
ఆ అవార్డుకు అర్హత ఏంటి?
- MoviesNews
- January 24, 2023
- No Comment
- 81
ప్రతి సినిమా కళాకారుడు అపురూపంగా భావించే సత్కారం… ఆస్కార్ అవార్డ్.. ఈ పురస్కారం అందుకోకపోయినా.. కనీసం నామినేషన్ దాకా వెళ్తే బాగుంటుందని భావిస్తుంటారు. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని ప్రతిభ కనబర్చిన నటులు, సాంకేతిక నిపుణులు అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆస్కార్ అవార్డుకోసం సినిమాలు వెళ్తున్నాయేగానీ, నామినేషన్ ప్రక్రియదాకా వెళ్తున్నాయి. ఆ తర్వాత అర్హత సాధించక లేకపోతున్నాయి. ఈ సారి మాత్రం భారత దేశంనుంచి 10 సినిమాలు ఆస్కార్ రేసులో ఉన్నాయి.
ఇంతకీ అస్కార్ అవార్డు ఎందుకిస్తారు? ఎలా ఇస్తారు? ఈ అవార్డు అందుకోడానికి ప్రాథమిక అర్హత ఏంటి? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఏదైనా సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవాలంటే.. అమెరికాలో గుర్తింపు పొందిన ఆరు ప్రధాన నగరాల్లోని ఏదో ఒక సిటీలో కమర్షియల్ థియేటర్‌లో రిలీజ్ అవ్వాలి. అంతేకాదు.. కనీసం వారం రోజుల పాటు అక్కడ సినిమా ఆడాలి. రోజుకు కనీసంగా మూడు ఆటల చొప్పున సాయంత్రం షో తప్పకుండా ఉండాలి. ఆస్కార్ అప్లికేషన్ ఫామ్‌లో సినిమా ప్రదర్శించబడినట్లు ధృవీకరణ పత్రం జతచేయాలి.
భారతదేశ చలన చిత్రాల్లోంచి పది సినిమాలు ఆస్కార్ అవార్డుకోసం ప్రయత్నించాయి. అందులో మన దేశం నుంచి అధికారికంగా ‘ది ఛల్లో షో’ను పంపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కశ్మీరీ ఫైల్స్’, ‘కాంతార’, ‘విక్రాంత్ రోణ’, ‘గంగూభాయి కతియావాడి’, ‘మి వసంతరావ్’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘రాకెట్రీ’, ‘ఇరవిన్ నిళల్’ చిత్రాలు ఓపెన్ కేటగిరిలో నిలిచాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది.
ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు గాను RRR సినిమా షార్ట్ లిస్టు అయ్యింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఛెల్లో సినిమా షార్ట్ లిస్టు అయింది. షార్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో… ఆల్ దట్ బ్రీత్ సినిమాను షార్ట్ లిస్టు చేశారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎలిఫెంట్ విస్ఫర్స్ నామినేట్ అయింది.
జనవరి 24న అన్ని కేటగిరీలకు సంబంధించి 5 సినిమాలను అకాడమీ షార్ట్ లిస్టు విడుదల చేయనుంది. ఇక ఒకసారి ఫైనల్ నామినేషన్స్ పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్కార్ అకాడమీ మెంబర్స్ ఓటింగ్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అకడామీలో దాదాపు 10 వేల మంది సభ్యులున్నారు. వీరిలో చాలామంది అమెరికాకు చెందినవారే… అయితే ఇందులో ఇండియాకు చెందిన 40మంది ఉన్నారు. అకాడమీకి చెందిన 10వేల మంది సభ్యులు దాదాపు 16 క్రాఫ్ట్‌లకు చెందిన వారై ఉంటారు.
ఇప్పటికే నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో… RRR సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అమెరికాలో సైతం చాలామంది RRR సినిమాను ప్రశంసించారు. సినిమా దేవుడిగా పిలిచే స్టీఫెన్ స్పీల్‌బర్గ్ సైతం తనకు నాటు నాటు పాట బాగా నచ్చిందని చెప్పారు. అందుకే ఈసారి RRR సినిమాకు ఆస్కార్ పక్కా అనే చర్చ జరుగుతోంది.
రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినట్లు హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. మరో కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ’ కూడా ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చెబుతూ ఆ చిత్ర బృందం కూడా ట్వీట్ చేసింది. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో మన దేశ చిత్రాలు సత్తా చాటాలని నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.