
“ది కేరళ స్టోరీ” సినిమాపై దుమారం..రిలీజ్ పై అనుమానం?
- MoviesNewsPolitics
- May 1, 2023
- No Comment
- 30
“ది కేరళ స్టోరీ” రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా విడుదలకు సంబంధించి కేరళలో గట్టి పోరాటమే జరుగుతోంది. సినిమా కథ రివీల్ అయినప్పటి నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. కొంతమంది కేరళ స్టోరీని సపోర్ట్ చేస్తుంటే…. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. సినిమాను నిషేధించాలని కేరళలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే దుష్ట పన్నాగంతోనే సంఘ్ పరివార్ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని కేరళ అధికార పార్టీ సీపీఎం పినరయి విజయన్ నిప్పులు చెరుగుతున్నారు.
కేరళలోని 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి, వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివిధ మతాలకు చెందిన నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, ఉగ్ర సంస్థల కోసం పని చేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. కేరళను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం విజయన్ సంఘ్ పరివార్ పై మండిపడ్డారు. ఏప్రిల్ 26న విడుదలైన ది కేరళ స్టోరీ ట్రైలర్ కాంట్రవర్శీని క్రియేట్ చేసింది. విడుదలైన ఐదు రోజుల్లోనే కోటిన్నరకు పైగా వ్యూస్ సాధించింది.
“ది కేరళ స్టోరీ” సినిమాలో అదా శర్మ, సిద్ది ఇద్నాని, సోనియా బలానీ, యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమాపై వస్తున్న విమర్శలకు ది కేరళ స్టోరీ హీరోయిన్ అదా శర్మ, డైరెక్టర్ సుదీప్తో సేన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు అమ్మాయిలు కనిపించకుండా పోవడమే చాలా బాధాకరమన్న ఆదాశర్మ… వారంతా ఏమయ్యారో అనే దాని గురించి ఆలోచించకుండా కనపడకుండా పోయింది అంతమంది కాదని ట్రైలర్ లో చూపించిన కౌంట్ గురించి మాట్లాడడం దారుణమన్నారు. బయటపడిన కొంతమంది బాధితుల వివరాలు సేకరించి, వాటి ఆధారంగానే సినిమాను తీశామని చెప్పారు.
ఈ సినిమా తీయడానికి దాదాపు ఏడేళ్లు కష్టపడినట్లు దర్శకుడు తెలిపారు. అమ్మాయిల మిస్సింగ్ కు సంబంధించి, RTI సమాధానం ఇవ్వలేదన్న డైరెక్టర్… రీసెర్చ్ చేసి, అంతా తెలుసుకున్నాకే సినిమా తీసినట్లు చెప్పారు. మరోవైపు, సినిమా విడుదలను నిషేధించాలంటూ అందిన ఫిర్యాదులపై…ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇదిలా ఉంటే… పలు రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అది మా స్టోరీ కాదంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇది మీ కేరళ కథ కావొచ్చు, మా కేరళ కథ మాత్రం కాదంటూ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నేత శశిథరూర్.ఇక, కేరళలో కొన్నేళ్లుగా 32వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి…కేరళ స్టేట్ కమిటీ ఆఫ్ ముస్లిం యూత్ లీగ్ సవాలు విసిరింది. ఈ సినిమాలో చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించిన వ్యక్తికి రూ.కోటి ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఆధారాల స్వీకరణ కోసం కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది.
ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలను కూడా ఈ సినిమా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హిందువుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి… ‘కశ్మీర్ ఫైల్స్’, ‘ ది కేరళ స్టోరీ’ వంటి సున్నితమైన కథాంశాలతో …ఇలాంటి సినిమాల నిర్మాణాన్ని బీజేపీ తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సినిమా మాధ్యమాన్ని కూడా బీజేపీ తన రాజకీయ లబ్ధికి ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నదని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
మొత్తంగా, సినిమా ప్రదర్శన నిలిపేయాలనే భావనలో రాజకీయ పార్టీలు ఉంటే…ముందుగా సినిమా చూడండి, నచ్చకపోతే అప్పుడు చర్చిద్దామంటూ దర్శకుడు అభ్యర్థిస్తున్నారు. దాంతో, సినిమా అసలు విడుదలవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.