బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తానం..రాహుల్ ఫుల్ క్లారిటీ?

బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తానం..రాహుల్ ఫుల్ క్లారిటీ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఉండే ఛాన్స్ ఉందా? గులాబీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నారా? రాహుల్ పై అనర్హత వేటును కేసీఆర్ ఖండించడంలో ఆంతర్యమేంటి? బీజేపీ వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ కు మద్దతు తెలపడాన్ని ఏవిధంగా చూడాలి? గత కొద్దిరోజులుగా తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల దోస్తానాపై పంచాయితీ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు పొడవనుందంటూ రాష్ట్రస్థాయిలో జోరుగా చర్చ నడుస్తోంది. రెండు పార్టీల నాయకత్వాల నుంచి వెలువడుతున్న సంకేతాలు కూడా పొత్తు కుదిరుతుందనే భావన కల్పించాయి. బీజేపీ ముక్త్ భారత్ అని చెబుతున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నట్టే కనిపిస్తోంది. మోడీపై కారాలు మిరియాలు నూరుతున్న సీఎం కేసీఆర్, ఇటీవల రాహుల్ గాంధీ అనర్హత వేటును వ్యతిరేకించడంతో కొత్త సమీకరణాలకు తెరలేచింది. పార్లమెంటులో కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా జరిగిన కార్యక్రమాల్లో గులాబీ పార్టీ పాల్గొంది. అటు కాంగ్రెస్ కూడా విపక్షాలన్నంటినీ ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో…కేసీఆర్ తో మాట్లాడే బాధ్యతలను నితీష్ కు అప్పజెప్పింది. అయితే, కేసీఆర్ మద్దతు దేశ స్థాయిలోనా, లేక రాష్ట్ర స్థాయిలో ఉంటుందా అనేది పక్కనబెడితే…తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లుకూడా కారు పార్టీతో దోస్తానానికి ఆసక్తి చూపుతున్న తీరు స్పష్టంగా కనిపించింది.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమ ప్రధాన శత్రువు బీఆర్ఎస్‌ అంటూ కొట్లాడుతున్నారు. అయితే, పార్టీలోని బడానేతలు పలువురు రేవంత్‌కు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారన్న జానా… బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ తమకు మద్దతు ఇవ్వాలన్నారు.అంతకుముందు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా గందరగోళానికి దారితీశాయి. రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితి ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలవక తప్పదంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్ పేల్చారు. కోమటిరెడ్డి కామెంట్స్ పార్టీలో పెను దుమారమే రేపాయి. అధిష్టానం ఆగ్రహంతో కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కేసీఆర్ బద్దవ్యతిరేకిగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై వార్ వన్ సైడ్ అన్నట్టుగా వెళ్తుంటే…సీనియర్లు మోకాలడ్డే వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడిపోయారు. రెండు పార్టీల మధ్య పొత్తుంటుందని తాను చెప్పలేదంటూ అటు కోమటిరెడ్డి, ఇటు జానా వివరణ ఇచ్చినప్పటికీ..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాటిని కొట్టిపారేయలేమంటూ విశ్లేషణలు సాగాయి. అటు బీజేపీ కూడా…బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ జనంలోకి ఆ రెండు పార్టీల పొత్తును బలంగా తీసుకెళ్లి డ్యామేజ్ చేసే ప్రణాళికను అమలు పరుస్తోంది.

బీఆర్ఎస్ ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో పార్టీని విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను కలిసి కూటమిగా కోసం ప్రయత్నించారు. అయితే, అదానీ అంశంపై విపక్షాలు ఏకతాటిపైకి రావడం..అదే సమయంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంతో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల్లో ఐక్యత మరింత పెరిగింది. కాంగ్రెస్ కూడా విపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీపై ఆసక్తికర చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా బిల్లుపై ఢిల్లీలో ఆందోళన చేసిన సమయంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి సెల్యూట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు కుదరకపోయినా తర్వాతైనా అవసరాన్ని బట్టి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా ఓ అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సొంత బలంతోనే అధికారంలోకి రావాలని రెండు పార్టీలూ యత్నిస్తున్నాయి.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్‌పై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వ వైఫల్యాలను ఎండగడ్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితను, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ ను కార్నర్ చేస్తూ రెచ్చిపోయారు. రాహుల్ అనర్హతా అంశంలో కేటీఆర్ పాజిటివ్ వ్యాఖ్యలు చేసినా… రేవంత్ తమకేమీ పట్టనట్లుగానే వ్యవహరించారు. ఎందుకంటే, బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే, రెండు పార్టీలు ఒకటేనంటూ బీజేపీ కొత్త అస్త్రం అందుకుంటుంది. అదే జరిగితే, ప్రజల్లో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని రేవంత్ రెడ్డి గుర్తించినట్టున్నారు. అందుకే జాతీయ స్థాయి రాజకీయాల గురించి పట్టించుకోకుండా రాష్ట్రస్థాయిలో తన పరిధిలో పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. అయితే, అప్పటికే బీజేపీ…బీఆర్ఎస్, కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ ఆ రెండు పార్టీల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. దానికి తోడు సీనియర్ల కామెంట్లు రేవంత్ పోరాటాన్ని బలహీనం చేసేలా కనిపించాయి. దాంతో, పొత్తులపై మాట్లాడకుండా హైకమాండ్ సీనియర్లను కట్టడి చేయాలని పలువురు పెద్దల దృష్టికి తీసుకెళ్లారట.అందుకే, ఇటీవల రేవంత్ కు రాహుల్ గాంధీ…బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇటీవల కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో…రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని , ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. బీజేపీ కావాలనే… బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తు సృష్టిస్తూ లబ్ది పొందాలని చూస్తోందని, దాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని రాహుల్ అలర్ట్ చేశారు. అప్పటివరకు కాస్త నైరాశ్యంలో ఉన్న రేవంత్ వర్గంలో రాహుల్ మాటలు, ఎనలేని సంతోషాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా…వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తోంది. మూడు ముక్కలాటలో లాభపడేదెవరో, నష్టపోయేదెవరో గానీ…హంగ్ లాంటి పరిస్థితి వస్తే రాజకీయ సమీకరణాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే అవకాశం ఉండదు కాబట్టి, బీఆర్ఎస్‌ బెటర్ ఆప్షన్‌గా ఉంటుంది. ఏవిధంగా చూసుకున్నా కేసీఆర్ పార్టీకి మాత్రం ఢోకా ఉండదు. అందుకే, కాంగ్రెస్ సీనియర్లు కేసీఆర్‌తో దోస్తాన చేసేందుకు అమితాసక్తి చూపుతున్నట్లు కనిపిస్తున్నారు. రాహుల్ చెప్పినట్టు పొత్తు లేకపోయినా, ఫలితాలను బట్టి వ్యూహం మార్చుకోవడం మాత్రం పక్కాగా కనిపిస్తోంది.

 

Related post

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
ఖమ్మంలో కాంగ్రెస్ జోరు..కారు బేజారు

ఖమ్మంలో కాంగ్రెస్ జోరు..కారు బేజారు

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలో బలమైన నేతలు ఇద్దరూ కారు దిగడంతో, ఏమీ పాలుపోని స్థితిలో కేసీఆర్ ఉన్నారు . మాజీ మంత్రి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *