
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి అరెస్టుతో దుమారం
- NewsPoliticsTelangana Politics
- April 6, 2023
- No Comment
- 30
తెలంగాణలో పేపర్ లీక్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. TSPSC పేపర్ లీకేజీ ఘటన BRS ను కుదిపేస్తున్న సమయంలో , టెన్త్ పేపర్ లీక్ రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని రాజేస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో బండి సంజయ్ పై కుట్ర కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వరుస పేపర్ లీక్ ఘటనలు రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కుంభకోణం పెను దుమారం రేపుతున్న తరుణంలో, పదో తరగతి ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్ అవుతుండడం కలకలం రేపుతోంది. పేపర్ లీకేజ్ ఘటన వెనుక రాజకీయ కోణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కరీంనగర్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి అరెస్ట్ వేడి రాజేసింది. బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.
గతంలో గ్రూపు -1 పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంలోనూ బండి సంజయ్ కు సిట్ రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ, ఆయన విచారణకు హాజరు కాలేదు.తన తరపున లీగల్ టీమ్ ను పంపించారు. ఇప్పుడు పదో తరగతి ప్రశ్నా పత్రాల విషయంలో బండి సంజయ్ పై కుట్రపూరిత కేసు నమోదైంది. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా తన భర్తను అరెస్ట్ చేసారని బండి సంజయ్ సతీమణి వాపోయారు. సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్టు, తెలంగాణలో పరిస్థితుల గురించి బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఇక.. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో వరుసగా రెండో రోజు టెన్త్ ప్రశ్న పత్రం వాట్సప్ లో సర్క్యులేట్ అయింది. హిందీ పేపర్ కాపీయింగ్ కేసులో ముఖ్య నిందితుడు బండి సంజయ్‌కు సన్నిహితుడు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. హిందీ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా భావిస్తోన్న ప్రశాంత్ హిందీ పేపర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదే వ్యవహారం పైన బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వార్ జరుగుతోంది. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తే… బీఆర్ఎస్ లోని కొందరు నేతలతో ప్రశాంత్ దిగిన ఫొటోలను బీజేపీ నేతలు బయటకు తీసుకొచ్చారు. దాంతో, పేపర్ లీక్ ఎపిసోడ్ రచ్చ రచ్చ అవుతోంది.
పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమంటూ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి… అమాయకులైన విద్యార్ధులు,నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్ అంటూ మరో మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే పేపర్ లీకులకు పాల్పడుతూ, బీజేపీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కమలనాథులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మొత్తంగా, పేపర్ లీక్ ప్రకంపనలు తెలంగాణను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. స్వార్థపూరిత రాజకీయాలకు యువత బలవుతున్నారు.