
షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి?
- NewsPoliticsTelangana Politics
- June 19, 2023
- No Comment
- 23
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ షర్మిల చేసిన ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండు పర్యాయాలు షర్మిల భేటీ కావడం, రాహుల్ కు విషెస్ చెప్పడం చూస్తుంటే.. ఆమె హస్తం గూటికి చేరడం పక్కా అని తెలుస్తోంది. ఇందుకు డీకేతో పాటు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వం వహించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, షర్మిల భర్త అనిల్ సహా ఆమె సన్నిహితులతో మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే షర్మిల, రేవంత్ వర్గం మధ్య వార్ నడుస్తోంది. షర్మిల నాయకత్వాన్ని తాము ఒప్పకోబోమని, ఆమెను ఏపీకి పరిమితం చేస్తే సపోర్ట్ చేస్తామని రేవంత్ రెడ్డి ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు వైఎస్సార్టీపీ నేతలు రేవంత్ కు అంత ఉలుకెందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రెండు వర్గాలు నడుస్తున్నాయి. వలస నేతలు వర్సెస్ కాంగ్రెస్ వాదుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ అభిమానులైన భట్టి పాదయాత్ర చేస్తుండగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పొంగులేటి, జూపల్లి లాంటి వైఎస్సార్ అభిమానులను కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారు. దాంతో, రేవంత్ శిబిరంలో కొంత ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.
షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే, రేవంత్ పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. రేవంత్ కు చెక్ పెట్టేందుకే ఆయన వ్యతిరేక వర్గం షర్మిలను కాంగ్రెస్ గూటికి చేరుస్తుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ సీనియర్లు గట్టిగా చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై షర్మిల గట్టిగా పోరాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో రేవంత్ దూరమైతే పార్టీకి మరింత నష్టం తప్పదనే వారు ఉన్నారు. ఈ సమస్యను కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.