
జగన్ కుట్రలో పావుగా మారిన సోము వీర్రాజు
- Ap political StoryNewsPolitics
- June 21, 2023
- No Comment
- 21
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దాంతో, ఆ మూడు పార్టీలను ఎలా ఎదుర్కోవాలో తెలియక జగన్ కిందా మీద పడుతున్నారు. ఇప్పటికే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కార్ తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది. దానికి తోడు 2014 నాటి పొత్తుల సీన్ రిపీట్ అయితే … వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. దాంతో, వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని గ్రహించిన జగన్.. కులాల మధ్య కుంపటి రాజేస్తున్నారు. అంతేకాదు, మూడు పార్టీల మధ్య చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో గల్లంతైపోతామన్న భయంతో… పవన్ కళ్యాణ్ పై ముద్రగడను ప్రయోగించారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తుకు తూట్లు పొడిచే స్కెచ్ వేశారు. బీజేపీలోని తన బ్యాచ్ ను టీడీపీ అధినేత చంద్రబాబుపైకి ఉసిగొల్పుతున్నారు.
ఇప్పటికే అమిత్ షా, చంద్రబాబుల మధ్య ఢిల్లీ వేదికపై పొత్తులపై చర్చలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సిద్ధమనే సంకేతాలను కేంద్రపెద్దలు పంపారు. అయితే, రాష్ట్ర బీజేపీలోని ఓ వర్గం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేస్తూ పాత చింతకాయ పచ్చడి నూరుతున్నారు. అప్పుడు ప్రత్యేక హోదా వద్దని, ఇప్పుడు చంద్రబాబు సభలు పెడుతున్నారంటూ సోము పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఓ పక్కన అమిత్ షా విశాఖ వేదికగా జగన్ అవినీతి అక్రమాలను ఎండగడితే, సోము మాత్రం జగన్ కు జై కొట్టేవిధంగా వ్యవహరిస్తున్న తీరుతో బీజేపీలో గందరగోళం నెలకొంది.
ఏపీకి విభజన హామీలు నెరవేర్చాలిన బాధ్యత బీజేపీ పెద్దలపైన ఉంది. వాటిని సాధించాల్సిన కర్తవ్యం ఏపీ ముఖ్యమంత్రిగా జగన్, రాష్ట్ర బీజేపీ నేతలపైనా ఉంది. అవన్నీ పక్కనబెట్టి చంద్రబాబు అప్పుడు రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని సోము వీర్రాజు ప్రశ్నించడమం హాస్యాస్పదంగా ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన సోము వీర్రాజు.. అదేమీ చేయకుండా జగన్ అధికారంలోకి రావాలనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో నోటాతో పోటీ పడుతున్న బీజేపీ… టీడీపీ, జనసేనతో కలిస్తే మూడు, నాలుగు సీట్లు వచ్చే అవకాశముంటుంది. కానీ, పార్టీ ఏమైపోయినా పర్లేదన్న రీతిలో… పొత్తును విచ్ఛిన్నం చేసేలా సోము చేస్తున్న వ్యాఖ్యలతో కేడర్ అయోమయానికి గురవుతోంది. జగన్ కుట్రలో సోము వీర్రాజు పావుగా మారుతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.