
అప్పన్న ఆలయంలో అపచారం..భక్తుల ఆగ్రహం
- Ap political StoryNews
- April 26, 2023
- No Comment
- 28
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో చోటు చేసుకున్న మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వామి వారి నిజరూపాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న అంతరాలయం… వీడియోలు, ఫోటోలు తీయడం నిషిద్దం. అయితే చందనోత్సవం సందర్భంగా కొందరు వ్యక్తులు అప్పన్న అంతరాలయం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం దుమారానికి దారితీసింది. చందనోత్సవంలో భక్తులకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనే విమర్ళలు సర్థుమణగక ముందే, మరో అరాచకం వెలుగు చూడటం భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అసలు సింహాచలం ఆలయంలో ఏం జరుగుతోంది?
ఏపీలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో సింహాచలం దేవస్థానం ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. సింహాచలంలో ఏడాదికి ఒక రోజు జరిగే చందనోత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. చందనోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తరిస్తుంటారు. అయితే ఈ ఏడాది భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో పెద్ద దేవాలయాల్లో ఒకటైన సింహాచలం దేవాలయానికి శాశ్వత ఈవోను కూడా నియమించకుండా ప్రభుత్వం అశ్రద్ధ వహించింది.
తాత్కాలికంగా పని చేస్తోన్న అధికారులు భక్తులకు సకాలంలో స్వామివారి దర్శనం చేయించడంలో విఫలమయ్యారు. ఎప్పుడూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కూడా ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర ఆరోపణలు చేశారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఘటన భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అప్పన్న నిజరూపదర్శనాన్ని వీడియోలు, ఫోటోలు తీసి నెట్టింట్లో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. దేవాలయంలోకి కెమెరాలు, సెల్ ఫోన్లు అనుమతించరు. అంటే సామాన్యులు ఈ వీడియో తీసి ఉండరని అర్థం అవుతోంది. దర్శనానికి వచ్చిన మంత్రుల అంగరక్షకులే ఈ పనిచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిస్థిస్తే ఈ అరాచకానికి పాల్పడింది ఎవరో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన దాఖలాలు కనిపించడం లేదు.
సింహాచలం ఆలయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. అయితే, ప్రభుత్వ ఘోర వైఫల్యం, తప్పిదాలపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలను వైసీపీ వ్యాపార కేంద్రాలుగా మార్చిందని, ప్రముఖ ఆలయాల్లో తిష్టవేసిన వైసీపీ నాయకుల వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏపీలో హిందూ దేవాలయాల పట్ల వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అనేక సందర్బాల్లో ఈ విషయం వెల్లడైంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 153 దేవాలయాలపై దాడులు జరగడం, అంతర్వేదిలో రథం తగలబడిపోవడం, బెజవాడ దుర్గమ్మ దేవాలయంలో ప్రచార రథంపై వెండి సింహాలు మాయం కావడం, రామతీర్థంలో రాములోరి శిరస్సు ఖండించడం వంటి ఘటనలను జనం గుర్తు చేసుకుంటున్నారు. హిందూ దేవాలయాల రక్షణపై సీఎం జగన్ రెడ్డికి శ్రద్ధ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.