
ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు..వివాదం ముగిసినట్టేనా?
- Ap political StoryNewsPolitics
- May 19, 2023
- No Comment
- 30
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖమ్మంలో నెలకొల్పనున్న ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిర్వాహకులు గోల్డ్ కలర్ వేస్తున్నారు. కిరీటంలోని నెమలి పింఛం, విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ… ఇస్కాన్, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన హైకోర్టు … కృష్ణావతారంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దంటూ స్టే మంజూరు చేసింది. తుది తీర్పు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని పేర్కొంది.
కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈనేపథ్యంలో విగ్రహంలో మార్పులు చేపట్టారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా… భారీ విగ్రహం నెలకొల్పాలని అభిమానులను నిర్ణయించారు. దాంట్లో భాగంగానే రెండు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేయించారు. ఖమ్మంలోని లకారం చెరువులో…ఈనెల 28న, 54 అడుగుల పొడవైన విగ్రహాన్ని జూ.ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే తారక్ ను స్వయంగా కలిసి ఆహ్వానించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా పంపించారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.