
మే1 నుంచి షిర్డీలో సమ్మె.. బాబా వారి దర్శనం బంద్ అవుతుందా.? .
- News
- April 28, 2023
- No Comment
- 33
భారతదేశంలోనే ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోన్న షిర్డీ సాయిబాబా వారి ఆలయం త్వరలో మూతపడనుందా..? మే1 నుంచి షిర్డీ గ్రామస్తులు చేస్తున్న సమ్మెతో బాబావారి దర్శనం బంద్ కానుందా..? ఇకపై.. షిర్డీ వెళ్ళే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. షిర్డీ సాయిబాబా సంస్థాన్ కు వ్యతిరేకంగా.. స్థానిక ప్రజలు సమ్మె చేపట్టటంతో.. షిర్డీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సాయి నాధుని భక్తుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ.. షిర్డీ సాయిబాబా సన్నిధిలో ఎందుకు వివాదం తలెత్తెంది..? షిర్డీ ప్రజలు ఎందుకు సమ్మెబాట పట్టారు..?
మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, షిర్డీ ఆలయం దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటనే సంగతి తెలిసిందే. అతి చిన్న గ్రామం అయిన షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తుంటారు. అయితే సాయిబాబా భక్తులకు ప్రధాన సందర్శన కేంద్రంగా ఉన్న షిర్డీ మే 1 నుంచి నిరవధికంగా మూతపడనుందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు కారణం.. సాయిబాబా ఆలయం భద్రత విషయమై సాయి సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ గ్రామస్తుల మధ్య నెలకొన్న వివాదమే. సాయి మందిరం భద్రత కోసం CISF బలగాలను మోహరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్‌కు షిర్డీ వాసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో షిర్డీలోని అన్ని వర్తక, వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచి పోనున్నాయి. షిర్డీ క్షేత్రంలో సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు ద్వారా ఆధ్మాత్మిక వాతావరణం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు.. సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు కోసం జరుగుతున్న కసరత్తును షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను షిర్డీ సాయిబాబు సంస్థాన్ ట్రస్టు చూసుకుంటోంది. అయితే, ఆలయానికి సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ కోర్టుకు కూడా వెళ్లారు. సీఐఎస్ఎఫ్‌కు ఆలయ భద్రతకు అవసరమైన శిక్షణ కానీ, సదుపాయాలు కానీ లేవని వారంటున్నారు. సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపుతో షిర్డీ పవిత్రత దెబ్బతింటుందని షిర్డీలోని అఖిలపక్ష నాయకులు, గ్రామస్థులు ఇటీవల సమవేశమై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మే 1 నుంచి నిరవధిక బంద్‌కు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణను అదే రోజు జరిగే గ్రామసభలో నిర్ణయించనున్నారు.
షిర్డీని రోజువారీ సందర్శించే భక్తుల్లో మొదట్నించీ తెలుగువారి సంఖ్య గణనీయంగానే ఉంటోంది. అనేక మంది తెలుగువారు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని, వాణిజ్య, వసతి సదుపాయాల కల్పిస్తున్నారు. ఈ క్రమంలో షిర్డీ గ్రామస్థుల నిరవధిక బంద్ ప్రభావం ముఖ్యంగా షిర్డీని సందర్శించే తెలుగువారిపై ఏమేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకునేందుకు సాయిబాబా సంస్థాన్ ఏర్పాట్లు చేస్తోంది. షిర్డీలో వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడినప్పటికీ ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని అంటున్నారు. సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటిన్‌ను సంస్థాన్ యథాప్రకారం కొనసాగిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే.. షిర్డీ గ్రామస్తుల ఆందోళనల నేపథ్యంలో షిర్డీ ఆలయం మూత పడుతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే1 వ తేదీ నుంచి షిర్డీ ఆలయం మూతపడుతుందని జరుగుతున్న ప్రచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
మొత్తం మీద.. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు… షిర్డీ గ్రామ ప్రజలకు మొదలైన వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయాన్ని తప్పుపడుతున్న గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. దీంతో.. దేశం నలు మూలల నుంచి షిర్డీ వచ్చే భక్తులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. అయితే.. దీనిపై ఇరు వర్గాలు రాజీకి వస్తాయా..? లేక తెగేంత వరకు లాగుతాయా..? అనేది సస్పెన్స్ గా మారింది.