కారు కేసీఆర్ ది..హారన్ బీజేపీది

కారు కేసీఆర్ ది..హారన్ బీజేపీది

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తవ్ కొడుకో అన్న చందంగా…సారు వందలాది కార్లు రయ్ మంటూ మహారాష్ట్రలోకి దుమ్ములేపుకుంటూ దూసుకెళ్లాయి. ఇప్పటివరకు ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా మరాఠా గడ్డపై గులాబీ దళపతి చేస్తున్న రాజకీయం సెగలు రేపుతోంది. మాటిమాటికి మహారాష్ట్రలో సభలు పెడుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి, అకస్మాత్తుగా భారీ కాన్వాయ్ లతో రోడ్డు మార్గంలో వెళ్లడం సంచలనం రేపింది. అంతే, ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. చుట్టపు చూపుగా వస్తే ఆతిథ్యం ఇచ్చి పంపిస్తాం. అంతేగానీ, ఏమిటీ బలప్రదర్శన, ఎవరికోసం నీ బలప్రదర్శన అంటూ స్థానిక విపక్షాలు గులాబీ దళపతిపై విరుచుకుపడుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాక..ఎక్కువగా మహారాష్ట్రపైనే ఫోకస్ పెడుతున్నారు. పక్కనే ఉన్న ఏపీలో ఆయన పప్పులు ఉడకడం లేదు. మొన్న కర్ణాటకలో తాను మద్దతిచ్చిన కుమారస్వామి పరిస్థితి ఏమైందో చూశాం. ఇక, ఢిల్లీలో ఆఫీసు తెరిచి హడావుడి చేయడం మినహా చేసిందేమీ లేదు. దీంతో, మహారాష్ట్ర రైతులనే నమ్ముకున్నారు. మరాఠా రాజకీయాల్లో ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ అక్కడ తరచూ సభలు పెడుతున్నారు. అయితే, అప్పుడప్పుడు ఓ మీటింగ్ పెట్టి వచ్చే కేసీఆర్, ఈసారి మరాఠా గడ్డమీదకు అలా ఇలా వెళ్లలేదు. ఏకంగా 600 కార్లతో తన సైన్యాన్ని వేసుకొని రెండు రోజులు పాటు మహారాష్ట్రలో పర్యటించారు. మొన్నటిదాకా పెద్దగా కేసీఆర్ ను పట్టించుకోని స్థానిక పార్టీలు..ఈసారి మాత్రం ఊరుకోలేదు. కేసీఆర్ చేసిన బలప్రదర్శన తమపై చేపట్టిన దండయాత్రగా భావించిన ఎన్సీపీ, శివసేనలు…. గులాబీ దళపతిపై శివాలెత్తిపోతున్నాయి. బీజేపీ కోసం నీవు చేసే రాజకీయాలు ఇక్కడ చెల్లవు అంటూ కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాయి.

మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తే తన్నితరిమేస్తారంటూ గతంలో చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఏకంగా ఆ గడ్డమీదకెళ్లి ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో, సత్తా చాటుతామంటున్నారు. ఈ క్రమంలోనే తన సర్వసైన్యంతో 600కార్లతో మరాఠా గడ్డపై అడుగుపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కూడా కేసీఆర్ ఏనాడు అంత బలప్రదర్శన చేసింది లేదు. అలాంటిది ఉన్నపళంగా మహారాష్ట్రకు అంతమందిని తీసుకొని వెళ్లడం వెనక పెద్ద స్కెచ్చే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ చేరికలపై దృష్టిపెట్టడం వల్లే, ఆ పార్టీల ఆగ్రహానికి గురయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ, కేసీఆర్ లపై శివసేన అధికారిక పత్రిక సామ్నా తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఓట్లు చీల్చేందుకు మజ్లిస్ ను వాడుకుంటోందని సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. దళితులు, ముస్లింలు ఓవైసీని నమ్మడం లేదనే, కేసీఆర్ ను తీసుకొచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మొత్తంగా…మహారాష్ట్రపైకి దూసుకెళ్లి కారు హారన్ కొట్టిన కేసీఆర్ ను అక్కడి రాజకీయ పార్టీలు స్ట్రాంగ్ వార్నింగే ఇస్తున్నాయి. పూజలు చేసుకొని వెళ్లు..అంతకు మించి చేస్తే తాము తెలంగాణకు రావాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై గులాబీ శ్రేణులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *