
సత్తెనపల్లిలో అంబటిపై వైసీపీ నేతల తిరుగుబాటు..!
- Ap political StoryNewsPolitics
- April 3, 2023
- No Comment
- 29
” కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు..!” ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పరిస్థితి అలాగే తయారైంది. ఇన్నాళ్ళూ విధిలేని పరిస్థితుల్లో కామ్‌గా ఉన్న నేతలంతా ఇప్పుడు తమ గొంతులను సవరించుకుంటున్నారు. సీఎం జగన్ రెడ్డితో సహా.. మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఈ జాబితాలో ఉన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే.. రాష్ట్ర మంత్రి అయిన అంబటి రాంబాబకు నిరసన సెగ తగిలింది. ఆయన నాయకత్వాన్ని తిరస్కరిస్తూ.. సత్తెనపల్లి వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారు. ఏకంగా నియోజకవర్గంలో భారీ స్థాయిలో విందు సమావేశం ఏర్పాటు చేసి.. అంబటికి వ్యతిరేకంగా గళమెత్తారు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుకు సీటిస్తే.. సత్తెనపల్లిలో వైసీపీ కొంప కొల్లేరు కావటం ఖాయమంటూ కుండబద్దలు కొట్టారు.
ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ఇరిగేషన్ మంత్రిగా పని చేస్తున్న అంబటి రాంబాబుపై చాలా కాలంగా సత్తెనపల్లి వైసీపీ నేతలు కారాలు.. మిరియాలు నూరుతున్నారు. పలు అవినీతి.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటికి .. సీఎం జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వటాన్ని వారు తప్పు పడుతున్నారు. అయితే.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సత్తెనపల్లి వైసీపీ నేతలకు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి మంచి బూస్టప్ ఇచ్చింది. పలు జిల్లాల్లో అసమ్మతి నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్న వేళ.. సత్తెనపల్లి వైసీపీ నేతలు సైతం అంబటిపై తిరుగుబాటు ప్రకటించారు. స్థానిక సీనియర్ నాయకుడు చిట్టా విజయభాస్కర రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ ఆత్మీయ సమావేశం పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో అంబటికి వ్యతిరేకంగా పలు తీర్మానాలను ఆమోదించారు. వచ్చే ఎన్నికల్లో అంబటికి సీటు ఇవ్వొద్దని ఈ సందర్భంగా నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పార్టీ మనుగుడ సాగించాలంటే చిట్టా విజయ్ భాస్కర రెడ్డికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొనటం విశేషం. మొత్తం మీద.. నెల్లూరు వైసీపీ మాదిరిగా.. గుంటూరు జిల్లా వైసీపీలో కూడా చెలరేగిన అసమ్మతి చిచ్చు.. ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.