
ముసలోడనే సాకుతో సాయిరెడ్డిని గెంటేసిన జగన్.!
- Ap political StoryNewsPolitics
- June 23, 2023
- No Comment
- 21
వైసీపీలో విజయసాయిరెడ్డికి ఇక డోర్స్ క్లోజ్ అయిపోయినట్టేనా? పార్టీలో, పాలనలో ఇక ఆయన పాత్ర లేనట్టేనా? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. సీఎం జగన్… విజయసాయిరెడ్డిని పక్కన బెట్టారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా అది నిజమేనని తేలింది. అంతా అనుకున్నట్టే జరిగింది. సాయన్న ముసలోడు అయిపోయాడు . అన్ని పనులు చేయలేడు. అందుకే, అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించాల్సి వచ్చిందని… గడప గడపకూ ప్రభుత్వం మీటింగ్‌లో సీఎం స్వయంగా చెప్పుకొచ్చారు. జగన్ ఆ మాట అనగానే సాయిరెడ్డితో పాటు అక్కడున్న ప్రజాప్రతినిథులందరూ ఖంగుతిన్నారట. సాయిరెడ్డి కన్నా పెద్దవాళ్లు అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి లాంటి నేతలను పక్కన కూర్చోబెట్టుకొని…సాయిరెడ్డిని ముసలోడిగా ముద్రవేయడమంటే పొమ్మనలేక పొగబెట్టడమేనని పార్టీ నేతలంతా గుసగుసలాడుకుంటున్నారు.
కొంతకాలంగా పాలనాపరంగా, పార్టీ నిర్ణయాల్లో విజయాసాయిరెడ్డి జోక్యాన్ని తగ్గించిన జగన్…ఆయనకు అప్పగించిన బాధ్యతల్ని మెల్లగా తప్పిస్తూ వచ్చారు. తాజాగా డోర్ డోర్ మీటింగ్ లో సాయిరెడ్డిని పక్కనబెడుతున్నట్టు జగన్ చెప్పకనే చెప్పేశారు. ఇక, ఏమున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిలోనే వేయాలని జగన్ చెప్పేయడం ద్వారా… సాయిరెడ్డితో ఎవరూ ఏమీ చెప్పాల్సిన పనిలేదన్నట్టుగా పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారట. వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడిన సాయిరెడ్డిని, జగన్ కనీసం కార్యకర్తగా కూడ గుర్తించడం లేదు. దీనికి ఆయన షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారనే కారణం ఒకటైతే, తారకరత్న చనిపోయిన సందర్భంలో చంద్రబాబుతో సాయిరెడ్డి సన్నిహితంగా మెలగడం ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఉత్తరాంధ్ర సమన్వయకర్త, సోషల్ మీడియా ఇంచార్జ్, అనుబంధ విభాగాల సమన్వయకర్త.. ఇలా విజయసాయిరెడ్డికి ఏ ఒక్క పదవీ లేకుండా జగన్ తొలగించేశారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు టీటీడీ చైర్మన్, తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి…సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్ రెడ్డికి…అనుబంధ సంఘాలు చెవిరెడ్డికి కట్టబెట్టింది అధిష్టానం. విజయసాయిరెడ్డి కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే . ఆ పదవి కాలం కూడా పూర్తయితే జగన్ ఆయన్ను నేరుగా ఇంటికి పంపిస్తారేమోనని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.
అక్రమాస్తుల కేసుల్లోనూ, జైలు జీవితం గడిపన సందర్భంలోనూ… ప్రతీ విషయంలోనూ తన బాస్ జగన్ కు సాయిరెడ్డి తోడునీడగా ఉన్నారు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డారు. కానీ, ఏం లాభం. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో. గతంలో చంద్రబాబును సాయిరెడ్డి ముసలాయన అంటూ తీవ్రంగా దూషించేవారు. ఇప్పుడు ఏకంగా తన బాసే తనను ముసలోడని గెంటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారట విజయసాయిరెడ్డి. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక సాయిరెడ్డి రాజకీయాలనే మానేస్తారో? లేక పార్టీకి గుడ్ బై చెబుతారో? చూడాలి.