
రజనీకాంత్‌ను వైసీపీ తిడుతున్నా.. మోహన్ బాబు మౌనంగా ఎందుకున్నారు..?
- Ap political StoryNewsPolitics
- May 2, 2023
- No Comment
- 27
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశంసించారనే ఏకైక కారణంతో.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను వైసీపీ నేతలు నోరు పారేసుకుంటున్నారు. మంత్రులు రోజా, అంబటి , గుడివాడ అమర్నాథ్ వంటి వారు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే.. నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అయితే.. లెజండ్ హీరో అయిన రజనీ కాంత్‌ను ఈ విధంగా తిట్టటాన్ని తెలుగు జాతి మొత్తం ఖండిస్తోంది.
రజనీ అభిమానులతో పాటు.. రాజకీయాలకు అతీతంగా అనేక మంది వైసీపీ నేతల తిట్లపురాణంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రజనీకాంత్‌కు ఆప్తమిత్రుడినంటూ చెప్పుకునే మంచు మోహన్ బాబు మాత్రం ఇప్పటి వరకు నోరెత్తలేదు. వైసీపీ నేతల తిట్ల పురాణాన్ని ఖండించలేదు. రజనీకాంత్ ఎలాంటి తప్పు చేయకపోయినా.. వైసీపీ నేతలు బండ బూతులు తిడుతున్నా… మోహన్ బాబు మాత్రం మౌన వ్రతాన్నే పాటించటం.. చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి..గతంలో మోహన్ బాబు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటే.. రజనీకాంత్‌కు తానొక్కడినే ఆప్తమిత్రుడిని అనేలా ఆయన బిల్డప్ ఉండేది. తమది దశాబ్దాల స్నేహబంధం అంటూ మోహన్ బాబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడు అదే రజనీకాంత్‌పై వైసీపీ నేతలు.. గ్రామ సింహాల్లా పడి మొరుగుతున్నా… మోహన్ బాబు నోరెత్తి ఖండించలేదు. తన మిత్రుడైన రజనీ కాంత్ వ్యక్తిత్వాన్ని.. ఆయన కుటుంబాన్ని సైతం వైసీపీ నేతలు వదిలి పెట్టడం లేదు. నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలూ మాట్లాడేస్తున్నారు. ఇవన్నీ కళ్ళారా చూస్తూ కూడా మోహన్ బాబు ఖండించక పోవటం క్షమించరాని తప్పిదంగా సినీ అభిమానులు భావిస్తున్నారు.
తనకు తాను.. ఓ మోనార్క్‌లా ఫీలయ్యే మోహన్ బాబు.. రజనీ కాంత్‌ను తిడుతున్నా ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీస్తున్నారు. మరోవైపు… మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సినీ రంగానికి చెందిన రజనీకాంత్‌పై వైసీపీ నేతలు నోరు పారేసుకుంటున్నా… మంచు విష్ణు కూడా ఖండించలేదు. దీంతో.. మోహన్ బాబు ఫ్యామిలీపై సోషల్ మీడియా వేదికగా.. నెటిజన్లు ట్రోల్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఇక.. ప్రస్తుతం మోహన్ బాబు.. వైసీపీలో ఉన్నారు. అధికారికంగా ఆయన వైసీపీ సభ్యుడు. ఇప్పుడు తన మిత్రుడు రజనీకాంత్‌ను తిడుతోంది కూడా వైసీపీ నేతలే కావటంతో.. ఆయనకు నోరు పెగలటం లేదని అంటున్నారు.
తనకు నచ్చని వారిపై.. రాజకీయ ప్రత్యర్థులపై ఒంటి కాలిపై లేచే మోహన్ బాబు.. ప్రస్తుతం నోరు మూసుకుని కూర్చోవటానికి.. వైసీపీలో ఉండటమే కారణంగా కనిపిస్తోంది. వైసీపీ నేతల తిట్లను ఖండిస్తే.. ఎక్కడ జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతోనే మోహన్ బాబు మాట్లాడటం లేదని చాలా మంది భావిస్తున్నారు.
రజనీ కాంత్ తో స్నేహం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మోహన్ బాబు.. ఇప్పుడు సైలెంట్ గా ఉండటాన్ని ఎవరూ హర్షించటం లేదు. మొత్తం మీద.. తన సొంత పార్టీ నేతలే.. తన మిత్రుడు రజనీ కాంత్ ను తిడుతున్నా స్పందించని మోహన్ బాబుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.