
అకాల వర్షం.. అపార నష్టం.. రైతన్నలను ఆదుకోని జగన్ ప్రభుత్వం
- Ap political StoryNews
- May 2, 2023
- No Comment
- 27
ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీరు మిగులుస్తున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలు వ్యవసాయ, ఉద్యాన పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఓ అంచనా ప్రకారం సుమారు 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రబీలో వరి సాగు చేసిన రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోలులో వరి రైతులకు జగన్ సర్కార్ చుక్కలు చూపిస్తుండగా.. భారీ వర్షాలు వారిని మరింతగా కుంగదీశాయి. మరోవైపు మొక్కజొన్న, మిరప, పసుపు తదితర వాణిజ్య పంటలు వేసిన రైతలు పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది.
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో అకాల వర్షాల వల్ల పంటలకు అపార నష్టం సంభవించింది. కోతకు సిద్ధమైన వరి పంట నేలకొరగకా.. కోసిన పంట సైతం వర్షం నీటిలో తేలియాడుతోంది. మరోవైపు.. కల్లాల్లో రాసులుగా పోసిన ధాన్యం సైతం తడిచి ఎందుకూ పనికిరాకుండా తయారైంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలులో జగన్ సర్కార్ విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా కుప్ప నూర్చినా.. గోనె సంచిలు అందుబాటులో లేక ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచేశారు. దీంతో.. ఆ ధాన్యం రాసులన్నీ పూర్తిగా తడిచి పోయి.. రైతుల వెన్ను విరిస్తున్నాయి. ఇప్పటికే కొన్న ధాన్యాన్నికి డబ్బులు సకాలంలో ప్రభుత్వం చెల్లించటం లేదు. ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని జగన్ సర్కార్ కొంటుందో..? లేదో.. అనే ఆందోళనలో రైతులను వెంటాడుతోంది. మరోవైపు.. మొక్కజొన్న, మిరప, పసుపు తదితర పంటలను పండించిన రైతుల పరిస్తితి కూడా ఇలాగే ఉంది.
ఇక.. భారీ వర్షాల వల్ల కోస్తాంధ్రలోని రైతులు తీవ్రంగా నష్ట పోతుండగా.. జగన్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. రైతు సమస్యల గురించి పట్టించుకోవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలకు.. ప్రతిపక్ష నేతలను ధూషించటానికే సమయం సరిపోవటం లేదు. ప్రజా సమస్యల్ని ఏనాడో గాలికి వదిలేసిన వారు.. ముఖ్యమంత్రి కళ్ళలో ఆనందం చూడటానికి నోటికి వచ్చినట్టు తిట్ల పురాణం అందుకుంటున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైతం.. వివేకా హత్య కేసు నుంచి తన సోదరుడు అవినాష్ రెడ్డిని తప్పించటానికే సమయం అంతా వెచ్చిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ మెడకు చుట్టుకుంటున్న కేసుల నుంచి ఎలా బయట పడాలనే ఆలోచన తప్ప.. రైతుల కష్టాలు జగన్ సర్కార్‌కు పట్టటం లేదని విమర్శిస్తున్నాయి.
భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పలువురు టీడీపీ నేతలు పరామర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి తక్షణ నగదు సాయం చేయటంతో పాటు.. వర్షాల వల్ల దెబ్బతిన్న రైతుల నుంచి పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.