
బీజేపీలో గందరగోళ పరిస్థితులు.. బండి దిగితే ఆయనే బాస్?
- NewsPoliticsTelangana Politics
- July 4, 2023
- No Comment
- 18
తెలంగాణ బీజేపీలో ముసలం రాజుకుంది. నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఉన్న పదవి ఊడబెరుకుతున్నారని ఒకరు అసంతృప్తితో ఉంటే… కొత్తగా పదవులు ఆశించేవారు తమకు కావాల్సిన పోస్ట్ దక్కించుకునేందుకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే రెండు వర్గాలుగా విడిపోయిన కాషాయ నేతలు, పరస్పర విమర్శలతో రచ్చకెక్కుతున్నారు. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లేకుండా చేశారనే ఆవేదనతో ఉన్న కొందరు…బండి సంజయ్ పదవికి ఎసరు పెట్టడంతో పార్టీలో వేడి రాజుకుంది. ఏకంగా ఓ ఎమ్మెల్యే .. పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ప్రెసిడెంట్ మార్పు తర్వాత పార్టీలో మరింతగా సంక్షోభం ముదిరే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో గమ్మత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. అంతర్గతపోరుతో రగిలిపోయే కాంగ్రెస్ లో అసమ్మతి అంతా చల్లారిపోయింది. బీఆర్ఎస్ ను గద్దెదించడమే తమ లక్ష్యమంటూ, హస్తం పార్టీ నేతలంతా ఏకమై చేతులు కలిపారు. ఇక, కేంద్రపెద్దల కనుసన్నల్లో పనిచేస్తూ ఐకమత్యంగా ఉండే కమలనాథులు..గత కొన్నాళ్లుగా రచ్చకెక్కుతున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయి…నేతలు బహిరంగ విమర్శలకు దిగుతుండడంతో కేడర్ ఆందోళనకు గురవుతోంది. బండి సంజయ్ టార్గెట్ గా ఒక వర్గం…. అతనికి మద్దతుగా మరో వర్గం బాహటంగా గొడపడుతున్నారు. బండి సంజయ్‍నే అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ చాలా మంది హైకమాండ్‍కు విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ, అధిష్టానం బండి ప్లేస్ లో కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి కాదనుకుంటే ఈటలను అధ్యక్షుడిని చేసే అవకాశం ఉందంటున్నారు.
బండిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రఘునందన్, అధ్యక్షుడయ్యే యోగ్యత తనకూ ఉందంటూ చెప్పుకున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన తనకు పదవి ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయత్వంపై రఘునందన్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దుబ్బాకలో తన ఇమేజ్ తోనే గెలిచానని… పార్టీ పెద్దలు, పువ్వుగుర్తు చివరి అంశమని రఘునందన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. అయితే, ఆ తర్వాత మాట మార్చిన రఘునందన్… తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ నాలుక మడతేశారు. అయితే, బండి సంజయ్‍ను టార్గెట్ చేస్తూ రఘునందన్ చేసిన విమర్శలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. రఘునందన్ రావు బాటలో మరికొందరు బీజేపీ నేతలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, బండిపై రఘునందన్ విమర్శల వెనక బీజేపీ పెద్దల హస్తం కూడా ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పై బండి దూకుడుగా వెళ్తున్నారు. కేసీఆర్ పై విమర్శలను తగ్గించి, కాంగ్రెస్ ను టార్గెట్ చేసే ఉద్దేశంతోనే…బండిని తప్పించి ఆ ప్లేస్ లో మరొకరికి బాధ్యతలు అప్పగించడం రాజకీయ ఎత్తుగడగా విశ్లేషణలు సాగుతున్నాయి.
మరోవైపు, బీజేపీ నేత జితేందర్‌రెడ్డితో ఈటల రాజేందర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగించాలని జితేందర్‌రెడ్డి పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగానే, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ సరైనదేనంటూ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పార్టీ వర్గాలలో రసవత్తర చర్చలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డితో ఈటల భేటీ ఆసక్తికరంగా మారింది. రెండ్రోజుల కిందట వరకూ అంత యాక్టివ్‌గా లేని ఈటల రాజేందర్ కీలక పదవి వస్తుండటంతో స్పీడ్ పెంచారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని కేంద్ర అధినాయకత్వం కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రకటన ఎప్పుడొస్తుందా అని తెలంగాణ బీజేపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మొత్తంగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న వేళ… బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పక్క చూపులు చూస్తున్న నేతలను కట్టడి చేయడం పార్టీ పెద్దలకు ఇప్పుడు ఓ సవాల్ గా మారింది. బండిని మారిస్తే బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుంది? చర్చనీయాంశంగా మారింది.