
తెర వెనుక నా స్వామి..! ఆ ఆరు గంటల కధేమి..?
- Ap political StoryNewsPolitics
- April 19, 2023
- No Comment
- 36
స్వామి..ఏమి నీ లీల. విజయ్ కుమార్ స్వామి.. కొద్ది ప్రముఖులకే తప్ప పెద్దగా ఎవరికీ తెలియని వ్యక్తి. కానీ, ఏపీ ముఖ్యమంత్రిని ఆశీర్వదించేందుకు ఏకంగా మైసూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చి విజయవాడలో వాలిపోయారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లికి వెళ్లిపోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, కేవలం పదినిమిషాల ఆశీస్సుల కోసం ఏకంగా జగన్ రెడ్డి ఇంట్లో ఆరుగంటల పాటు విజయ్ కుమార్ స్వామి ఎందుకు ఉన్నారు . ఇక్కడే అందరికీ ఓ డౌట్ కొడుతోంది. అసలు ఎవరు ఈ స్వామి..? జగన్ ఎందుకు రప్పించుకున్నారు..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ కుమార్ స్వామి, సీఎం జగన్ రెడ్డితో రహస్య..సుదీర్ఘ చర్చలు జరపడంపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగడం లేదు. వివేకానందరెడ్డి హత్య కేసులో అడ్డంగా దొరికిపోయినన వైసీపీ పెద్దలను దిక్కుతోచని స్థితి నుంచి బయట పడేసేందుకే… మైసూరుకు చెందిన విజయ్ కుమార్ స్వామిని తాడేపల్లి ప్యాలెస్ కు ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై మీడియాలో వచ్చిన కథనాలు సంచలనం అయ్యాయి.అయితే, విజయ్ కుమార్ స్వామి పర్యటనపై వైవీ సుబ్బారెడ్డి చేసిన కామెంట్లు హాస్యాస్పదంగా ఉన్నాయి.
జ్యోతిష్యం చెప్పడంతోపాటు, వాస్తు సిద్దాంతి కూడా అయిన విజయ్ కుమార్ స్వామి పెద్ద లాబీయిస్ట్ అనే ప్రచారం జరుగుతోంది. వివేకానందరెడ్డి కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో ఇరకాటంలో పడ్డ వైసీపీ పెద్దలు…హుటాహుటిని ప్రత్యేక విమానంలో మైసూర్ నుంచి విజయవాడ తీసుకు వచ్చారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, దీనిపై ప్రెస్ మీట్ పెట్టిన వైవీ సుబ్బారెడ్డి….విజయ్ కుమార్ స్వామిని విజయవాడ తీసుకు వచ్చింది ఈనాడు అధినేత రామోజీరావు అని, మార్గదర్శి కేసుల నుంచి బయట పడేసేందుకే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించి తీసుకు వచ్చారని చెప్పుకొచ్చారు. విజయ్ కుమార్ సీఎం జగన్ ను కలిస్తే, మార్గదర్శి కేసుల కోసం తెచ్చారంటూ వైవీ సుబ్బారెడ్డి వెటకారమాడారు. ఇక, వైవీ చెప్పిన మరో విషయమేంటంటే… విజయ్ కుమార్ స్వామి తనకు 2007 నుంచే తెలుసట. విజయవాడ వచ్చారని తెలిసే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాలని కోరానని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం హాస్వాస్పదంగా ఉంది. నిజంగా వైవీ సుబ్బారెడ్డి చెప్పింది నిజమే అయితే… విజయ్ కుమార్ స్వామి, 6 గంటల పాటు సీఎం జగన్ రెడ్డికి ఆశీస్సులు అందించారా అనే అనుమానం కలుగుతోంది. మధ్యాహ్నం తాడేపల్లిలో సీఎం ఇంటికి వెళ్లిన విజయ్ కుమార్ స్వామి సాయంత్రం వరకు అక్కడ ఏం చేశారు.. ? ఏ అంశాలపై చర్చించారు? అనే విషయాలను మాత్రం వైసీపీ పెద్దలు బయటకు చెప్పడం లేదు. కేవలం పది నిమిషాల ఆశీస్సుల కోసం ఆహ్వానించామంటూ వారు చెబుతున్నదాంట్లో నిజం లేదని తేలిపోయింది. వైసీపీ నేతల తీరును నిశితంగా గమనిస్తే దొంగే…దొంగ దొంగ అంటూ అరిచిన చందంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, వైసీపీ నేతల అరాచకాలపై కథనాలు ప్రచురితమైన ప్రతిసారి యల్లో మీడియా అంటూ వైసీపీ నేతలు అరిచి గీపెడుతున్నారు. ఇప్పుడు వివేకా హత్య కేసును కూడా పత్రికలకు ముడిపెడుతూ, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్తుగొల్పేలా ఉన్నాయి. కొన్ని పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా… వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరపడం బాధాకరంగా ఉందంటూ… వైవీ సుబ్బారెడ్డి సెలవిచ్చారు. అంటే సీబీఐ అధికారులు వివేకా హత్య కేసును ఎలా దర్యాప్తు చేయాలో కూడా వైవీ సుబ్బారెడ్డి చెబుతారా? అంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని తెలియడంతోనే… వైసీపీ పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వైసీపీ పెద్దల్లో వణుకు మొదలైంది కాబట్టే, స్వామీజీతో లాబీయింగ్ నడుపుతోందనే టాక్ వినిపిస్తోంది.