
పవన్ వారాహి సైరన్ ..వైసీపీ సెక్షన్ 30 ఎఫెక్ట్
- Ap political StoryNewsPolitics
- June 12, 2023
- No Comment
- 21
జనసైనికులు… పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లన్నీ పక్కనబెట్టి, వారాహితో జనం బాట పడుతున్నారు. వైసీపీ విముక్త రాష్ట్రం కోసం, జగన్ సర్కార్ దోపిడీ పాలనపై సమరశంఖం పూరించేందుకు సైరన్ మోగిస్తున్నారు. దాంతో, రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మంగళగిరి పార్టీ ఆఫీసులో హోమం నిర్వహిస్తున్న పవన్… 14నుంచి వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం దేవస్థానం నుంచి యాత్ర మొదలవుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్రకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి దశలో గోదావరి జిల్లాల్లోని మొత్తం 11 నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర సాగనుంది. భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. మొత్తం ఐదు బహిరంగసభల్లో పవన్ ప్రసంగించనున్నారు. ప్రతీ రోజూ ఉదయం వేళ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. వాటి పరిష్కారానికి పార్టీ నుంచి డిమాండ్లు వినిపిస్తారు. అలాగే యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమాలు కూడా నిర్వహించాని నిర్ణయించారు.
మరోవైపు, పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానున్న వేళ, పోలీసుల ఆంక్షలు సెగలు రేపుతున్నాయి. అమలాపురం పోలీస్ డివిజన్ పరిధిలో ఈ నెల 10 నుంచి 30వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, మూడు నెలల కిందట ఎత్తేసిన సెక్షన్ 30యాక్ట్ ను అకస్మాత్తుగా మళ్లీ తెరపైకి తేవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వారాహి యాత్రను అడ్డుకునే కుట్రలో భాగంగానే ప్రభుత్వం సెక్షన్ 30 తీసుకొచ్చిందని జనసేన మండిరడుతోంది. పవన్ కళ్యాణ్ ను చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని జనసేన నేతలు సెటైర్లు వేస్తున్నారు. వారాహి యాత్రను విజయవంతం చేసి తీరుతామని అంటున్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం తలపెట్టినా, వాటిని అడ్టుకునేవిధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలోనూ జీవో 1 పేరుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ యువగళం పాదయాత్రను అడ్డుకునే కుట్ర చేసింది. ప్రజాగ్రహం పెల్లుబికడంతో ప్రభుత్వం తోకముడిచింది. ఆ తర్వాత జీవో 1ను కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు సెక్షన్ 30 పేరుతో వారాహి యాత్రకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయినా, యాత్ర చేసి తీరుతాం, తగ్గేదేలే అని అంటున్నారు జనసైనికులు.
మొత్తంగా, ఈ యాత్రలో పవన్ కళ్యాణ్.. ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు, లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు పవన్ వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్లనుండడంతో ఏపీ పాలిటిక్స్ మరింత వేడెక్కనున్నాయి.