
కోడికత్తి కేసులో అసలు “కుట్ర” ఎవరిది..?
- Ap political StoryNewsPolitics
- April 18, 2023
- No Comment
- 43
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో.. బయటి వ్యక్తుల “కుట్ర” లేదని NIA తేల్చేసినా.. వైసీపీ నేతలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు..? ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందంటూ ఎందుకు పాతపాటే పాడుతున్నారు..? NIA మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ పిటీషన్ల మీద పిటీషన్లు ఎందుకు వేస్తున్నారు..? సాక్షిగా ఉన్న జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పకుండా.. వైసీపీ నేతల చేత ఎందుకు మీడియాలో అల్లరి చేయిస్తున్నారు..? దర్యాప్తును సాగదీయటం ద్వారా తమ కుట్రలు బయట పడకుండా చేసే వ్యూహమా..? లేక ఏదో ఒక విధంగా రాజకీయ ప్రత్యర్ధులపై బురద జల్లే ప్రయత్నమా..?
2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి ఘటన జరిగింది. కోనసీమ ప్రాంతానికి చెందిన జనుపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను ఈ దాడికి పాల్పడగా.. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి విజ్ణప్తి మేరకు కేసు NIAకు బదిలీ అయ్యింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సానుభూతి ఓట్లను కురిపించింది. దీనిని ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి గరిష్టంగా రాజకీయ ప్రయోజనం పొందారు. ప్రతిపక్ష తెలుగుదేశం పై బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు. అయితే.. ఈ కేసుపై సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టిన “నేషనల్ ఇంటిలిజన్స్ ఏజన్సీ” జగన్ రెడ్డిపై కోడికత్తి దాడి వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చేసింది. దాడికి పాల్పడ్డ జనుపల్లి శ్రీను సైతం వైసీపీ సానుభూతిపరుడేనని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీకి ఈ కేసుతో అస్సలు సంబంధమే లేదని క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. NIA ఇచ్చిన దర్యాప్తు నివేదికను వైసీపీ అధినేత జగన్ రెడ్డి తప్పు పట్టటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. NIA విచారణ కూడా సరిగ్గా చేయలేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన జగన్ రెడ్డి.. ఈ కేసులో బయటి వ్యక్తుల కుట్ర దాగి ఉందంటూ ఇంకా పాతపాటే పాడుతున్నారు. వైసీపీ నేతలు సైతం అదే పల్లవి అందుకుంటున్నారు. అయితే దీని వెనుక కూడా జగన్ రెడ్డి వ్యూహం దాగి ఉందనే టాక్ వినిపిస్తోంది. కుట్ర ఉందంటూ వీలైనంత వరకు జాప్యం చేయటం.. కేసు విచారణను సాగదీయటమే లక్ష్యంగా జగన్ ఈ మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎందుకంటే.. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న జగన్ ఒక్కసారి కూడా కోర్టు వాయిదాకు హాజరు కాలేదు. తన వాంగ్మూలాన్ని నమోదు చేయించలేదు. కానీ.. పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తూ న్యాయ విచారణ జాప్యం కావటానికి కారణం అవుతున్నారు. అదే సమయంలో కుట్ర కోణం ఉందంటూ.. ప్రజల్లో ఓ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
అయితే… ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లోకి బలమైన సంకేతాలు వెళ్ళి పోయాయి. కోడికత్తి కేసు వైసీపీ డ్రామా అనే భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది. ఇదంతా జగన్ మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనేటాక్ వినిపిస్తోంది. మరోవైపు NIA సైతం బయటి వ్యక్తుల కుట్రలేదని తేల్చేయగా.. సీఎం జగన్, వైసీపీ నేతలు మాత్రం కుట్ర.. కుట్ర అంటూ గొంతు చించుకుంటున్నారు. జాతీయ స్థాయిలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరొందిన NIA విచారణను సైతం తప్పు పడుతున్నారు. అయితే.. కోర్టులు ఇలాంటి వితండవాదాల్ని పరిగణనలోకి తీసుకోవని.. కేసు ట్రయల్ జరిగితే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయని న్యాయ నిపుణులు అంటున్నారు. అప్పుడైనా జగన్ రెడ్డి చేస్తున్న వితండవాదం తప్పు అని రుజువు అవుతుందని అభిప్రాయ పడుతున్నారు.