
వివేకా క్యారెక్టర్ పై బురద జల్లుతున్నా నోరు మెదపని జగన్.. ఎందుకు..?
- Ap political StoryNewsPolitics
- April 18, 2023
- No Comment
- 36
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుల చుట్టూ.. సీబీఐ ఉచ్చు బిగుస్తున్న కొద్దీ.. ఆయన వ్యక్తిత్వంపై బురద జల్లే కార్యక్రమం జరుగుతోందా..? ఓ పథకం ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర రెడ్డి వంటి వారు వివేకా క్యారెక్టర్ ను బద్నాం చేస్తున్నారా..? వివేకానందరెడ్డికి లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టి.. వైఎస్ కుటుంబ పరువును బజరాను పడేస్తున్నారా..? ఒకప్పుడు సౌమ్యుడు, మంచివాడు అని పొగిడిన నోటితోనే ఇప్పుడు.. ఆయనను ఓ తిరుగుబోతుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు. సొంత చిన్నాన్నను ఇన్ని మాటలు అంటున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపటం లేదు..? అవినాష్ రెడ్డి మాటలను ఎందుకు ఖండించటం లేదు..?
కడప జిల్లా రాజకీయాల్లో వివేకానందరెడ్డిని అజాత శత్రువుగా అంతా చెబుతూ ఉంటారు. నిరాండబరునిగా.. సౌమ్యునిగా ఆయనకు మంచి పేరుంది. సోదరుడు వివేకా తోడ్పాటుతో రాజశేఖర రెడ్డి సీఎం స్థాయికి చేరుకోగా.. రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని జగన్ రెడ్డి సీఎం అయ్యారు. అంటే.. అటు వైఎస్, ఇటు జగన్ సీఎంలు కావటం వెనుక వివేకానందరెడ్డి కృషి చాలా ఉందని అర్ధం అవుతోంది. అటువంటి వివేకానందరెడ్డి అత్యంత కిరాతకంగా హత్యగావింప బడటం.. ఆ తరువాత ఆయన కుమార్తె ఒంటరిగా న్యాయ పోరాటం చేయాల్సి రావటం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరు.. నిందుతులకు అండగా నిలుస్తున్న వైనం వైఎస్ అభిమానులకు మింగుడు పడటం లేదు. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడి సోదరుడిని కిరాతకంగా కడతేర్చటమే కాకుండా.. చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ ను కించ పరచటాన్ని వారు తట్టుకోలేక పోతున్నారు. ముఖ్యంగా తన సొంత చిన్నాన్న హత్య విషయంలో జగన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
2019 ఎన్నికలకు ముందు వివేకా హత్యకు గురికాగా.. గొడ్డలి పోటును గుండె పోటుగా అవినాష్ అండ్ కో చిత్రీకరించింది. ఆ తరువాత నారాసుర రక్త చరిత్రగా ప్రచారం చేశారు. అదీ ఫేక్ అని తేలటంతో.. ఆస్తి గొడవలు ఉన్నాయన్నారు. వివేకాకు రెండవ భార్య ఉందంటూ మరో కథను తెరపైకి తీసుకు వచ్చారు. హత్యకు అది కూడా కారణం కాదని తేలటంతో.. చివరగా ఇప్పుడు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. ఆయన క్యారెక్టర్ పై బురద జల్లేలా వైఎస్ భాస్కర రెడ్డి కోర్టులో పిటీషన్లు సైతం దాఖలు చేశారు. ఇక అవినాష్ రెడ్డి అయితే ప్రెస్ మీట్లు పెట్టి మరీ.. వివేకాకు వేరే మహిళలతో సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు.
ఇప్పుడు తమ వరకు రావటంతో వివేకా క్యారెక్టర్ గురించి అవినాష్ ఉద్దేశ్యపూర్వకంగా బురద జల్లుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హత్య జరిగిన రోజు.. జగన్ రెడ్డి వివేకా వ్యక్తిత్వం గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆ సందర్భంలో జగన్ రెడ్డి వెనుకాలే అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. మరి వివేకానందరెడ్డి చెడ్డవాడైతే.. ఆనాడు జగన్ మాట్లాడుతున్నప్పుడు అవినాష్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆరోజు వివేకా గురించి మంచిగా మాట్లాడిన జగన్ రెడ్డి.. ఇవాళ అవినాష్ రెడ్డి వంటి వాళ్లు వివేకా క్యారెక్టర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా..? ఎందుకు నోరు మెదపటం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ కూడబలుక్కుని తమ వైఖరి మార్చుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే అవినాష్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని చాలా మంది భావిస్తున్నారు. సాక్షాత్తూ వైఎస్ సోదరుడైన వివేకానందరెడ్డి క్యారెక్టర్ గురించి అవినాష్ రెడ్డి లాంటి వాళ్లకు మాట్లాడే ధైర్యం ఉండదని.. దీని వెనుక.. జగన్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ కుటుంబ సభ్యులే వివేకా క్యారెక్టర్ ను కించపరుస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జగన్ మినహా.. వైఎస్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.