
జగన్ తో మీటింగ్ కు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదంటే..?
- Ap political StoryNewsPolitics
- April 3, 2023
- No Comment
- 31
ఫ్యాన్ పార్టీ లో ఉక్కపోత ఎక్కువైంది. రెక్కలు ఒంగిపోతుండడంతో జగన్ ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి ఎన్నికలకు ముందు బట్టబయలవుతోంది. మొన్నటికి మొన్న జగన్ తీరు నచ్చక నలుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే, తాజాగా గడపగడపకు కార్యక్రమంపై ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాలను విస్మయపర్చింది. ఎమ్మెల్యేల గైర్హాజరీ వైసీపీలోనూ కలకలం రేపుతోంది. అనారోగ్య సమస్యలున్నా సరే మీటింగ్ కు రావాల్సిందేనని అధిష్టానం హుకూం జారీ చేసింది. అయినా కూడా కొందరు ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉండడంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ ఈ సమీక్షా సమావేశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై అందరకీ దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అయితే, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఆయన ఖంగుతిన్నారని తెలుస్తోంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున హాజరు కావడం లేదని సమాచారం పంపారు. మిగతా ఎవరూ ముందస్తు సమాచారం ఇవ్వలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆళ్ల.. పార్టీపై కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. మీటింగ్ కు రాని ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటుండడంతో.. సీఎం జగన్ ఈ మీటింగ్ ను చాలా ముఖ్యమైనదిగా భావించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, రీజనల్ కో ఆర్డినేటర్లు అందరినీ తాడేపల్లికి పిలిపించారు. అయితే, ఏదో చెబుదామనుకుంటే అక్కడ మరేదో అయినట్టుగా, ఎమ్మెల్యేల వర్క్ షాప్ నకు 10మందికి పైగా ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. అందులో ముగ్గురు మంత్రులు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది.తనపై ఎమ్మెల్యేల్లో విశ్వాసం సన్నగిల్లుతుండడంతో ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలో తూతూమంత్రంగా మీటింగ్ ముగించి,బాగా పనిచేసుకోవాలని చెప్పి పంపించారు జగన్.
ఇక.. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీలో అలజడి రేగింది. నలుగురు ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్ ఇవ్వగా, మరో 40మంది టీడీపీకి టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సమీక్ష నిర్వహించిన జగన్, ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోనంటూ వర్క్ షాప్ లో చెప్పుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలన్న విషయం జగన్ కు చేతులు కాలాక కానీ తెలిసొచ్చినట్లు ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు దూరం కావడంతో, మిగిలిన వారిని సముదాయించేందుకే కేవలం మీటింగ్ పెట్టినట్టుగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.