
డీఎస్ కుటుంబంలో రాజకీయ రగడ ఎందుకంటే..?
- Ap political StoryNewsPolitics
- March 30, 2023
- No Comment
- 35
ధర్మపురి శ్రీనివాస్.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏ పార్టీలో ఉన్నా సంచలనమే. తాజాగా ఆయన కుటుంబంలో అలజడి రేగింది. డి.శ్రీనివాస్ ఏపార్టీలో ఉన్నారని అడిగితే.. ఠక్కున సమాధానం చెప్పలేం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తేలింది. అయితే అది ఎంతోసేపు కాదు..కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల్లోనే డి.శ్రీనివాస్ ‘రాజీ’నామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. డీఎస్, ఆయన భార్య విజయలక్ష్మి పేర్లతో విడుదలైన లేఖలు రాజకీయ తుఫాన్ కు కారణం అయ్యాయి. తాను కాంగ్రెస్‌లో చేరలేదని, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు డీఎస్ ప్రకటించారు. మరోవైపు రాజకీయాలకు డీఎస్‌ను వాడుకోవద్దని, ఆయనను ప్రశాంతంగా బతకనీయమని ఆయన భార్య విజయలక్ష్మి విజ్ఞప్తి చేస్తున్నారు.
ధర్మపురి కుటుంబంలో వివాదం రేగడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని డీఎస్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్వింద్ ఇదంతా నడిపిస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. గంటల వ్యవధిలోనే ఒక్కసారిగా పరిణామాలు మారిపోవడంతో డీఎస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రికి ప్రాణహాని ఉందని, ఆయనతో బలవంతంగా లేఖలు రాయిస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అన్నదమ్ముల రాజకీయ ఆట, ఆధిపత్యపోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
ఇక.. కాంగ్రెస్ లో చేరికను ఖండిస్తూ ధర్మపురి శ్రీనివాస్, ధర్మపురి విజయలక్ష్మి పేరిట రెండు వేర్వేరు లేఖలు ఒకే సమయాన మీడియాకు విడుదల కావడం విశేషం. మొదటి లేఖలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ డీఎస్ పేర్కొన్నారు.. అంతే కాదు తానిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఆరోగ్యం సహకరించనందున రాజకీయ నిష్క్రమణ చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. ఇదే అంశంపై తమను వదిలేయాలని… తమతో ఆటాలాడుకోవద్దంటూ డీఎస్ భార్య విజయలక్ష్మి మరో లెటర్ విడుదల చేశారు. వాస్తవానికి ధర్మపురి అర్వింద్ కుటుంబం ఈ స్థాయిలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అనేది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన పదవులను నిర్వహించిన డీఎస్ తిరిగి అదే పార్టీని తిడుతూ లేఖలు సంధించడం వెనుక ఆయన తనయుడు..బీజేపీ ఎంపీ అర్వింద్ హస్తం ఉందంటున్నారు.
మరోవైపు.. తన తమ్ముడు అర్వింద్… తన తండ్రిని రాజకీయాలకు వాడుకుంటున్నాడని మండిపడ్డారు సంజయ్. తన తండ్రి కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగారని చనిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా తనపై ఉండాలనే ఆయన కోరిక అన్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆనందంగా ఉండేందుకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.మొత్తం మీద డీఎస్ కుటుంబంలో చెలరేగిన రాజకీయ చిచ్చు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.