
జగన్ రెడ్డి సహకారంతో..జిందాల్ చేతికి విశాఖ ఉక్కు?
- Ap political StoryNewsPolitics
- April 26, 2023
- No Comment
- 32
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. 2 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమను తుక్కు రేటుకే కాజేసేందుకు కార్పొరేట్ దిగ్గజాలు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో పాతుకుపోయిన జిందాల్ స్టీల్ కంపెనీ యాజమాన్యం, తమ హస్తగతం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వారికి ఏపీ సీఎం జగన్ రెడ్డి అండదండలు కూడా తోడు కావడంతో విశాఖ ఉక్కు, జిందాల్ చేతిలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉక్కును కావాలనే నష్టాల్లోకి నెట్టారా? విశాఖ ఉక్కు పరిశ్రమ, దానికి చెందిన భూములపై పెద్దల కన్ను పడిందా?
గడచిన దశాబ్దకాలంలో విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ సంస్థలు కావాలనే దెబ్బతీశాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దేశంలోనే నెంబర్ వన్ క్వాలిటీ ఉక్కును ఉత్పత్తి చేస్తోన్న విశాఖ ఉక్కు పరిశ్రమలో… దశాబ్ధకాలంగా కొత్త ఉక్కు ఉత్పత్తులు రాకుండా కుట్ర జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విస్తరణ పేరుతో 16 వేల కోట్లు ఖర్చు చేసినా, కొత్త ఉత్పత్తులు తీసుకురాలేకపోయారు. వేల కోట్లు దుబారా చేసి, మూడు ఫర్నేస్ ప్లాంట్లలో ఒకటి మూత వేశారని ఆరోపిస్తున్నారు. విశాఖ స్టీల్ కు మొదటి నుంచి సొంత గనులు కేటాయించకుండా కొన్ని కార్పొరేట్ శక్తులు ఢిల్లీ స్థాయిలో అడ్డుపడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వరంగంలో తీరప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు పరిశ్రమను గడచిన పదేళ్లలో కావాలనే వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారనే విషయం అర్థం అవుతోంది.
విశాఖ ఉక్కు పరిశ్రమకు 23 వేల ఎకరాల భూములు ఉన్నాయి. వేగంగా విస్తరిస్తోన్న నగరాల్లో విశాఖ కూడా చోటు దక్కించుకుంది. దీంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎలాగైనా విశాఖ ఉక్కు పరిశ్రమను, దాని భూములు కాజేసేందుకు ఒక పద్దతి ప్రకారం ప్లాంటును దెబ్బకొట్టారని తెలుస్తోంది. దక్షణాదిలో ప్రభుత్వరంగంలోని ఉక్కు పరిశ్రమలను నష్టాల పేరుతో ఒక్కొక్కటి మూసి వేస్తున్నారు. ఇప్పటికే కర్నాటకలోని భద్రావతి స్టీల్ పరిశ్రమను మూసేసి అమ్మకానికి పెట్టారు. తమిళనాడులోని ఏకైక ఉక్కు పరిశ్రమకు కూడా టెండర్ పెట్టారు. ఇక దక్షణాదిలో ప్రభుత్వరంగంలో మిగిలిన ఏకైక విశాఖ ఉక్కుపై జిందాల్ కన్ను పడింది. దీన్ని కైవసం చేసుకుంటే 5 రాష్ట్రాల్లో తిరుగుండదని జిందాల్ స్టీల్ యాజమాన్యం స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే జిందాల్ యాజమాన్యం విశాఖ ఉక్కు పరిశ్రమకు టెండర్ వేసిందనే సమాచారం గుప్పుమంది.
విశాఖ ఉక్కు పరిశ్రమను హోల్ సేల్ గా ఒకేసారి అమ్మేస్తే కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందుకే దశల వారీగా విశాఖ స్టీల్ కు టెండర్లు పిలుస్తున్నారు. ఇప్పటికే మూలధనం, ముడిపదార్థాల సరఫరాకు ప్రైవేటు కంపెనీల నుంచి టెండర్లు పిలిచారు. 5 వేల కోట్ల తక్షణ మూలధనంతోపాటు, ముడిపదార్ధాల సరఫరా చేయాలని టెండర్లు పిలిచారు. ఇప్పటికే ఉక్కు రంగంలో దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీ అయిన జిందాల్ రంగంలోకి దిగింది. ఈ పరిశ్రమకు కర్ణాటకలో సొంత గనులు కూడా ఉన్నాయి. ఇక మూలధనం ఏర్పాటు చేయడం వారికి పెద్ద విషయం కాదు. అందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ పిలిచిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లలో 29 మంది పాల్గొన్నా, చివరకు జిందాల్ చేతికే విశాఖ ఉక్కు చేరుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
ఏదైనా కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్రవేసి చంపేసినట్టు…విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిపోయిందంటూ అమ్మకం మొదలు పెట్టారు. 2 లక్షల కోట్ల విలువైన భూములు, యంత్రాలు కలిగిన ఈ పరిశ్రమను ఒకేసారి ఏక మొత్తంలో ఏ కార్పొరేట్ సంస్థ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అందుకే దశల వారీగా పనికానిచ్చేయాలని కేంద్రంలోని పెద్దల ఆలోచనగా ఉందని కార్మికులు విమర్శిస్తున్నారు. విశాఖ ఉక్కును ఉద్దరించే ఆలోచన ప్రైవేటు కంపెనీలకు కానీ, కేంద్రానికి గానీ లేదని…పరిశ్రమకు ఉన్న వేలాది ఎకరాల భూములపై వారి కన్ను పడిందనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే, గతంలో టీడీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కేసుల భయంతో, కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారారు. ఇలాంటి అనుకూల సమయంలోనే విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మళ్లించాలనే ప్రయత్నాలను కేంద్రం వేగవంతం చేసింది. నాలుగు మాసాల కిందట కొందరు జిందాల్ ప్రతినిధులు తాడేపల్లిలోని కార్యాలయంలో సీఎం జగన్ రెడ్డిని కలిశారు. ఇవన్నీ విశాఖ ఉక్కు జిందాల్ చేతిలోకి వెళ్లిపోతోందనేందుకు బలం చేకూరుస్తున్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారనేది వాస్తవం. ఇంత జరుగుతున్నా, విశాఖ ఉక్కుపై సీఎం జగన్ ఒక్క ప్రకటనా చేయడం లేదు. విశాఖ ఉక్కును నష్టాల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని భావిస్తే.. లాభాల్లో నడుస్తోన్న ఎల్.ఐ.సీలోనూ ప్రైవేటు పెట్టుబడులను ఎందుకు ఆహ్వానించారని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. విభజన హామీల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోగా చక్కగా నడుస్తోన్న విశాఖ స్టీల్ ప్లాంటును బీజేపీ కాజేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరో త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కేంద్రంలోని బీజేపీ చేస్తోన్న చారిత్రక తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.