
సీఎం జగన్ రెడ్డి పై.. జనసేన “సోషల్” వార్
- Ap political StoryNewsPolitics
- May 19, 2023
- No Comment
- 28
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై జనసేన పార్టీ విమర్శలదాడి ఉధృతం చేసినట్టుగానే కనిపిస్తోంది. గత కొంత కాలంగా సైలెంట్ మోడ్‌లో ఉన్న ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ రెడ్డిని చెడుగుడు ఆడుకుంటున్నారు. మరోవైపు.. పవన్ సోదరుడు నాగబాబు, పలువురు జనసైనికులు సైతం జగన్ రెడ్డి “నిజస్వరూపం”పై ముప్పేట దాడి చేస్తున్నారు. సోషల్ మీడియా సాక్షిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. జగన్ మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో… జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ పై డైరెక్ట్ ఎటాక్‌కు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్న పోస్టర్లు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని ఎండగడుతూ ఆయన ఇటీవల “పాపం పసివాడు”.. ” నోట్లో వేలు పెడితే కొరకలేడు” అనే పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగన్ రెడ్డి డబ్బు సూట్ కేసులతో ఉన్న ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన కొంత మంది జనసైనికులు తాజాగా “దొంగలకు దొంగ” పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు. దీనికి సజ్జల డైరెక్షన్‌లో అనే క్యాప్షన్ కూడా తగిలించారు. దీంతో ఈ పోస్టర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
జనసేన పార్టీ విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుండగా.. ఆ పార్టీ కార్యదర్శి నాగబాబు సైతం రంగంలోకి దిగారు. “క్లాస్ వార్.. పెత్తందార్లు” అంటూ ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి పదే పదే చేస్తున్న ప్రచారానికి తమదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి “కథాకళి” పేరుతో ఓ వీడియో రూపొందించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆర్ధిక అంతరాల గురించి కమ్యూనిజం చెప్పిన “క్లాస్ వార్” డెఫినిషన్‌ను.. జగన్ రెడ్డి ఏపీకి అన్వయించాలని చూడటం పట్ల తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అవగాహనా రాహిత్యాన్ని ఎండగట్టారు.
మొత్తం మీదపు సినిమా పోస్టర్లు, వీడియోలతో జగన్ రెడ్డిపై జనసేన పార్టీ దాడిని ముమ్మరం చేసినట్టే కనిపిస్తోంది. గత కొంత కాలంగా.. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ ను జగన్ రెడ్డి విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్ గా అన్నట్టు జనసేన కూడా జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారింది.