
పవన్ కళ్యాణ్ హెచ్చరికలకు కారణం ఏంటి..?
- Ap political StoryNewsPolitics
- April 25, 2023
- No Comment
- 38
జనసేనపై కుట్ర జరుగుతోంది. ఈ విషయాన్నిఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. పార్టీని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు అసత్య ప్రచారం చేస్తున్నాయని, దీనిపట్ల నాయకులు, జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా స్పందించాలని పవన్ విజ్ఙప్తి వెనుక పెద్ద కథే నడిచింది. గత కొంత కాలంగా జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెట్టి, ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు లేకుండా విధ్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి విష ప్రచారాలపై పార్టీ నేతలు ఆచితూచి స్పందించాలని జనసేనాని ఎందుకు సూచించారు అసలు జనసేనపై విషం చిమ్ముతోంది ఎవరు పొత్తుల పేరు చెబితేనే వణికిపోతోంది.
జనసేన నాయకులను, వీర మహిళలను, కార్యకర్తలను కొన్ని శక్తులు కావాలనే రెచ్చగొడుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. కొంత కాలంగా సోషల్ మీడియాలో జనసేన అధినేతను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంతోపాటు, జనసేన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేస్తున్న దుష్ప్రచారంపై జనసేనాని స్పందించారు. ఏపీ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం విషం చిమ్ముతున్నాయని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. సహజంగా ఇలాంటి విషయాలు పార్టీ నేతలు, క్రియాశీల కార్యకర్తల సమావేశాల్లో ప్రకటిస్తూ ఉంటారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యవసరంగా లేఖ విడుదల చేయడానికి కారణం లేకపోలేదు. టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెంచే కుట్ర జరుగుతోందని జనసేనానికి స్పష్టమైన సమాచారం అందడమే లేఖ రాయడానికి దారితీసింది తెలుస్తోంది.
ఇటీవల టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మూడు పెళ్లిళ్ల పేరుతో విమర్శించాడని పేటీఎం బ్యాచ్ ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది. మాజీ మంత్రి పేర్ని నాని, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను దేవినేని ఉమకు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆ తరవాత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం చేశారు. తప్పుడు విమర్శలను సోషల్ మీడియాలో వైరల్ చేసి, టీడీపీ, జనసేన నాయకుల మధ్య చిచ్చుపెట్టే కుట్రకు అధికార వైసీపీ పెద్దలు తెరతీశారని తెలుస్తోంది. అసలు విషయం తెలియక చాలా మంది జనసైనికులు సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అవి ఫేక్ అని తెలియడంతో నాలుక కరుచుకున్నారు. కొన్ని రాజకీయ పక్షాలకు, జనసేన పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే విధంగా కుట్రలకు పాల్పడుతున్నారనే, స్పష్టమైన సమాచారంతోనే పవన్ కళ్యాణ్ అత్యవసరంగా స్పందించాల్సి వచ్చిందని తెలుస్తోంది.
టీడీపీ, జనసేన పొత్తును ఎలాగైనా దెబ్బతీయాలని, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే అది అక్రమ సంబంధంతో పోల్చి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి అరాచక శక్తుల పట్ల జనసైనికులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రకటించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నాయకులపై తీవ్రమైన ప్రతి విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని కూడా పవన్ సూచించారు. ఎవరో ఏదో వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చూసి స్పందించవద్దని పవన్ కళ్యాణ్ విజ్ఙప్తి వెనుక బలమైన కారణం ఉంది. టీడీపీ నేతల పేరుతో పేటీఎం బ్యాచ్ చేస్తున్న వికృత క్రీడకు జనసేన నాయకులు, కార్యకర్తలు బలికావద్దని పవన్ సందేశం ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా, ఐ ప్యాక్ టీం చేస్తున్న అసత్య ప్రచారాల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని జనసేనాని సూచించారు.
రెచ్చగొడితే పొరపాటున కూడా రెచ్చిపోవద్దు… ఇది జనసేనాని ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇచ్చిన సలహా. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి…. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం తీసుకుంటానని అప్పటి వరకు పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని సూచించారు. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాల్లో చిన్న చితక నాయకులు, ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైనవిగా భావించాలని పార్టీ శ్రేణులకు విజ్ఙప్తి చేశారు. టీడీపీ నాయకులు ఎవరూ జనసేనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.కానీ వైసీపీ నడుపుతోన్న పేటీఎం బ్యాచ్ టీడీపీ నేతలు జనసేన అధినేతపై తీవ్ర విమర్శలు చేసినట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైసీపీ పేరు ఎక్కడా నేరుగా ప్రస్తావించకపోయినా, ఇలాంటి అసత్య ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని జనసేనాని లేఖ ద్వారా పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీశ్రేణులకు లేఖ రాయడం వెనుక పెద్ద కథే నడిచింది. ఇటీవల కాలంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే తమకు భవిష్యత్తు ఉండదని గ్రహించిన అధికార వైసీపీ నేతలే ఇలాంటి దురాగతాలకు దిగుతున్నారని తెలుస్తోంది. ఎలాగైనా టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలవాలనే వైసీపీ పెద్దల ప్రయత్నాలు ఫలించవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.