
ఆదిపురుష్ తాజా పోస్టర్‌పై దుమ్మెత్తి పోస్తున్న సినీ అభిమానులు
- EntertainmentMoviesNews
- April 3, 2023
- No Comment
- 48
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో “ఆదిపురుష్” టీజర్ అరాచకం మళ్ళీ కొనసాగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్, కృతి సనన్ హీరో, హీరోయిన్లుగా… రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామాయణం ఇతివృత్తంగా భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్ సినిమా తీస్తున్నామని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కొంత కాలం క్రితం ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యాక.. దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇది రామయణమా..? లేక హాలీవుడ్‌లోని ” ప్లానెట్ ఏప్స్” ” ది కాంగ్” మూవీస్ లాంటిదా..? అంటూ నెటిజన్లు విమర్శలతో విరుచుకు పడ్డారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు వంటి పాత్రలు రూపొందించిన తీరుపై ఓం రౌత్ పై దుమ్మెత్తి పోశారు. మూవీలో వాడిన గ్రాఫిక్స్ “అమీర్ పేట్” స్థాయిని మించక పోగా.. పాత్రలన్నీ..”ఇవి రామాయణంలోనివా..?” “రామాయణం ఇలా ఉంటుందా..?” అని అనిపించేలా ఉన్నాయి. శ్రీ రాముడు.. పురాణ పురుషునిలా కాకుండా.. లెదర్ కాస్ట్యూమ్ లో విచిత్రంగా కనిపించాడు. రావణాసురుడు, హనుమంతుడు వంటి పాత్రలు అల్లా ఉద్దీన్ ఖిల్జీ, ఘజనీ మహ్మద్ లను తలపించాయి. ఇక పరమ సాధ్వి సీతా దేవిని చిత్రీకరించిన తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. సీతాదేవి పాత్రకు వాడిన కాస్ట్యూమ్స్.. క్యారెక్టరైజేషన్ అసభ్యంగానే ఉంది. అలాగే వానరసైన్యాన్ని సైతం ప్లానెట్ ఏప్స్ మూవీలోని చింపాంజీల మాదిరిగా చూపించటం.. దర్శకుడు ఓం రౌత్ పైత్యానికి పరాకాష్టగా సినీ ప్రేక్షకులు అభివర్ణిస్తున్నారు.
దర్శకుడు ఓం రౌత్ గతంలో విడుదల చేసిన టీజర్ పై భారీ స్థాయిలో విమర్శలు రాగా.. చిత్ర యూనిట్ దిద్దుబాటు చర్యలకు దిగుతామని ప్రకటించింది. సినిమా రిలీజ్ ను కూడా వాయిదా వేసుకుంది. అప్పటి నుంచి ఈ మూవీపై ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ మూవీపై తమ ఆశలు వదిలేసుకున్నారు. అయితే.. ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ తో పాటు, లక్ష్మణుడు, ఆంజనేయుడు క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ కూడా గ్రాఫిక్ పోస్టర్ లాగే ఉండటంతో మరోసారి ఆదిపురుష్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. అలాగే అందులో సీతకు మెడలో ఎలాంటి తాళి, ఆభరణాలు లేకపోవడం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం, లక్ష్మణుడి పాత్రకు ఫుల్ గడ్డం ఉండటం.. ఇలా అనేక వాటి మీద విమర్శలు చెలరేగుతున్నాయి. తెలుగులోనే కాక బాలీవుడ్ వాళ్ళు కూడా రామాయణం గురించి తెలుసా..? అంటూ ఓమ్ రౌత్ ని నిలదీస్తున్నారు. పురాణ పాత్రలకు ఇలాంటి వక్రీకరణలు చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే.. ఓం రౌత్ సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. మరికొంత మంది దీనిపై కోర్టులకు కూడా వెళతామని వార్నింగ్స్ ఇస్తున్నారు. తాము అమితంగా అభిమానించే రామాయణాన్ని.. రాముడు, సీతలను ఇలా అవమానిస్తారా..? అంటూ న్యాయ పోరాటానికి వారు సిద్ధమౌతున్నారు.
అదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండానే.. ఈ సినిమాను రూపొందించినట్టు అర్ధం అవుతోంది. వాస్తవానికి రామాయణం అనేది కోట్లాది మంది హిందువులకు పవిత్రమైన పురాణ కావ్యం… యుగ యుగాలుగా భారతీయ సంస్కృతికి రామాయణం ఆయువుపట్టుగా ఉంది. అలాంటి రామాయణం మీద భారతీయ భాషలన్నింటిలోనూ అనువాదాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్.. కోట్లాది మంది భారతీయులను కట్టిపడేసింది. అటువంటి రామాయణంపై సినిమా తీయాలని ఓం రౌత్ అనుకుంటే.. దానిని ఓ యజ్ణంలా భావించాలి. పాత్రల చిత్రీకరణను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. కోట్లాది మంది భారతీయుల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం కావటంతో దానిని సెన్సిటివ్‌గా డీల్ చేయాలి. అంతే గానీ ఇష్టం వచ్చినట్టు తీసేసి.. ఇదే రామాయణం అంటే.. కుదరదని కోట్లాది మంది రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో కమర్షియల్ మాస్ మసాలా మూవీని తీసేసినట్టుగా.. ఆది పురుష్‌ను కూడా జనం మీదకు వదులుతామంటే.. తాట తీసి చేతిలో పెడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక.. రామాయణానికి పూర్తి వక్రీకరణగా రూపొందిన ఆదిపురుష్‌ను జూన్ 16న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లలో విడుదలపైనా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆదిపురుష్ మూవీ.. కేవలం ఓటీటీకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.