
పొత్తులపై క్లియర్ గా ఉన్నాం..పవన్ కళ్యాణ్
- Ap political StoryNewsPolitics
- May 11, 2023
- No Comment
- 29
ఏపీలో పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో కచ్చితంగా పొత్తు పెట్టుకొని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పొత్తులతోనే చాలా పార్టీలు బలపడ్డాయని…మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వైసీపీ అరాచకాలను ఎదుర్కొనేందుకు.. బలమున్న ప్రధాన పార్టీలు కలిసి నడవాలని భావిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కూడా ఒకప్పుడు పొత్తులతోనే బలపడిందని, ప్రస్తుతం బలంగా ఉన్న బీజేపీ కూడా పొత్తులు పెట్టుకుంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని మరోసారి పవన్ స్పష్టం చేశారు.వైసీపీ నుంచి అధికారాన్ని తీసుకొని, ప్రజలకు పంచడమే తమ లక్ష్యమన్నారు.
గత ఎన్నికల్లో ఒంటరిగా 137 స్ధానాల్లో పోటీ చేస్తే…ఒక్కటికూడా గెలవలేకపోయామని పవన్ అన్నారు. 30-40 స్ధానాలు గెలిచుకుంటే…కర్ణాటకలో కుమారస్వామమి తరహాలో బాగుండేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేనకు ఓటు శాతం పెరిగినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సగటున 14-15 శాతం ఓటు బ్యాంకుకు చేరుకున్నందున… రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే, జూన్ నుంచి క్షేత్రస్ధాయి పర్యటనలు చేపడుతామని చెప్పారు.
పొత్తులనేవి ఓ కులానికి సంబంధించినవి కావని రాష్ట్రానికి సంబంధించినవని, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవని పవన్ తెలిపారు. సీఎం అయ్యే పరిస్ధితి ఉంటేనే పొత్తు పెట్టుకోవాలని అనడం సరికాదన్నారు.రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు…విపక్షాలన్నీ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఏపీలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.