
జగన్ హయాంలో.. నత్తనడకన పోలవరం పనులు..
- Ap political StoryNewsPolitics
- April 3, 2023
- No Comment
- 34
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన పోలవరం ప్రాజెక్టు .. జగన్ సర్కార్ హయాం వచ్చేసరికి నత్త నడకన సాగుతోంది. చంద్రబాబు సర్కార్ ఉన్నప్పుడు.. అప్పట్లో కాస్తో కూస్తో నిధులిచ్చిన కేంద్రం.. జగన్ ప్రభుత్వ హయాంలో మాత్రం నిధులిచ్చి పూర్తి చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 2.86 శాతం పనులే చేసినట్లు అధికారిక గణాంకాలే తెలుపుతున్నాయి. ప్రాజెక్టును మార్చి ప్రారంభంలో డ్యాం డిజైన్ రివ్యూకమిటీ నిపుణులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జలసంఘం అధికారులు సందర్శించారు. కీలకాంశాలపై సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అధికారులు ఏడాది కాలంలో జరిగిన పనులపై నివేదిక ఇచ్చారు.
ఆ గణాంకాల ప్రకారమే .. పోలవరం పనులు అంతంతమాత్రంగా జరిగాయని అధికారులు తేల్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు తాజాగా గణాంకాలు తయారుచేశారు. వైఎస్ హయాంతో పాటు ఆ తర్వాత 2014 జూన్ వరకు ఎంతమేర పోలవరం పనులు జరిగాయి.. ఆ పై చంద్రబాబు హయాంలో ఎంతమేర పనులు జరిగాయి.. జగన్ ప్రభుత్వంలో 2023 జనవరి వరకు ఎంత పని జరిగిందో లెక్కలు తయారుచేశారు. ఏ రకంగా చూసినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంతో పోలిస్తే జగన్ ప్రభుత్వ హయాంలోనే పనులు చాలా మందకొడిగా ఉన్నాయని గణాంకాలు తేల్చాయి.
తాజాగా 2022 మార్చి నెలాఖరు నుంచి .. 2023 ఫిబ్రవరి నెలాఖరు వరకు పోలవరంలో పురోగతిని జలవనరులశాఖ అధికారులే లెక్కించారు. ఆ ప్రకారం కొన్నిచోట్ల .. అసలు పనులే ముందుకు కదల్లేదని తేలింది. సీఎం జగన్ గతేడాది వరదల సమయంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. తొలిదశ పునరావాసం సెప్టెంబరు, అక్టోబరు కల్లా పూర్తి చేస్తామన్నారు. 2023 మార్చి వరకు భూసేకరణ, పునరావాసంలో జరిగిన పని పురోగతి 1.97 శాతం మాత్రమే ఉంది. ఇంకా తొలిదశ నిర్వాసితులను అనేక మందిని ఇంకా తరలించనేలేదు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. ఏ హామీ నెరవేర్చలేదని.. పోలవరం నిర్వాసితులు తెలుపుతున్నారు.