
తమ్మినేని ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు..రాష్ట్రపతి,గవర్నర్లు,సీజేలకు టీడీపీ ఫిర్యాదు
- Ap political StoryNewsPolitics
- April 14, 2023
- No Comment
- 26
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చిక్కుల్లో పడ్డారు. ఆయన విద్యార్హతపై వివాదం చెలరేగుతోంది. అసలు డిగ్రీనే లేకుండా బీఎల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.తమ్మినేని నకిలీ డిగ్రి సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లుగా టీడీపీ నేతలు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఫేక్ సర్టిఫికెట్ ను లా కాలేజీకి సమర్పించారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సీతారాం కూడా తన స్టడీ సర్టిఫికెట్ వ్యవహారంపై స్పందించకపోవడంతో….ఆయన డిగ్రీ, లా పట్టాల అంశం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ అంశం దుమారం రేపుతోంది. హైదరాబాద్ మహాత్మాగాంధీ లా కళాశాల నుంచి ఆయన మూడేళ్ల ఎల్ఎల్‌బి పాస్ అవడంపై వివాదం రాజుకుంటోంది. లా పరీక్షలు రాశారా..? లేదా రాయకుండానే పట్టా సాధించారా..? అనేది ఓ వివాదమైతే..అసలు డిగ్రీ విద్యార్హత లేకుండా ఎల్ఎల్‌బీ అడ్మిషన్ ఎలా జరిగిందనేది..? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏపీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ వ్యవహారంపై ఆరా తీసిన టీడీపీ నేతలు, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లుగా తేల్చారు. స్పీకర్ డిగ్రీ చదవకుండానే, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను లా కాలేజీకి సమర్పించినట్లు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ అంశంపై ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి వివరాలు సేకరించారు. సీతారాం నాగర్‌కర్నూలు స్టడీ సెంటర్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారని…అయితే, అక్కడి స్టడీ సెంటర్ రికార్డుల్లో తమ్మినేని పేరు లేదని తమ విచారణలో తేలినట్లు నర్సిరెడ్డి తెలిపారు. తమ్మినేని సమర్పించిన ఫేక్ సర్టిఫికెట్ల కాపీలను నర్సిరెడ్డి విడుదల చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు.
మరోవైపు, డిగ్రీనే లేకుండా ఎల్ఎల్‌బీ అడ్మిషన్ ఎలా జరిగిందని ప్రశ్నిస్తూ టీడీపీ నేత కూన రవికుమార్ కూడా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. తమ్మినేని సీతారాం 2019-20లో మొదటి సంవత్సరం ఎల్‌ఎల్‌బీలో ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆధారంగా అడ్మిషన్ పొందారు. మూడేళ్ల లా కోర్సు చేయాలంటే సంబంధిత అభ్యర్ధి డిగ్రీ లేదా సమానమైన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలి. కానీ తమ్మినేని సీతారాం డిగ్రీ చేయలేదని, అతని విద్యార్ఙత ఇంటర్మీడియట్ మాత్రమేనని, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “బీఏ” చదువుతూ సగంలోనే మానేసినట్టుగా ఆయనే చెప్పారనే విషయాన్ని రవికుమార్ లేఖలో ప్రస్తావించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ తో మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందిన వైనంపై… టీడీపీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎం జగన్, సీజేలకు లేఖలు రాశారు.
అదేవిధంగా, 2019 ఎన్నికల అఫిడవిట్లో తమ్మినేని తన విద్యార్హత “డిగ్రీ డిస్ కంటిన్యూ” అని ధృవీకరించిన విషయాన్ని టీడీపీ హైలెట్ చేస్తోంది. 2019లో డిగ్రీ డిస్ కంటిన్యూస్ గా ప్రకటించిన తమ్మినేని … మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారనేది మాత్రం చెప్పడం లేదు. ఈ అంశం మున్ముందు రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. తాము అధికారంలోకి వచ్చాక, నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేసి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వదిలి పెట్టే ప్రశ్నే లేదంటున్నారు.