
రాహుల్ ను టెన్షన్ పెడుతున్న.. పరువునష్టం కేసు
- NewsPolitics
- April 3, 2023
- No Comment
- 137
పరువు నష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై గుజరాత్‌లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎలా? అంటూ గతంలో చేసిన రాహుల్ వ్యాఖ్యల కేసులో గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద ఈ శిక్ష విధించింది. ఈ సెక్షన్ల కింద గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాగా రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. కోర్టు నిర్ణయాన్ని సవాలు చేసేందుకు వీలుగా రాహుల్ శిక్షను 30 రోజలుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.
గుజరాత్లోని సూరత్ కోర్టు తనపై విధించిన జైలు శిక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సోమవారమే పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏప్రిల్ 03 సూరత్ సెషన్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ కేసుపై ఇప్పటికే న్యాయనిపుణులతో కలిసి రాహుల్ మాట్లాడినట్లు సమాచారం. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనీ లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్ సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ, ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే మాత్రం.. రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్లపాటూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.
అటు సుప్రీంకోర్టులోనూ.. ఇదే పరువు నష్టం కేసును సవాల్ చేస్తూ కేరళకు చెందిన ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ దాఖలు చేశారు. ఆభా మురళీధరన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం.. అనర్హత ఏకపక్షం, చట్టవిరుద్ధం అయినందుకు రాజ్యాంగానికి తీవ్ర వ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్ కోరారు.