వైసీపీ పోస్టర్ వార్‌కు ప్రతిపక్షాల దిమ్మతిరిగే కౌంటర్…

వైసీపీ పోస్టర్ వార్‌కు ప్రతిపక్షాల దిమ్మతిరిగే కౌంటర్…

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయినట్టు ఉంది..ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ వ్యవహారశైలి. బటన్ నొక్కుడు పథకాలతో పని కాదనే నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ “జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, గ్రామ వాలంటీర్లు, గృహసారధులు ఇలా.. సుమారు 7 లక్షల మందికి పైగా మందీ మార్బలాన్ని రంగంలోకి దింపింది. వారి మెడలో సంచులు వేసి.. “జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” అంటూ జనాలపైకి వదిలింది. ప్రతీ ఇంటిని సందర్శిస్తూ.. వారు గోడలపై “జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” అంటూ ముద్రించిన స్టిక్కర్లు అంటించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 7 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపీ నేతలు.. శక్తి వంచన లేకుండా స్టిక్కర్లు అంటిస్తూనే ఉన్నారు. అయితే.. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీకి వచ్చే మైలేజ్ సంగతి అటుంచితే.. టీడీపీ, జనసేన పార్టీలు స్టార్ట్ చేసిన కౌంటర్ ఎటాక్.. ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు.

“జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” అంటూ వైసీపీ నేతలు స్టిక్కర్లు అంటిస్తుండగా.. దీనికి టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు. “మాకు నమ్మకం లేదు జగన్..”, ” మాకు పట్టిన దరిద్రం నువ్వే జగన్”, “ఎందుకు నమ్మాలి నిన్ను..?” అంటూ రకరకాల పోస్టర్లతో.. కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. వైసీపీ కి పోటీగా ఈ స్టిక్కర్లు అంటిస్తూ ప్రజల్లో దాగి ఉన్న ఆగ్రహావేశాలకు అక్షర రూపం ఇస్తున్నారు. అలాగే.. ఎందుకు నమ్మాలి జగన్ నిన్ను..? అంటూ.. జగన్ రెడ్డి వైఫల్యాలను పోస్టర్ల రూపంలో ఎండగడుతున్నారు. అదే సమయంలో “మీరే మా గౌరవం.. మీతోనే రాష్ట్ర అభివృద్ధి” అంటూ చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులతో పాజిటివ్ క్యాంపైన్ ను కూడా స్టార్ట్ చేశారు. మరోవైపు జనసేన పార్టీ సైతం వైసీపీకి వ్యతిరేకంగా పోస్టర్ వార్ స్టార్ట్ చేసింది. “మాకు నమ్మకం లేదు జగన్.. మాకు నమ్మకం పవన్” అంటూ జనసైనికులు వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్నారు. ఒక్కో ఇంటి వద్ద వైసీపీ ఒక పోస్టర్ అంటిస్తే… దానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన అంటించిన పోస్టర్లు రెండు కనిపిస్తున్నాయి. దీంతో.. “జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” పోస్టర్ల కంటే.. ” నువ్వే మా దరిద్రం జగన్” అనే పోస్టర్లే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. దీంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పోస్టర్ వార్ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇచ్చింది గోరంత.. చెప్పుకుంటోంది కొండంత అనే విధంగా తయారైన వైసీపీ అతి ప్రచారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక.. సోషల్ మీడియాలో సైతం.. వైసీపీ పోస్టర్ వార్ కు వ్యతిరేకంగా.. టీడీపీ, జనసేన పార్టీల ప్రచారం హోరెత్తిపోతోంది. “జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” పోస్టర్ల కంటే.. ఎక్కడ చూసినా నువ్వే మా దరిద్రం పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ పోస్టర్లు, వీడియోలతో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో.. జగన్ సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చిన సలహాతో ఈ భారీ పోస్టర్ క్యాంపైన్ కు వైసీపీ శ్రీకారం చుట్టింది. అయితే.. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. ప్రతిపక్షాల నుంచి వస్తున్న కౌంటర్ ఎటాక్ ఆ పార్టీకి ఊపిరి సలపనివ్వటం లేదు.

మరోవైపు.. “జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” అంటూ వైసీపీ నేతలు అంటిస్తున్న స్టిక్కర్ల పట్ల ఇంటి యజమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి తన సొంత జేబులోంచి సొంత డబ్బు తీసి ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ ఇంటి ముందు దిష్టి బొమ్మలా… ఈ స్టిక్కర్ ఏంటంటూ ఈసడించుకుంటున్నారు. మరి కొంత మంది.. ఇంటి ముందు దిష్టి పోవటానికి ఉపయోగించే భూతం బొమ్మలను స్టిక్కర్ పక్కన అతికించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టీజ్ కు చేరిందంటూ.. మరికొంత మంది స్టిక్కర్లను చింపి డ్రైనేజీల్లో పడేస్తున్నారు. మెడలో సంచులు వేసుకుని స్టిక్కర్ బ్యాగులతో వస్తున్న వైసీపీ నేతలను చూసి.. వీళ్ళకు ఇదేం దౌర్భాగ్యం అంటూ నవ్వుకుంటున్నారు.

ఇక.. వైసీపీ స్టిక్కర్ క్యాంపైన్‌తో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఏపీ గ్రామాల్లో అనవసర వివాదాలు.. గొడవలకు ఆస్కారం కలుగుతోంది. ప్రతీ ఇంటి వద్ద వైసీపీ స్టిక్కర్ ను అతికించటాన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తప్పు పడుతున్నాయి. వైసీపీ అతికించిన స్టిక్కర్లకు ప్రతిగా ప్రతిపక్షాలు స్టిక్కర్లు అంటిస్తుండటం, స్థానికులు స్టిక్కర్లను చింపి డ్రైనేజీల్లో పడేస్తున్నటువంటి చర్యల పట్ల.. గ్రామాల్లో ఓ రకమైన ఉద్రిక్త వాతారణం నెలకొంటోంది. దీనికంతటికీ కారణం సీఎం జగన్ అతి ప్రచారమే కారణమనే భావన వ్యక్తం అవుతోంది

మొత్తం మీద.. సీఎం జగన్ రెడ్డి ఒత్తిడితో.. మెడలో సంచులు వేసుకుని.. పోస్టర్లు అతికించటానికి వెళుతున్న నేతలను జనం బఫూన్లను చూసినట్టు చూస్తున్నారు. పైగా.. ఇటు సోషల్ మీడియా.. అటు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన పార్టీల ఎదురుదాడి తీవ్రం చేశాయి. దీంతో.. “జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్” కార్యక్రమం పూర్తిగా బెడిసికొట్టిందనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఏప్రిల్ 20 వరకు ఈ క్యాంపైన్‌ను కంటిన్యూ చేయాల్సి రావటంతో.. ముందు ముందు ఇంకెన్ని అవమానాలు ఎదుర్కోవాలా..? అని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *