విజయ సాయి అదృశ్యం అందుకేనా?

విజయ సాయి అదృశ్యం అందుకేనా?

వైసీపీలో నంబర్ టూ గా వెలుగొందిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఏమైపోయారు? ఎక్కడా కనిపించడం లేదు ఎందుకని? యాక్టివ్ పాలిటిక్స్‌లో విజయసాయిరెడ్డి “మిస్సింగ్” వ్యవహారం.. మిస్టరీగా మారింది. గత కొన్ని రోజులుగా ఇటు ట్విట్టర్‌లోనూ.. అటు పబ్లిక్ లైఫ్ లోనూ విజయసాయిరెడ్డి కనిపించటం లేదు. సమయం, సందర్భం లేకుండా ప్రతీదానికి టీడీపీని ఆడిపోసుకుంటూ, పిచ్చిపిచ్చి కామెంట్లు పెట్టే విజయసాయిరెడ్డి, సడన్ గా ఎందుకు అదృశ్యమయ్యారు? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌ లో నడుస్తోంది. వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబీకుల అరెస్ట్ తో ఇప్పుడు మరోసారి విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తోంది. వివేకా హత్య కేసును తొలుత గుండెపోటుగా చెప్పిన సాయిరెడ్డి, ఆ తర్వాత స్క్రిప్ట్ మార్చి ఆ నెపాన్ని టీడీపీ పై తోసేశారు. నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తో పాటు..మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిలే హత్య చేయించారని అసత్య ప్రచారం చేయించారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు వైఎస్ కుటుంబంలోని వ్యక్తులేనని సీబీఐ గుర్తించడంతో, సాయిరెడ్డి ఎక్కడ? అని అంతా చర్చించుకుంటున్నారు.

విజయ సాయిరెడ్డి… ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ తరువాత ఏ2గా ఆయన పేరే ఉంది. అంతేకాదు, పార్టీలో, ప్రభుత్వంలో సీఎం తరువాత “నెంబర్ టూ” గా గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు.. ఆ తరువాత కూడా సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి ఓవర్ యాక్షన్ గురించి.. నెటిజన్లు కథలు కథలుగా చెబుతుంటారు. పెద్దల సభగా గుర్తింపు పొందిన “రాజ్యసభ”కు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. తన స్థాయిని మరిచి.. నీచమైన ట్వీట్లు పెట్టటం విజయసాయిరెడ్డి స్పెషాలిటీగా చెబుతారు. పనిపాట లేకుండా పిట్టగూటిలో దూరి..చంద్రబాబు, లోకేష్ లపై ఆయన అసహ్యమైన రాతలు రాసేవారు. అటువంటి విజయసాయిరెడ్డి..కొంతకాలంగా సైలెంట్ అయిపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.

వైఎస్ వివేకా హత్య కేసులో, ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి చేసిన రచ్చ మామూలుగా లేదు. వివేకా హత్య అనంతరం గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించి, మీడియా ముందు గగ్గోలు పెట్టిన ఘనడు విజయసాయిరెడ్డి నే. ఆ తర్వాత, అది హత్య అని తేలడంతో…స్క్రిప్ట్ మార్చి కేసును సీబీఐకి ఇవ్వాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతేకాదు, వివేకా హత్యకు టీడీపీ వాళ్లే కారణమంటూ మీడియా ముందు పిచ్చి ప్రేలాపనలు పేలారు. చంద్రబాబు, లోకేష్, ఆదినారాయిరెడ్డిలే వివేకాను చంపించారని అసత్య ప్రచారం చేశారు. నారాసుర రక్తచరిత్ర అంటూ కట్టుకథలు అల్లి, టీడీపీ పై తప్పుడు వార్తలు రాయించారు. జగన్ బాబాయి హత్య కేసును ఎన్నికల్లో ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. నాలుగేళ్లుగా ఆడాల్సిన నాటకాలన్నీ ఆడారు. తీరా, ఇప్పుడు సీబీఐ పక్కా ఆధారాలతో ఉచ్చు బిగుస్తుండడంతో, పత్తా లేకుండా పోయారు. ఈ క్రమంలోనే అయ్యా… “గుండెపోటు సాయిరెడ్డి” గారు ఎక్కడున్నారు…? ఒక్కసారి దర్శనభాగ్యం కల్పించండి..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జగనాసుర రక్తచరిత్ర గురించి మాట్లాడడానికి మాటలు రావడం లేదా..? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

అటు ట్విట్టర్ లో.. ఇటు డైరెక్ట్ పాలిటిక్స్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి యాక్టివ్ గా కనిపించక పోవటానికి అనేక రీజన్స్ చెబుతున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్ ఓ కారణమైతే, ఉత్తరాంధ్రలో సీఎం జగన్ కు చెప్పకుండా చేసిన సెటిల్‌మెంట్ వ్యవహారాలు…. “సాయిగారి మిస్సింగ్‌”కు ప్రధాన కారణాలని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ నుంచి తప్పించి, ఢిల్లీలో లాబీయింగ్‌ కు పరిమితం చేసినా..లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జాతీయ స్థాయిలో పార్టీ పరువు పోయేలా చేశారనే కారణంగా జగన్ రెడ్డే దూరంపెట్టినట్టు చెబుతున్నారు. ఈక్రమంలోనే నెల్లూరు జిల్లాలో అసంతృప్త ఎమ్మెల్యేల విషయంలో రచ్చరచ్చ జరిగినా, వివేకా హత్య కేసులో వైఎస్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నా…వైసీపీకి సంబంధించిన ఏ సీరియస్ ఇష్యూపైనా….ఇప్పుడు సాయిరెడ్డి స్పందించడం లేదు. అసలు, వైసీపీలో ఆయన ఉన్నారా..? పాలిటిక్స్ లో కొనసాగుతున్నారా..? అనే డౌట్లు సైతం వ్యక్తం అవుతున్నాయి. అయినదానికి, కానిదానికి… ట్వీట్లు పెట్టి టీడీపీని విమర్శించే విజయసాయిరెడ్డి.. ఒక్క మాట కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉన్నారంటూ వైసీపీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక జగన్ ఇచ్చిన వార్నింగే కారణమా..? లేక సాయి గారి స్వయంకృతాపరాథాలే కారణమా..? అనే దానిపై చర్చించుకుంటున్నారు.

ప్రతిపక్షాల నుండి పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఎలాంటి విమర్శలొచ్చినా స్పందించే వారిలో మొదటివరుసలో ఉండే..మౌత్ పీస్ విజయసాయిరెడ్డిగా చెబుతారు. జగన్ కు కుడిభుజంగా ఉండి..ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన సాయిరెడ్డి…ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు కోడి కత్తి కేసు.. మరో వైపు వివేకా హత్య కేసు జగన్ మెడకు చుట్టుకుంటున్నా.. విజయసాయిరెడ్డి మాత్రం తెరపైకి రావటం లేదు. ఆయన ఏమైపోయారా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా జగన్ రాజకీయ, వ్యాపార సామ్రాజ్యంలో లోటుపాట్లన్నీ పూర్తిగా తెలిసిన విజయ సాయిరెడ్డి ని .. వదిలించుకోవటం అంత తేలిక కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మిస్సింగ్ వ్యవహారం.. తాత్కాలికమా..? వ్యూహాత్మకమా..? అనేది తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *