వివేకా హత్య పై..  సజ్జల కొత్త డ్రామా

వివేకా హత్య పై.. సజ్జల కొత్త డ్రామా

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో వైసీపీ నేతలు కొత్త డ్రామా మొదలు పెట్టారు. గత ఎన్నికలకు ముందు బాబాయి హత్యను ఉపయోగించుకుని ప్రజల్లో సానుభూతి పొందిన జగన్ …ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి సీబీఐ విచారణను కూడా తప్పుపడుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత…టీడీపీ నేతలను, చంద్రబాబును ఎందుకు కలిశారంటూ సజ్జల అసత్య ప్రచారం మొదలుపెట్టారు. సీఎం జగన్ రెడ్డి పై నమ్మకం లేకనే సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రభుత్వ సలహాదారు మరచిపోయినట్టున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టించే విధంగా సజ్జల మొదలు పెట్టిన ప్రయత్నాలు చూసి అంతా నవ్వుకుంటున్నారు. వివేకానందరెడ్డిని హత్య కేసులో బయటపడుతున్న వాస్తవాలు, సామాన్యులకు సైతం అర్థమవుతున్నాయి. అయినా, తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు వితండవాదం చేస్తూనే ఉన్నారు.

2019 ఎన్నికలకు ముందు ఏపీలో జరిగినన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మూడేళ్ల పాటు సాగిన దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నా కోర్టుకు మాత్రం తగిన వివరాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైంది. దాంతో, సుప్రీంకోర్టు… ఈ నెల 30కల్లా కేసును తేల్చాలని ఆదేశించడంతో పాటు, విచారణ అధికారిని కూడా మార్చడంతో…. సీబీఐ స్పీడ్ పెంచింది.వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఏ 4గా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారారు. అతను బెయిల్ పై ఉన్నారు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో అవసరం అనుకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదంటూ… సీబీఐ తరపు లాయర్ తెలంగాణ హైకోర్టుకు చెప్పడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగింది. దాంతో, వివేకానందరెడ్డి హత్యను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త రాగం అందుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఇదే మాదిరి చేశారు. వివేకానందరెడ్డి హత్యలో చంద్రబాబు హస్తం ఉందంటూ ప్రచారం చేసుకుని జగన్ లబ్దిపొందారు. అధికారంలోకి రాకముందు వివేకానందరెడ్డి హత్యను సీబీఐకి ఇవ్వాలంటూ డిమాండ్ చేసి, అధికారంలోకి రాగానే కేసును నీరుగార్చారు. దీంతో జగన్ రెడ్డిపై నమ్మకం లేక వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మరిచిపోయి సునీత చంద్రబాబును కలిశారంటూ సజ్జల ప్రశ్నించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

2014 నుంచి ఐదేళ్లపాటు టీడీపీ ఏమీ చేయలేదని అందుకే వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని సజ్జల చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే అరెస్టులు చేస్తున్నారంటూ సలహాదారు చెప్పడం మరీ విడ్డూరం. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పేరుతో డ్రామా నడిపిస్తున్నారంటూ సజ్జల సీబీఐ అధికారులను తీరును తప్పుపట్టడం అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది. గతంలో నిందితులుగా లేని భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇప్పుడు ఈ కేసులో సహ నిందితులు ఎలా అయ్యారని సజ్జల ప్రశ్నించడం చూస్తుంటే కేసును తప్పుదారి పట్టించాలని విశ్వప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. వివేకానందరెడ్డి హత్యలో పాల్గొన్న వారి పేర్లను వాచ్ మెన్ రంగన్న స్వయంగా చెబుతుంటే… దస్తగిరిని అప్రూవర్ గా మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ సజ్జల ప్రశ్నించడం చూస్తుంటే… వివేకానందరెడ్డి హత్యను ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డిపై నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

వివేకానందరెడ్డిని హత్య చేసిన వారితోపాటు, ఈ హత్యకు కుట్రపన్నిన వారిని, 40 కోట్లు సమకూర్చిన వారిని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది. ఇవన్నీ వదిలేసి కేవలం హత్య చేసిన వారితోనే కేసును ముగించాలన్నట్టుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించడం చూస్తుంటే వివేకా హత్య కేసులో పెద్దల హస్తం ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గతంలో జగన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన తరహాలోనే ఇప్పుడు అవినాష్ రెడ్డిపై పెడుతున్నారంటూ సజ్జల సెంటిమెంట్ పూస్తున్నారు. తప్పు చేసిన వారెవరైనా చట్టం ముందు శిక్షార్హులే. సీబీఐ కూడా తన పని తాను చేసుకుపోతోంది. అయినా, జనం ఏం చెప్పినా నమ్ముతారనే ధీమాతో వైసీపీ నేతలు ఉన్నారు. తప్పులను కప్పిపుచ్చుకుంటే కుదరదని, చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించాల్సిందేననే విషయాన్ని సలహాదారు సజ్జల గ్రహించాల్సిన అవసరం ఉంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *