ఓటీటీ – అశ్లీలత

ఓటీటీ – అశ్లీలత

ఓటీటీల్లో వస్తున్న కథనాల్లో.. శృంగారం, అసభ్యపదజాలం, అశ్లీలత, హింస, అక్రమసంబంధాలు వంటి వాటికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. దీంతో వీటికి కళ్లెం వేయాలని.. కోరుతున్నా. పట్టించుకునే నాథుడే లేడు. పలు ఓటీటీ యాప్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌లకు అలవాటు పడ్డ టీనేజీ, యువత భాష క్రమంగా మారుతోంది. విదేశీ సిరీస్‌లు అయితే మరీ దారుణం. మనుషులను చంపడం, హింసించడమే నేపథ్యంగా తెరకెక్కిన సైకోథ్రిల్లర్‌ సినిమాలకు ఓటీటీల్లో కొదవలేదు. ఇవి టీనేజీ యువత మానసిక ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలను వేధించడం, డేటింగ్, సహజీవనం, ర్యాగింగ్‌ వంటి విదేశీ సంప్రదాయాలను ప్రోత్సహిస్తాయని వాపోతున్నారు. ఇందులో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న తెలుగు సిరీస్‌ లు సైతం అశ్లీలత, బూతులు దట్టించి జనాలపైకి దూసుకువస్తున్నాయి.

అప్ కమింగ్ హీరోలు, నటులకు ఇప్పుడు కొత్త వేదిక గా ఓటీటీ మారుతోంది. తక్కువ ఖర్చుతో.. చాలామంది సెలబ్రిటీలు ఈ వేదిక ద్వారా తమ మూవీలను, వెబ్‌ సిరీస్‌లను విడుదల చేస్తున్నారు. స్ట్రైట్ గా విడుదలైన సినిమాలు ఓటీటీలో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేస్తున్నారు. సినిమా బిజినెస్‌ పరంగా కూడా ఓటీటీ సంచలనాలకు కేంద్రంగా మారింది. ఓటీటీ వేదికలు ఎక్కువ కావడం వల్ల.. కాంపిటీషన్ కూడా చాలా విపరీతంగా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఓటీటీలోనే .. న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. ప్రేక్షుకులు మెచ్చిన..ఈ సిరీస్ లో సమంత శ్రీలంక LTTE తీవ్రవాది పాత్రలో అలరించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వెబ్ సిరీస్‌ వల్లే సమంత .. నాగ చైతన్యకు మధ్య మనస్పర్థలు వచ్చిన విడాకులు కూడా తీసుకున్నారని టాక్ నడిచింది. అంతగా పర్సనల్ లైఫ్ లను వెబ్ సిరీస్ లు ప్రభావితం చేశాయి. ఆ సమయంలో.. నటి సమంతపై నెటిజన్ల నుంచి వచ్చిన కామెంట్స్ .. ఆమె జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది.

2023, మార్చి 10న రానానాయుడు.. వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విడుదలకు ముందే వెంకటేశ్ , రానా కాంబో అనేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సిరీస్ లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా రూ.12 కోట్లు, దగ్గుబాటి రానా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. వెంకటేశ్‌ అనగానే ఫ్యామిలీ హీరో ముద్ర ఉంది. ఫ్యామిలీ హీరోగానే కాకుండా అనేక కొత్త ప్రయోగాలు చేశారు. ప్రేమ, గణేశ్‌, ధర్మచక్రం లాంటి మూవీల్లో.. వెంకటేష్ తన నట విశ్వరూపం చూపారు. ఎఫ్‌-2 వంటి మూవీలతో తన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. దగ్గుబాటి రానా కూడా అంతే. మొదటి సినిమా లీడర్‌ మొదలు బాహుబలి, ఘాజీ, భీమ్లానాయక్‌, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. అందుకే రానా.. వెంకటేష్ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో.. ఆసక్తి ఏర్పడింది. కంటెంట్ అదిరిపోతుందనుకుని.. చూస్తే.. ఫ్యామిలీ ప్రేక్షకుల్లో .. మొత్తం ఇమేజ్ .. డ్యామేజ్ అయిపోయింది.

రానానాయుడు వెబ్ సరీస్ పై వచ్చిన వివాదాలు అన్నీ.. ఇన్నీ కావు.. విక్టరీ వెంకటేష్‌, రానాలు ఒక బోల్డ్, ఒక అడల్ట్‌ వెబ్‌సిరీస్ ఎలా ఒప్పుకున్నారు? ఎందుకు నటించారనే విమర్శలు వెల్లువలా వచ్చాయి. మొత్తం పది ఎపిసోడ్లు ఉన్న.. ఈ వెబ్‌ సిరీస్‌లో కథకు కనెక్ట్‌ అయ్యేవి కేవలం ఐదారు మాత్రమే. సినీ పరిశ్రమలో కొంతమంది డబ్బున్న వ్యక్తుల కుటుంబ వ్యవహారాలన్నీ ఎలా నడుస్తాయి? తాము ఇష్టపడే వారితో ఎలా తిరుగుతారని తెలుసుకోవడానికి స్పై ఎలా ఉపయోగిస్తారు? ఒక గుట్టు మరొకరు రాబట్టడానికి రానానాయుడు లాంటి వారు ఎలా పని చేస్తారు? వాళ్లకు డబ్బులు ఎలా అందుతాయనే విషయాలు దర్శకులు ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేసేలా తీశారు. కానీ.. లాజిక్ లేని శృంగార సన్నివేశాలపై వివాదాస్పదం అయింది. వెంకటేష్ పరువు మొత్తం పోయిందని సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ప్రతీ ఎపిసోడ్‌లోనూ శృంగార సన్నివేశం.. పాత్రల మధ్య అక్రమ సంబంధాలు, వ్యవహారిక భాషలోనూ వాడలేని బూతులు అందులో జొప్పించారు. ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే శృంగార సన్నివేశాలు, బూతులు వింటే ఫ్యామీలి అంతా కలిసి చూసేలా అస్సలు లేదు. రానా నాయుడు.. తండ్రి నాగానాయుడు పాత్ర చేసిన వెంకటేష్ ను ఎప్పుడూ ఎందుకు ద్వేషిస్తాడన్నది తొమ్మిదో ఎపీసోడ్‌ వరకు తెలియదు. తండ్రికొడుకుల మధ్య బలమైన సంఘర్షణ ఎక్కడా లేదు. కానీ దర్శకులు శృంగార సన్నివేశాలు, బూతులను ఎక్కువగా చొప్పించారు. ఫ్యామిలీతో కలిసి ఈ వెబ్‌ సిరీస్‌ చూడలేమని మొదటి ఎపిసోడ్‌తోనే తేలిపోతుంది. ఈ సిరీస్‌లో వెంకటేష్‌, రానాలు తమ పాత్రలకు న్యాయం చేసినా.. వెంకటేశ్‌ను అయితే మన వెంకి మామేనా ఇది చేసింది? అనేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. చిన్నపిల్లలు కనుక ఈ సిరీస్ చూస్తే పెను ప్రభావమే పడే అవకాశం ఉంది. అందుకే ఈ వెబ్‌సిరీస్‌ విడుదల తర్వాత రామానాయుడు పేరు చెడగొట్టారనే విమర్శలు వచ్చాయి. దీనికి రానా క్షమాపణలు కోరినా..ఈ వెబ్‌ సిరీస్‌ చూసిన వాళ్లకు వెంకటేశ్‌ ఇలా కూడా చేస్తాడా? అనుకునేలా ఈ సిరీస్ ఉన్నదంటే అతిశయోక్తికాదు.

లక్షల సంఖ్యలో అభిమానులతో పాటు.. మహిళా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న విక్టరీ వెంకటేష్ .. ఇలాంటి పాత్రను ఎలా చేశారంటూ.. తమ కామెంట్లలో నిలదీశారు. రానానాయుడు వెబ్ సిరీస్ పై .. పలు ఛానల్స్ లో డిబేట్లు కూడా నడిచాయి. కావాల్సినంత క్రేజ్, డబ్బు ఉన్నా కూడా.. ఇలాంటి సిరీస్ లు చేయడం పట్ల.. వెంకటేష్ ను విపరీతంగా ట్రోల్ చేశారు. నెటిజన్ల నుంచి వచ్చిన రియాక్షన్ చూసి.. వెంకటేష్ స్పందించారు. కష్టపడి పనిచేశామంటూనే.. డార్క్‌ ఫ్యామిలీ డ్రామాలో.. చాలా ఎమోషన్స్‌, హింస, సెక్స్‌ కూడా ఉంటుందని.. మొత్తం మీద ఇది రానా షో అని చెప్పారు. ఆ తర్వాత… అక్కడక్కడా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించాలని వెంకటేష్ మాట్లాడటం చూస్తే… ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో మనకు అర్థమవుతోంది.

Related post

సల్మాన్ ఖాన్ మూవీలో… బతుకమ్మ పాట

సల్మాన్ ఖాన్ మూవీలో… బతుకమ్మ పాట

తెలంగాణ యాస, సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ.. బాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ .. తెలంగాణ బతుకమ్మ పాటకు చోటు దక్కింది. ఉత్తరాది ప్రేక్షకులకు..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *