
జగన్ రెడ్డి విధానాలతో పేదరికంలోకి ఏపీ ప్రజలు
- Ap political StoryNewsPolitics
- May 10, 2023
- No Comment
- 30
సంక్షేమ పథకాల అమలులో తామే నెంబర్ వన్ అని గొప్పులు చెప్పుకునే సీఎం జగన్ రెడ్డి.. ఓ చేత్తో ఇస్తూ మరో చేత్తో పన్నులు, చార్జీల రూపంలో లాగేసుకుంటున్నారు. గత నాలుగేళ్ళ జగన్ పాలనలో భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల నడ్డి విరిస్తున్నాయి. దీనికి తోడు మూడు సార్లు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, ఏడు సార్లు పెరిగిన విద్యత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు.. సామాన్య ప్రజల ఆర్ధిక పరిస్థితిని దుర్భరంగా మారుస్తున్నాయి.ఇటు పన్నుల మోత.. అటు ధరల వాతతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రోజు రోజుకూ దిగజారుతోన్న తమ ఆర్ధిక పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.
బటన్ నొక్కుడు పథకాలతో పేదల జీవితాలు మార్చేస్తున్నామంటూ జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలన్నీ తగ్గిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. నాలుగేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసినపుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. కానీ.. ఆయన అధికారంలోకి వచ్చి ఇప్పటికి నాలుగేళ్ళు అవుతుంది. ఒక్క రూపాయి కూడా ధరలు తగ్గక పోగా.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కల్ని తాకుతున్నాయి. మరోవైపు పన్నులు, చార్జీల బాదుడుతో సామాన్యులపై మరింత భారం పెంచింది. చివరకు చెత్తపై కూడా పన్ను వేసే స్థాయికి జగన్ సర్కార్ దిగజారిపోయింది.
మరోవైపు.. పాలు, పెరుగు మొదలుకుని వంట నూనెలు, పప్పు దినుసులు, కూరగాయలు, బియ్యం, పెట్రోలు, డీజిల్, గ్యాస్.. ఇలా అన్నింటి ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్‌కు వెళితే ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. జగన్ ఏలుబడిలో బతుకుబండి నెట్టుకురాలేక సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు.
జగన్ పాలనలో.. రెక్కాడితే గానీ డొక్కాడని దినసరి కూలీలు, కార్మికులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దినమొక గండంలా గడుస్తోంది. ఓవైపు ఆకాశాన్ని తాకుతున్న ధరలు జేబుల్ని గుల్ల చేస్తుండగా.. రోజు రోజుకూ ఉపాధి అవకాశాలు అడుగంటుతున్నాయి. అగ్రికల్చర్, అక్వా కల్చర్, భవన నిర్మాణ రంగం, వస్తు ఉత్పత్తి రంగం ఇలా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇసుకు మాఫియా దెబ్బకు.. భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో.. ఆ రంగంలో సుమారు 50 లక్షల మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. వీరితో పాటు అసంఘఠిత రంగ కార్మికులు, దినసరి వేతన జీవుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది.
సరైన పనులు, ఆదాయం లేక.. వారంతా దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వర్గాలను టార్గెట్ చేస్తూ జగన్ సర్కార్ చేస్తున్న లిక్కర్ బిజినెస్ మూడు గ్లాసులు… ఆరు బాటిళ్లు అన్న చందంగా సాగుతోంది. డైలీ లేబర్ రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మంతా.. జగన్ రెడ్డి లిక్కర్ షాపులు లాగేస్తున్నాయి. దీంతో.. బడుగు జీవుల జీవితాలన్నీ బుగ్గి పాలౌతున్నాయి. ప్రజల్ని వ్యసన పరులుగా మార్చి.. వారి కష్టాన్ని దోచుకుంటున్న జగన్ రెడ్డి .. తాడేపల్లి ప్యాలెస్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.