వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ సీక్రెట్ ఏంటి..?

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ సీక్రెట్ ఏంటి..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. హత్య జరిగిన మొదటి గంటలో గుండెపోటుతో, రక్తపు వాంతులు చేసుకుని చనిపోయారంటూ ప్రచారం చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో బిల్డింగ్ పై కప్పుకు కూడా రక్తపు మరకలు ఉండటంతో పోలీసు అధికారులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మీడియా కూడా స్పాట్లో చిత్రీకరణ చేసి అనుమానాలు వ్యక్తం చేయడంతో దాన్ని వెంటనే గొడ్డలి పోటుగా మార్చారు. వివేకానందరెడ్డిని అప్పటి సీఎం చంద్రబాబునాయుడు సహకారంతో అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హత్య చేయించారంటూ వైసీపీ పెద్దలు, సొంత మీడియాలో విష ప్రచారం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి డిమాండ్ చేశారు.

వివేకానందరెడ్డి హత్యను టీడీపీ అధినేత చేయించారంటూ ప్రచారం చేసుకుని ఎన్నికల ప్రయోజనం పొందారు. అంత వరకు బాగానే ఉంది. ఎన్నికల తరవాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రెడ్డి ఏం చేశారో అందరికీ తెలిసిందే. వివేకానందరెడ్డి హత్య కేసు విచారిస్తున్న సిట్ ను నిర్వీర్యం చేశారు. సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చి పడేశారు. దీంతో వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు వైస్ జగన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తీరుపై మరింత అనుమానం పెరిగింది. తండ్రి హత్య కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఏ4 గా ఉన్న షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారిపోయారు. దస్తగిరి సీబీఐ కోర్టుకు ఇచ్చిన వాగ్మూంలం ఈ కేసులో కీలకంగా మారింది.

వివేకానందరెడ్డి హత్యకు ముందు ఏం జరిగిందో షేక్ దస్తగిరి పూసగుచ్చినట్టు సీబీఐ అధికారులకు, కోర్టులోనూ చెప్పేశారు. వివేకానందరెడ్డిని చంపేస్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తానని చెప్పారని, అందులో వాటాగా 5 కోట్లు ఇస్తామంటూ ఎర్ర గంగిరెడ్డి తనకు ఆఫర్ ఇచ్చినట్టు దస్తగిరి వెల్లడించారు. జగన్ రెడ్డి బంధువులు శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అంతా చూసుకుంటారని కూడా ఎర్ర గంగిరెడ్డి…. దస్తగిరికి అభయం ఇచ్చాడు. ఈ మాట చెప్పిన రెండు రోజుల తరవాత సునీల్ యాదవ్ తనకు కోటి రూపాయలు ఇచ్చారని కూడా దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడించారు. ఇంత డబ్బు ఎక్కడిదని సునీల్ యాదవ్ ను అడగ్గా……. శివశంకర్ రెడ్డి… గంగిరెడ్డికి పంపారని, గంగిరెడ్డి తనకు ఇచ్చాడని చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే గంగిరెడ్డి చెప్పినట్టు చేయండి.. మేం చూసుకుంటాం అని శివశంకర్ రెడ్డి ఫోన్లోనే దస్తగిరికి హామీ ఇచ్చారని తెలిపాడు. వారిచ్చిన కోటి అడ్వాన్స్ తీసుకుని అందులో కొంత మొత్తం విల్లా కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ గా ఇచ్చాడు. మిగిలిన మొత్తం అతని స్నేహితుడు, చెప్పుల షాపు యజమాని వద్ద ఉంచారు. వివేకాహత్య తరవాత విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు దస్తగిరి దాచిన డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు.

అసలు వివేకానందరెడ్డిని చంపేస్తే 40 కోట్లు ఇస్తామని ఎర్ర గంగిరెడ్డితో చెప్పించిన పెద్దలు ఎవరు? భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీరే వివేకానందరెడ్డిని చంపాలని ప్లాన్ చేశారా? వీరే ఆ 40 కోట్లు ఆఫర్ చేశారా…? లేదా వీరి ద్వారా మరెవరైనా అలాచెప్పించారా..? అసలు అంత డబ్బు చెల్లించే స్తోమత వీరికి ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. వీరికి అభయం ఇచ్చి డబ్బు ఇచ్చేందుకు పెద్దల నుంచి ఆదేశాలు అందాయని, ఈ హత్యలో పెద్ద చేపలను వదిలేసి, చిన్న చేపలను అరెస్ట్ చేస్తున్నారంటూ బీటెక్ రవి వంటి నేతల విమర్శల్లో నిజం లేకపోలేదు. పెద్దల ప్రమేయం లేకుండా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి….. వివేకానందరెడ్డిని హత్య చేయించేంత ధైర్యం చేయగలరా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

వివేకానందరెడ్డి హత్యపై నిందితులు రోజుకొక కొత్త కథ తెరపైకి తీసుకువస్తున్నారు. ముందు గుండెపోటు అన్నారు, తరవాత గొడ్డలివేటు అన్నారు. కొద్ది కాలానికే రియల్ ఎస్టేట్ వివాదాలున్నాయని ప్రచారం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై నెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మరోకొత్త మలుపు తిప్పారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకానందరెడ్డి వేధించడం వల్లే అతను పగబట్టి చంపించాడని చెబుతున్నారు. పులివెందుల్లో కనీసం సొంత ఇళ్లు కూడా లేని సునీల్ యాదవ్ కు 40 కోట్లు ఖర్చు చేసే స్తోమత ఉందా అనే అనుమానం ప్రతి సామాన్యుడికి కలుగుతోంది. ఇక్కడే వైఎస్ భాస్కర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.

పులివెందుల్లో రాజకీయంగా వైఎస్ ఫ్యామిలీ బలంగా పాతుకుపోయిందంటే దానికి కారణం, వైఎస్ వివేకానందరెడ్డి. అలాంటి వ్యక్తిని చంపాలని నిర్ణయం తీసుకునే స్థాయి భాస్కర్ రెడ్డికి లేదనే చెప్పాలి. పై స్థాయిలో వ్యక్తుల సహకారం లేనిదే ఇదంతా సాధ్య కాదని అర్థమైపోతోంది. అధికారంలోకి రాక ముందు వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన వారే, నేడు సీబీఐ కావాలనే తమపై తప్పుడు కేసులు పెడుతోందంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. అసలు వివేకానందరెడ్డి హత్య కుట్రకు బీజం వేసింది ఎవరు? ఒక హత్యకు 40 కోట్ల ఇవ్వగల సామర్థ్యం ఎవరికి ఉంది? వివేకాహత్యతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూసింది ఎవరు? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తే పెద్ద చేపలు చిక్కే అవకాశం ఉంది. ఈ దిశగా సీబీఐ దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *