
TSPSCపేపర్ లీకేజీపై రాజకీయ దుమారం
- NewsPoliticsTelangana Politics
- March 30, 2023
- No Comment
- 34
TSPSC పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లీకేజీపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ను నియమించి విచారణ చేపట్టింది. బాధ్యులైన వారందర్నీ ఒక్కొక్కరిగా అరెస్టు చేసి జైలుకు పంపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను సైతం రద్దు చేసింది. అయితే.. ఈ లీకేజీకి బాధ్యులు.. మీరంటే.. మీరంటూ రాజకీయ పక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయటానికి బీజేపీ వంటి పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిందితులంతా బీజేపీ క్రియాశీలక కార్యకర్తలే అని ఆయన ఎదురు దాడి చేస్తున్నారు. TSPSC పేపర్ లీక్ పాపం అంతా భారతీయ జనతా పార్టీదే అని కేసీఆర్ విమర్శిస్తున్నారు. మరోవైపు.. పేపర్ల లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటూ ఇటు బీజేపీ… అటు కాంగ్రెస్ పార్టీలు సైతం ఎదురుదాడి చేస్తున్నాయి. దీంతో.. ఈ మొత్తం వ్యవహారం మరింత ముదురుతోంది. ఇక.. ఇళ్లు, ఊళ్ళు వదిలేసి కన్నవారికి దూరంగా కష్టపడుతున్న నిరుద్యోగులు మాత్రం పేపర్ లీకేజీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… TSPSC పేపర్ లీకేజ్ కేసులోని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. వీరిలో ముగ్గురు TSPSC ఉద్యోగులతో పాటు మరో 9 మంది ఇతరులు ఉన్నారు. ఓ హోటల్లోని సీసీటీవి కెమెరాలో పేపర్ మార్పిడి వ్యవహారం రికార్డయినట్టుగా సిట్ గుర్తించింది. పేపర్ లీక్ వ్యవహారంలో కీలక సూత్రదారి ఉద్యోగి రాజశేఖరే అని సిట్ తేల్చింది.. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించాడని సిట్ చెబుతోంది. మరోవైపు.. కమీషన్‌లో పనిచేసే ఉద్యోగులు.. గ్రూప్ వన్ పరీక్షలు రాయటంపైనా అనేక ఆంక్షలు ఉన్నాయి. కానీ.. ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు.. వారి సన్నిహితులు పరీక్ష రాసి 100కు పైగా మార్కులు పొందారని తెలుస్తోంది. దీనిపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. దర్యాప్తు కొనసాగుతుండటంతో.. మరింత మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం మీద.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా… రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని TSPSC భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇకపై ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామంటోంది. ఏది ఏమైనా TSPSC లీకేజీ వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ ని డామేజ్ చేసిందనే చెప్పాలి. ఈ వ్యవహారంలో ఎంతమందికి శిక్ష పడుతుందో తెలీదు గానీ.. నిరుద్యోగులు మాత్రం చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు.