
అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్..
- Ap political StoryNewsPolitics
- April 24, 2023
- No Comment
- 90
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కొట్టేశారు. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు.. సీబీఐ కి లైన్ క్లియర్ అయ్యింది. ఈ కేసులో వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటీషన్‌పై విచారించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నర్సింహ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పూర్తిగా తప్పు పట్టిన చీఫ్ జస్టిస్.. వాటిని కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. అవినాష్ రెడ్డికి కనీసం ఒక్కరోజు అయినా మినహాయింపు ఇవ్వాలని కోరిన.. ఆయన తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను సైతం తోసిపుచ్చారు. ఈ న్యాయస్థానం అటువంటి ఉత్వర్వులు ఇవ్వలేదని తేల్చి చెప్పిన సీజేఐ.. అసలు మీరు ఆ బెయిల్ పిటీషన్ ఉపసంహరించుకుంటే మంచిదంటూ రోహత్గీని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. దీంతో.. చేసేదేమీ లేక.. ముకుల్ రోహత్గీ సైతం తన వాదనలను ముగించి.. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయంతో ఏకీభవించాల్సి వచ్చిందని అంటున్నారు.
ఇక.. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డికి అనుకులంగా ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ పై నిర్ణయాన్ని వాయిదా వేసి.. ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు బ్రేక్ పడింది. అయితే.. ఆ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలు.. హైకోర్టు పరిధికి మించి ఉన్నాయని తాజాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. విచారణ సమయంలో అవినాష్ రెడ్డికి ముందుగా ప్రశ్నాపత్రాన్ని ప్రింటెడ్ ఫార్మాట్‌లో ఇవ్వాలంటూ… హైకోర్టు ఎలా ఆదేశాలు ఇస్తుందంటూ…? సీజేఐ ఆశ్చర్య పోయారు…? అసలు ఇలాంటి తీర్పులు ఎలా ఇస్తారంటూ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో హైకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చిందంటూ.. జడ్జిమెంట్ మొత్తాన్ని కొట్టేశారు. ఈ క్రమంలోనే.. తన వాదనలు వినిపించబోయిన ముకుల్ రోహత్గీని సైతం సీజేఐ సున్నితంగా వారించినట్టు తెలుస్తోంది. మిస్టర్ రోహత్గీ జడ్జిమెంట్ కాపీని పూర్తిగా చదివారా..? అంటూ సీజైఐ ప్రశ్నించటంతో..ఆయన సైతం వెనక్కు తగ్గినట్టు చెబుతున్నారు.
ఇక.. ఈ కేసులో ఒంటరి పోరాటం చేస్తున్న వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీజేఐ ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు.. న్యాయాన్ని బతికిస్తుందని ఆమె తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అసంబద్ద తీర్పుపై.. సునీతా రెడ్డి తరపును సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ లూద్రా వాదనలు వినించారు. దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు బ్రేకులు వేసే విధంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఉందంటూ.. ఆయన చేసిన వాదనలతో సీజేఐ ఏకీభవించారు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందన్న సిద్ధార్ద్ లూథ్రా వాదనలతో ఏకీభవించారు. ఈ కేసు విచారణ మరింత లోతుగా జరగాలని భావించిన సీజేఐ చంద్రచూడ్.. తుది గడువును జూన్ 30వరకు పెంచారు. దీంతో సీబీఐ విచారణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోగా.. కీలక నిందితుడు అవినాష్ రెడ్డి అరెస్టుకు రూట్ క్లియర్ అయ్యింది. దీంతో.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండతో ఇన్నాళ్ళూ జాప్యం చేస్తూ వచ్చిన అవినాష్ రెడ్డి.. జైలుకు వెళ్ళక తప్పని పరిస్తితి నెలకొంది.