
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదు?
- Ap political StoryNewsPolitics
- July 1, 2023
- No Comment
- 18
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏమయ్యారు? జగన్ కు రిటన్ గిఫ్ట్ ఇస్తానన్న ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు? అమరావతి రైతులకు మద్దతుగా ఉంటానని ప్రామీస్ చేసిన శ్రీదేవి ఎందుకు కనిపించకుండా పోయారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఇక దూరమయినట్టేనా? గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందని చెప్పిన శ్రీదేవి… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో పార్టి నుంచి సస్పెన్సన్ కు గురయ్యారు. దీంతో, నమ్మించి మోసం చేశారంటూ సీఎం జగన్, సజ్జలపైన దుమ్మెత్తిపోశారు శ్రీదేవి. తనపై ఆరోపణలు చేసిన వారికి రిటర్న్ గిప్ట్ ఇచ్చి తీరుతానంటూ శపథం చేశారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతోనూ సంబంధం లేకపోవడంతో స్వతంత్రురాలినని ప్రకటించారు. కానీ, కొన్నాళ్లుగా ఆమె ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు.
ఉండవల్లి శ్రీదేవి పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే కారణంతో…వైసీపీ శ్రేణులు ఆమె ఆఫీసుపై దాడి చేసి సామాగ్రి ఎత్తుకుపోయారు. దీంతో, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రాణ భయంతోనే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లినట్లు ఉండవల్లి శ్రీదేవి అప్పట్లో చెప్పారు. ఏపీకి వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయం నుంచి వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, జగనన్న హౌసింగ్ స్కీంలో వేల కోట్ల స్కాం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు శ్రీదేవి. ఇకపై రాజధాని రైతులకు అండగా నిలుస్తానంటూ జై అమరావతి అని నినదించారు. ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటానని శ్రీదేవి చెప్పారు. కానీ, ఆ తర్వాత నుంచి అడ్రస్ లేరు.
ప్రొటెక్షన్ తీసుకొని మళ్లీ ఏపీలో అడుగుపెడతానన్న శ్రీదేవి..ఆ ఎపిసోడ్ తర్వాత నుంచి కనిపించకపోవడంపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. సజ్జలతో తనకు ప్రాణహాని ఉందని శ్రీదేవి అప్పట్లో చెప్పారు. ఆ భయంతోనే ఆమె సైలెంట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఆమె తిరిగి తన వైద్య వృత్తికే పరిమితమవుతారా? లేక ఎన్నికల ముందు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశముందా? అనేది చూడాలి.