రాజకీయ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి పవన్ సినిమాలు చేసుకుంటున్నారా..?

రాజకీయ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి పవన్ సినిమాలు చేసుకుంటున్నారా..?

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మ హత్యలే ఉంటాయంటారు. స్వీయ తప్పిదాలతో కొంత మంది నాయకులు తమ పొలిటికల్ కెరీర్‌ను తామే నాశనం చేసుకుంటూ ఉంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వీరి వ్యవహారశైలి ఉంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి కూడా అలాగే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగుదేశంతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు అస్త్ర, శస్త్రాలతో సిద్ధం అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయితే.. నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో దూసుకు పోతున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో జనంతో మమేకం అవుతున్నారు. బీజేపీ, కమ్యునిస్టు పార్టీల నేతలు సైతం ప్రెస్ మీట్లతో తమ ఉనికి చాటు కుంటున్నాయి. కానీ.. జనసేన పార్టీ అధినేత మాత్రం ప్రజలకే కాదు.. సొంత పార్టీ నాయకులకు సైతం అందుబాటులో ఉండటం లేదు. ఎలక్షన్ సీజన్‌లోనూ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. దీంతో.. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నారనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.

ఇక.. రాష్ట్రంలో.. పొలిటికల్ హీట్ రాజుకుంటూ ఉంటే.. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం పాలిటిక్స్‌తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటున్నారు. సినీ హీరోగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పొలిటికల్ కెరీర్ కన్నా సినీ కెరీర్ కే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారనే అపప్రదను ఆయన మూట కట్టుకున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ ఆయన సినిమా షూటింగ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేమంటే.. తనకు ఇతర నాయకుల్లాగా వ్యాపారాలు లేవని.. సినిమాల వల్లే తనకు ఆదాయం వస్తుందని పవన్ చెప్పుకొస్తుంటారు. ఇది కరెక్టే అయినా.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ మెగా హీరోకు 30 లేదా 40 కోట్లు సమీకరించటం పెద్ద కష్టం కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నాననే పవన్ మాటలను జనసేన వర్గాలే డైజెస్ట్ చేసుకోలేక పోతున్నాయి. వైసీపీ అరాచక విధానాలపై పోరాడాల్సిన సమయంలో.. పవన్ కళ్యాణ్ ఇలా సినిమా షూటింగ్స్ చేసుకుంటూ.. టైమ్ వేస్ట్ చేయటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. రాజకీయంగా క్షణం తీరికలేకండా ఉండాల్సిన తమ అధినేత.. ఇలా సినిమా షూటింగ్స్ పేరుతో సెల్ఫ్ గోల్ చేసుకోవటాన్ని వారు తట్టుకోలేక పోతున్నారు.

ఇప్పటికే అంతంత మాత్రంగా జనసేన పార్టీ నిర్మాణం ఉండటం.. నేటికీ బూత్ స్థాయిలో సరైన కమిటీలు లేక పోవటం.. బలమైన ఉద్యమాలను చేపట్టక పోవటం వంటి అనేక ఇబ్బందులను జనసేన ఎదుర్కొంటోంది. కనీసం ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలోనైనా.. పార్టీ నిర్మాణంపై పవన్ దృష్టి పెడతారని ఆశించిన కేడర్ కు నిరాశే ఎదురౌతోంది. ఇలా అయితే.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నిండా మునగటం ఖాయమనే అభిప్రాయం జనసైనికుల్లో వ్యక్తం అవుతోంది. ఇటీవలే పార్టీ ఆవిర్భావ సభలో ఓ మెరుపు మెరిసిన పవన్ కళ్యాణ్.. మళ్ళీ అంతలోనే పొలిటికల్ పిక్చర్ నుంచి అదృశ్యం అయిపోయారు. అంతకు ముందు వారాహి బస్సు యాత్ర చేపడతామంటూ ఆర్భాటంగా ప్రకటనలిచ్చినా.. అవి నేటికీ అమలు కాలేదు. అసలు వారాహి బస్సు యాత్ర జరుగుతుందా..? లేదా..? అనేది జనసైనికులకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలబోనివ్వనంటూ ప్రకటనలిచ్చిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా జనసేన కేడర్‌ను సన్నద్ధం చేయలేక పోతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై సైతం కేడ‌ర్ కు క్లారిటీ ఇవ్వటం లేదు. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపైనా బలమైన పోరాటాలను నేటికీ చేపట్టలేదు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతామని జనసేన సీనియర్ నాయకుడొకరు వాపోయారు. 2019 లో ఏవైతే తప్పులను పవన్ కళ్యాణ్ చేశారో.. దాదాపు అవే రకమైన తప్పుల్ని ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

వాస్తవానికి.. రాజకీయ రంగంలో ఉన్న ప్రతీ నాయకునికీ సొంత వ్యాపారాలు.. వ్యవహారాలు చాలా ఉన్నాయి. వారంతా పాలిటిక్స్‌ను ఫుల్ టైమ్ కెరీర్ గా తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకో.. వారసులకో తమ వ్యాపార బాధ్యతలను అప్పచెప్పి.. పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారు. కానీ.. సినీ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం సినీ రంగంలో ప్రత్యామ్నాయ వ్యాపారాల వైపు దృష్టి సారించకుండా… నటనకే టాప్ ప్రయార్టీ ఇస్తున్నారు. ఎలక్షన్ ఇయర్లోకి ఎంటరైన తరుణంలోనూ పవన్ కళ్యాణ్ సినిమాలను విడిచి పెట్టక పోవటంతో.. ఆయనపైనే గంపెడాశలు పెట్టుకున్న జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా విలువైన సమయం వృధా అయిపోగా.. తమ అధినేత వెంటనే ప్రజా క్షేత్రంలోకి రావాలని కోరుకుంటున్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటూ తన రాజకీయ జీవితాన్ని తానే నాశనం చేసుకుంటారా..? లేక ఇప్పటికైనా సినిమాలను పక్కన పెట్టి ప్రజా క్షేత్రంలోకి అడుగు పెడతారో లేదో వేచి చూడాలి.

Related post

ఆ 40 నిమిషాలు జైల్లో ఏం జరిగింది?

ఆ 40 నిమిషాలు జైల్లో ఏం జరిగింది?

రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలేం జరిగింది..? పవన్ కళ్యాణ్ ఎందుకంత హడావుడిగా పొత్తుపై ప్రకటన చేశారు? ఇవే అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.…
బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?

ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన…
టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కీలక ప్రకటన

టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కీలక ప్రకటన

వైసీపీపై యుద్ధం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన చేశారు. రెండు పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నట్లు స్పష్టం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *