
అమరావతి విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ..
- Ap political StoryNewsPolitics
- March 29, 2023
- No Comment
- 31
అంతా అనుకున్నట్టే అయ్యింది. సుప్రీం కోర్టులో సీఎం జగన్ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వటానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసు తదుపరి విచారణను సైతం జులై 11 వ తేదీకి వాయిదా వేసింది. దీంతో.. చట్ట విరుద్ధంగా విశాఖకు రాజధాని తరలించేద్దామని భావించిన సీఎం జగన్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. విచారణ కూడా మూడు నెలలకు పైగా వాయిదా పడటంతో.. జగన్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. మరోవైపు.. కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ లాయర్ల అత్యుత్సాహంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఏపీ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు తేల్చి చెప్పినా.. జగన్ సర్కార్ ఏదో ఒక విధంగా రాజధానిని తరలించే ప్రయత్నాలే చేస్తోంది. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తలుపు తట్టిన జగన్ సర్కార్‌కు మరోసారి ఆశాభంగం ఎదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. విచారణను జులై 11కు వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వ లాయర్లు ఉసూరుమన్నారు. తీర్పుపై స్టే కోసం అదే పనిగా విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవటంతో… జులై 11 వరకు జగన్ సర్కార్ వేచి చూడాల్సి వస్తోంది.
ఇక.. అమరావతిపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మరో కేసు విచారణ జరుగుతుండగానే.. అమరావతి కేసు ముందగా విచారించాలంటూ ఏపీ ప్రభుత్వ లాయర్లు ధర్మాసనాన్ని పదే పదే విజ్ణప్తి చేశారు. దీంతో జస్టిస్ కేఎం జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఒక కేసు సగం విచారణలో ఉండగా… మరో కేసు ఎలా విచారించాలి అని న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా… మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ లాయర్లు మిన్నకుండిపోయారు. చివరకు ధర్మాసనం ముందుకు అమరావతి కేసు రాగా.. తదుపరి విచారణ జులై 11కు వాయిదా పడటంతో.. ఏపీ లాయర్లు ఉసూరు మంటూ సుప్రీం కోర్టు నుంచి బయటకు వచ్చేశారు.