తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా కొత్త సచివాలయ నిర్మాణం..

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా కొత్త సచివాలయ నిర్మాణం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కొత్త సెక్రటేరియేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఏప్రిల్ 30వ తేదీన వైభవంగా కొత్త సెక్రటేరియేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరగుతున్నాయి. ఇండో- పర్షియన్ శైలిలో 8 అంతస్థులతో.. రాజసౌధాన్ని తలపించేలా సెక్రటేరియట్ భవనం రూపుదిద్దుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఈ భవనానికి పెట్టారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవటమే కాకుండా.. భారతదేశంలోనే ఓ ఐకానిక్ బిల్డింగ్‌గా నిలుస్తున్న తెలంగాణ కొత్త సెక్రటేరియేట్ పై మెటా న్యూస్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించటమే కాకుండా.. వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 జూన్ 27వ తేదీన కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హుస్సేన్ సాగర్ తీరంలో పాత సెక్రటేరియేట్ స్థానంలోనే.. ఈ మెగా స్ట్రక్చర్‌ నిర్మాణాన్ని తలపెట్టారు. కేవలం నాలుగేళ్ళ స్వల్ప వ్యవధిలోనే అత్యాధునిక హంగులతో.. భారీ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇండో-పర్షియన్‌ నిర్మాణశైలిలో ఓ చారిత్రక కట్టడం తరహాలో దీనికి డిజైన్‌ చేశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీకి పనులు అప్పగించారు. డిజైన్లు పూర్తై, పనులు ప్రారంభమైన తర్వాత దాదాపు 26 నెలల్లోనే భవనం సిద్ధం కావడం విశేషం.

ఇక.. తెలంగాణ కొత్త సచివాలయ భవాన్ని గ్రీన్‌ కాన్సెప్ట్‌ విధానంలో నిర్మించారు. గాలి, వెలుతురు వచ్చే విధంగా డిజైన్‌ చేశారు. చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు. మొత్తం ఎనిమిది ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. సచివాలయ ప్రాంగణంలో రెండున్నర ఎకరాల్లో 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, బస్సులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. సందర్శకులకోసం మరో 300 కార్లు పట్టేలా ఒకటిన్నర ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. సచివాలయ ప్రధాన ద్వారాన్ని నాలుగు భారీ తలుపులతో 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. మొత్తం సచివాలయంలో 875 వరకు తలుపులు ఉండగా, ఇందులో దాదాపు 90 శాతం తలుపులు టేకు కలపతోనే తయారు చేశారు.

సచివాలయంపై నిర్మించిన డోమ్‌లు, రెండు డోమ్‌లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేయగా, సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు అత్యంత ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్‌పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతంనుంచి కూడా ఇవి కనిపిస్తున్నాయి. రెండు గుమ్మటాలపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాలైన మూడు సింహాలతో దేశభక్తి, ఆత్మగౌరవ పతాకలా సచివాలయం దర్శనమిస్తోంది. భవనంపై పడిన నీటిచుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా చేసి జలసంరక్షణ ప్రాధాన్యతకు సచివాలయాన్ని తీర్చిదిద్దారు.

మొత్తం 8 అంతస్థులతో నిర్మించిన సచివాలయంలోని ఆరో అంతస్థులో ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీల చాంబర్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీఎం సిబ్బంది, ఆయన ప్రజలను కలిసేందుకు ‘జనహిత’ పేరుతో 250 మంది కూర్చునేవిధంగా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, అధికారులకు సరిపడా క్యాబినెట్‌ సమావేశం కోసం మరో హాలు, సీఎంను కలిసేందుకు వచ్చేవారికోసం ప్రత్యేక వెయిటింగ్‌ హాలును నిర్మించారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణకు కూడా ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కనీసం 25 మంది విశిష్ట అతిథులతో ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసేందుకు ఓ అత్యాధునిక డైనింగ్‌ హాలును కూడా నిర్మించారు.

మొత్తం 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మితమైన తెలంగాణ కొత్త సచివాలయం తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌ను తలదన్నేలా కనిపిస్తోంది. ఇక రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. మొత్తం మీద 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ సచివాలయం రాజసౌధాన్ని తలపిస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణానికి అభ్యంతరం చెప్పిన వారితోనే… ఔరా అనిపించేలా చేస్తోంది… కేసీఆర్ ఇమేజ్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *