
వర్మ ట్వీట్లు..వెనుక అసలు కథ ఇదేనా..?
- NewsPolitics
- January 30, 2023
- No Comment
- 98
తీసిన సినిమాల్లో… హిట్స్ కన్నా ఫ్లాపులే ఎక్కువగా ఉన్నప్పటికీ.. సంచలన దర్శకుడిగా రాంగోపాల్ వర్మ గుర్తింపు పొందారు. 60 ఏళ్ళ వయస్సులోనూ.. 16 ఏళ్ళ పడుచు భామల కాళ్ళు పట్టుకోవటం దగ్గర నుంచి వారితో పబ్బుల్లో తాగి తందనాలాడటం వరకు.. వర్మ విన్యాసాల్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. గత కొన్ని రోజులుగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలపై దారుణంగా బురద జల్లుతూ వర్మ పోస్టులు పెడుతున్నాడు. ఏపీలో ఎన్నికల వాతావరణం హీట్ ఎక్కుతున్న క్రమంలో.. పక్కా ప్లాన్ ప్రకారం వర్మ విష ప్రచారం సాగిస్తున్నాడని టీడీపీ, జనసేన పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి. ఇదంతా అధికార వైసీపీ గేమ్ ప్లాన్ లో భాగంగా జరుగుతోందనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.
ఏపీలో వైసీపీ అధినేత సీఎం జగన్ గ్రాఫ్ బాగా తగ్గుతోందని.. విపక్షాల గ్రాఫ్ విపరీతంగా పెరుగుతోందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా విపక్షాలను టార్గెట్ చేసే బాధ్యతను.. వైసీపీ అధిష్టానం వర్మకు అప్పచెప్పినట్టు ప్రచారం సాగుతోంది. ట్విట్టర్‌లో వర్మకు ఫాలోవర్లు ఎక్కువగా ఉండటం.. సోషల్ మీడియాలో అతను పెట్టే పోస్టులు, వీడియోలు వైరల్ అవుతుండటంతో.. వైసీపీ అతడిని బాగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికై వర్మకు కోట్లాది రూపాయల భారీ ప్యాకేజీ అందిందనే ప్రచారమూ జరుగుతోంది. ఆ ప్యాకేజీలో భాగంగానే… వైసీపీ కోసం “వ్యూహం” పేరుతో ఓ సినిమా వర్మ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.
ఆ సినిమా కంప్లీట్ కావటానికి ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో.. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే బాధ్యతను అప్పచెప్పినట్టు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వర్మ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. వారితో పాటు యువనేత లోకేష్, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, నాదెండ్ల మనోహర్ వంటి నేతలనూ పరుష పదజాలంతో ధూషిస్తున్నారు. లిక్కర్ కిక్కులో వర్మ వదులుతున్న ఈ వీడియోలు వైసీపీకి ఎంత ఫేవర్ అవుతాయో తెలియదు కానీ… ఇతనికి “ఇదేం పోయే కాలం” అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇటీవల టీడీపీ సభల్లో రెండు దుర్ఘటనలు జరిగిన దాన్ని బేస్ చేసుకున్న వర్మ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని “నర హంతకుని”గా అభివర్ణిస్తూ పోస్టులు, వీడియోలు పెట్టారు. అయితే.. మద్యం మత్తులో చంద్రబాబును ధూషిస్తూ వర్మ పెట్టిన వీడియోలను చూసిన నెటిజన్స్..తాగుబోతు మాటలు ఆపకపోతే తోలు తీస్తామంటూ కామెంట్లు పెట్టటం కొసమెరుపు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు.. జనసేనాని పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిసిన సందర్భంలోనూ వర్మ విష ప్రచారం కొనసాగింది. ” కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని పవన్ కళ్యాణ్… కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు. “RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు” అంటూ.. వర్మ ట్వీట్ చేశారు.
ఏపీలో రెండు ప్రధాన సామాజిక వర్గాలైన కాపులు, కమ్మ కులాల మధ్య విబేధాలు పెంచేందుకే వర్మ ఈ ట్వీట్ చేశాడని ఎవరికైనా అర్ధం అవుతుంది. ఇక.. పవన్ కళ్యాన్ ఎన్నికల ప్రచార వాహనం “వారాహి” పైనా వర్మ అవాకులు, చవాకులు మాట్లాడాడు. “గుడిలో ఉంటే అది వారాహి”… రోడ్డుపై ఉంటే “పంది” అంటూ పైత్యం ప్రదర్శించాడు. పవన్ కళ్యాణ్ “వారాహి” ని “పంది వాహనంగా” అభివర్ణించాడు. కొండగట్టు ఆలయానికి సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళిన పవన్ కళ్యాణ్ పైనా వ్యక్తిగత విమర్శలు కొనసాగించారు.
ఇక.. నారాలోకేష్ పాదయాత్ర నేపథ్యంలో ఏపీ పోలీసు అణిచివేత చర్యలపై మాట్లాడిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడిపైనా వర్మ.. వ్యక్తిగత ధూషణలకు దిగాడు. ఏపీ పోలీసులను టీడీపీ నేతలపైకి ఉసి గొల్పేలా వర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు.. జనసేన పార్టీలో నెంబర్ టూ గా ఉన్న “నాదెండ్ల మనోహర్ తో జాగ్రత్త” అంటూ.. “పవన్ కళ్యాణ్ – నాదెండ్ల మనోహర్” మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేశాడు వర్మ.
నాదెండ్ల మనోహర్ తండ్రి.. నాదెండ్ల భాస్కరరావు..ఎన్టీఆర్ కు ద్రోహం చేశారని.. అలాంటి వ్యక్తి కుమారుడైన మనోహర్ తో జాగ్రత్తగా ఉండాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఇటీవలి కాలంలో కేవలం.. టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ మాత్రమే వర్మ ట్వీట్లు, పోస్టులు ఉంటున్నాయి. దీంతో.. ఇదంతా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అవతలి వాళ్లు ఏమనుకుంటారో..? అనే భావన లేకుండా..ఎంత వరకు అయినా దిగజారి ప్రవర్తించే వర్మను వాడుకోవటం వైసీపీ ఎన్నికల వ్యూహంలో భాగమని చెబుతున్నారు. అయితే.. వర్మ కేరెక్టరేంటో అందరికంటే బాగా తెలిసిన ఏపీ ప్రజల ముందు.. వైసీపీ ప్రచార వ్యూహాలు ఎంత వరకు పని చేస్తాయో వేచి చూడాలి.