
ఢిల్లీ టూర్‌లో అమిత్ షా తో పవన్ భేటీ.. అసలు కథేంటి..?
- Ap political StoryNewsPolitics
- April 4, 2023
- No Comment
- 31
జనసేనాని పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా చేపట్టిన ఢిల్లీ టూర్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు పక్కా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి ప్రత్యేక ఆహ్వానంతో పవన్ ఢిల్లీ టూర్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయన వెంట పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉండటంతో.. రాజకీయ వ్యవహారాల మీదే పవన్ ఢిల్లీ టూర్ ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ కావటంతో.. జనసేనాని టూర్ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక.. కర్ణాటకలో ఎన్నికల నగారా మోగినందున.. అక్కడ ప్రచారానికి పవన్ సహకారాన్ని బీజేపీ కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో పవన్ ప్రచారం చేయాలని హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కోరినట్టు చెబుతున్నారు. దీనికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. కేవలం కర్ణాటక ఎన్నికల కోసమే పవన్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలవలేదనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీజేపీ తీరుపై విసుగు చెందిన పవన్ తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. కమలానికి టాటా చెప్పి… ఆయన సైకిల్ ఎక్కేస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన జోడీ కడితే.. ఫ్యాన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దమ్ముంటే విడి విడిగా పోటీ చేయాలంటూ సీఎం జగన్ రెడ్డితో సహా వైసీపీ నేతలంతా.. జనసేన, టీడీపీలను రెచ్చ గొడుతున్నారు. మరోవైపు.. వైసీపీతో.. బీజేపీ అప్రకటిత పొత్తును కొనసాగిస్తోంది. చాలా మంది ఏపీ బీజేపీ నేతలు.. వైసీపీ “బీ టీమ్” గా పని చేస్తున్నారు. అటు బీజేపీ పెద్దలు సైతం పవన్ సింగిల్ గా పోటీ చేస్తే.. ఆయన్ను ఏదోలా సీఎం ను చేస్తామని హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం జగన్ బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ముందస్తు ఎన్నికలు.. రాజకీయ పొత్తులపైనే ఆయన బీజేపీ పెద్దలతో మాట్లాడినట్టు సమాచారం. ఆయన అలా ఢిల్లీ నుంచి రాగానే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావటం అనేక అనుమానాలకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ ను తమ గుప్పెట్లో పెట్టుకోవటానికే బీజేపీ పెద్దలు ఆయన్ను పిలిపించి ఉంటారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద.. ఇంటర్నల్ టాపిక్‌ను ఇటు బీజేపీ, అటు జనసేన నేతలు బయట పెట్టనప్పటికీ… పవన్ ఢిల్లీ టూర్ వెనుక పెద్ద వ్యవహారమే ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.