
సీతక్క సీఎం అంటోన్న రేవంత్.. సీనియర్ల ఆగ్రహం
- NewsPoliticsTelangana Politics
- July 11, 2023
- No Comment
- 18
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం రాజుకుంటోంది. సీఎం పదవి కోసం పగటి కలలు కంటున్నారు నేతలు. ఎప్పటిలాగే ఎన్నికలకు ముందు.. నేను సీఎం అంటే నేను సీఎం అంటూ వాయిస్ రెయిజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో సీఎం పదవి ఆశిస్తున్న కొందరు నేతలు… తమకు ఆ పదవి దక్కకుంటే తమ వారికి ఇప్పించుకునేలా ఇప్పటినుంచే ఎత్తుగడ వేస్తున్నారు. దాంట్లో భాగంగానే వ్యూహాత్మకంగా దళిత కార్డు తెరపైకి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్క సీఎం అవుతారంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్.. పార్టీలో అగ్గి రాజేశాయి. పీసీసీ చీఫ్ పై సీనియర్లు మండిపడుతున్నారు. సీఎం సంగతి హైకమాండ్ చూసుకుంటోందని రేవంత్ కు కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు, సీతక్క కంటే సీనియర్లు చాలా మందే ఉన్నారంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో మంచి ఊపు వచ్చింది. కలిసికట్టుగా వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని నేతలంతా కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కానీ, సీఎం పదవిపై మాత్రం ఎవరూ మోజు చంపుకోవడం లేదు. అప్పుడే ఎన్నికల్లో గెలిచేశామనే భ్రమల్లోకి వెళ్లిపోతున్నారు. అమెరికా తానా సభలో రేవంత్ రెడ్డి సీఎం పదవిపై చేసిన కామెంట్స్ మళ్లీ పార్టీలో రచ్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు సీఎం అభ్యర్థిని ప్రకటించే అలవాటు లేదు. ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్ పరిధిలోని అంశం. కానీ, రేవంత్ నోరు జారారో లేక రాజకీయ వ్యూహంలో భాగంగానే అలాంటి వ్యాఖ్యలు చేశారో గానీ, సీనియర్ల ఆగ్రహానికి గురయ్యారు. సీతక్క కంటే సీనియర్లైన పోడెం వీరయ్య, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ లాంటి నేతలు చాలా మంది ఉన్నారంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ వర్గానికి కౌంటర్ ఇచ్చారు.
దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? అని అక్కడున్నవారు ప్రశ్నించగా… సీతక్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు యాధృచ్చికంగా అన్నవి కాదని తెలంగాణ కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో సీఎం పదవి సమీకరణాలపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సాధారణంగా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి .. సీఎం పదవి రేసులో ముందుంటారు. ఆ తర్వాత సీఎం పదవిని ఆశించే వారిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. అయితే కర్ణాటకలో మాదిరిగా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటే వారిని సీఎం చేయాలనుకుంటే.. ఎవరు రేసులో ముందుకొస్తారో చెప్పడం కష్టం.
ఇటీవల కాలంలో రేవంత్ వ్యతిరేక వర్గం దళిత సీఎం కార్డును తైరపైకి తీసుకొస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. రేవంత్ ను అడ్డుకునేందుకే కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారనే టాక్ నడిచింది. అందుకు తగ్గట్లే, కొంతకాలంగా భట్టి విక్రమార్కను కోమటిరెడ్డి సహా సీనియర్లు ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ వారి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు సీతక్క పేరును ప్రస్తావించినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతాననే ఆశతో రేవంత్ ఉన్నారు. కుదరని పక్షంలో గిరిజన కోటాలో తన ప్రధాన అనుచరురాలైన సీతక్కకు ఆ పదవి దక్కేలా చక్రం తిప్పాలనే ఎత్తుగడతో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే చేశారని తెలుస్తోంది.
మొత్తంగా, బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా ఎన్నికలకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్… సీఎం పదవి విషయంలో కుమ్ములాటలకు దిగడం కేడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతీసారి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ నేతలు వాదులాకోవడం, ప్రత్యర్థులకు అవకాశమిచ్చి అధికారం చేజార్చుకోవడం సర్వసాధారణమైపోయింది. సీఎం సంగతి తర్వాత, ముందు ఎన్నికల్లో గెలవడంపై దృష్టిపెట్టాలని కార్యకర్తలు కాస్త గట్టిగానే నేతలను హెచ్చరిస్తున్నారు.