త అమెరికా వాసులను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా, నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది.
న్యూయార్క్‌లో ఆకాశాన్నంటేలా ఉన్న భారీ భవంతుల వల్ల భూమిపై ఒత్తిడి పడి.. నేల కుంగుతోందని పరిశోధనల్లో తేలింది. దానికి తోడు సముద్రం పక్కనే ఉన్న న్యూయార్క్ నగరం రోజు రోజుకూ విస్తరించడం.. సముద్ర మట్టాలు పెరుగుతుండటం వల్ల రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని అధ్యయన కర్తలు హెచ్చరించారు. పెరిగిన నగరీకరణ, భూగర్భ జలాలను విరివిగా వాడటం, డ్రైనేజీ వ్యవస్థ.. న్యూయార్క్ నగరాన్ని మరింత కుంగదీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మ్యాన్‌హట్టన్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు చాలా వేగంగా కుంగుబాటుకు గురవుతున్నాయని అధ్యయనం తెలిపింది. దీంతోపాటు బ్రూక్లిన్, క్వీన్స్ కౌంటీల పరిస్థితిపైనా అధ్యయన కర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూయార్క్ నగరంలోని 84 లక్షల జనాభాకు…. దాదాపు పది లక్షలకుపైగా భవనాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. వాటి బరువు దాదాపు 85 కోట్ల టన్నుల వరకు ఉంటుందని లెక్కగట్టారు. ఈ క్రమంలోనే నగరం ఏటా 1- 2 మిల్లీమీటర్ల మేర వేగంతో కుంగిపోతోన్నట్లు గుర్తించారు. తీరప్రాంతాలు, జలవనరుల వద్ద నిర్మించే ప్రతి భవనం.. భవిష్యత్తులో వరదలకు కారణమవుతుందని అవగాహన కల్పించడమే తమ అధ్యయన ముఖ్య ఉద్దేశమని పరిశోధకులు తెలిపారు. పెరుగుతున్న వరద ప్రమాదం, సముద్ర మట్టాల పెరుగుదలను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అందుకోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని చెప్పారు.