జగన్ రెడ్డి దెబ్బకు చెప్పుతో కొట్టుకుంటున్న సర్పంచ్‌లు…

జగన్ రెడ్డి దెబ్బకు చెప్పుతో కొట్టుకుంటున్న సర్పంచ్‌లు…

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన అధికార పీఠం ఎక్కారో.. అప్పటి నుంచి పంచాయతీలకు బ్యాడ్ టైమ్ దాపురించిందనే చెప్పాలి. తన ఆర్ధిక అవసరాలకు పంచాయతీ నిధులను వాడుకోవటం దగ్గర నుంచి.. గృహ సారధుల నియామకం వరకు సీఎం జగన్ రెడ్డి యావత్ పంచాయతీ రాజ్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. చేతిలో చిల్లిగవ్వలేక.. చేసేందుకు పని లేక గ్రామ సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు.. సచివాలయాలు, వాలంటీర్ల పేరుతో జగన్ రెడ్డి సర్కార్ నడుపుతున్న సమాంతర వ్యవస్థలు.. గ్రామ పంచాయతీల ఉసురు తీస్తున్నాయి. దీంతో.. జగన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా సర్పంచ్‌లు పోరుబాట పడుతున్నారు. వైసీపీ నుంచి గ్రామ సర్పంచ్‌గా గెలిచినందుకు సిగ్గు పడుతూ చెప్పుతో కొట్టుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 13 వేల 217 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత… వీటిలో దాదాపు 90 శాతం పంచాయతీలను వైసీపీ నేతలే హస్తగతం చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తమ పార్టీనే కావటంతో.. నిధుల వరద పారుతుందని.. పంచాయతీల్లో అభివృద్ది కార్యక్రమాలను జోరుగా చేపట్టవచ్చని మెజార్టీ సర్పంచ్‌లు ఆశించారు. అయితే.. వారి ఆశలు అడియాసలు కావటానికి.. ఎక్కువ కాలం పట్టలేదు. సీఎం జగన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 వేలకు పంచాయతీల పాలిట గొడ్డలి పెట్టులా మారాయి. నాలుగేళ్ళలోనే రాష్ట్రంలోని దాదాపు 95 శాతానికి పైగా పంచాయతీలన్నీ దివాలా తీశాయి. తన బటన్ నొక్కుడు పథకాల కోసం పంచాయతీ అకౌంట్లన్నీ జగన్ రెడ్డి ఖాళీ చేసేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులు అలా పంచాయతీ ఎకౌంట్లలో పడీ పడగానే.. ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. తమ అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కనిపిస్తున్నా వాటిని విత్ డ్రా చేసే పరిస్థితి సర్పంచ్‌లకు ఉండటం లేదు. దీని గురించి ఆలోచించేలోపే.. ఆ నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు వందలు, వేల కోట్ల రూపాయల నిధులను జగన్ రెడ్డి.. పంచాయతీల ఖాతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు మళ్ళించేస్తున్నారు. సీఎంగా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో.. గత నాలుగేళ్ళుగా సర్పంచ్‌ల చేతిలో చిల్లిగవ్వలేక… గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేక అల్లాడిపోతున్నారు. ఇదేం ఖర్మ మాకు అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారు.

వాస్తవానికి.. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా ఆర్ధిక సంఘం నిధులు వస్తుంటాయి. పంచాయతీ స్థాయిని బట్టి కేంద్రమే ఈ నిధులను వారి అకౌంట్లలోకి జమ చేస్తుంది. ఈ నిధులతో పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల వంటి పనులను సర్పంచ్‌లు చేస్తుంటారు. వాటితో పాటు.. ఇతర విభాగాల నుంచి కూడా గ్రాంట్ల రూపంలో పంచాయతీల అకౌంట్లలో నిధులు పడుతుంటాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 14, 15 ఆర్ధిక సంఘాల నిధులు పంచాయతీలకు వచ్చాయి. కానీ..రకరకాల కారణాలను సాకుగా చూపి జగన్ సర్కార్ ఆ నిధులను ప్రభుత్వ అకౌంట్లకు మళ్ళించేస్తోంది. డబ్బులు పడీ పడగానే.. పంచాయతీ అకౌంట్లను ఖాళీ చేసేస్తోంది. దీంతో.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల మాట అటుంచితే.. బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా దిక్కులేని దుస్థితి నెలకొంటోంది. దీని ఫలితంగా.. గ్రామ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నారు. బ్లీచింగ్ పౌడర్ కొనటానికి కూడా దిక్కులేని పరిస్థితిల్లో ఈ పదవి తమకెందుకు అని..? ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది సర్పంచ్‌లు అప్పులు చేసి మరీ పనులు చేయించారు. అయితే.. ఆ బిల్లులు కూడా రాకపోవటంతో వారి పరిస్థితి దయనీయంగా ఉంటోంది.

ఇక.. తన బటన్ నొక్కుడు పథకాల కోసం పంచాయతీల నిధులకు శఠగోపం పెడుతున్న జగన్ రెడ్డి.. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పంచాయతీ కార్యాలయాలను నిర్వీర్యం చేశారు. వాలంటీర్లను ఏర్పాటు చేసి పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను ఉత్సవ విగ్రహాల్లా మార్చారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రకారం పంచాయతీ కార్యాలయాల్లో అందించాల్సిన సేవలను.. సచివాలయాలకు బదిలీ చేశారు. దీంతో.. జనం పంచాయతీ ఆఫీసుల వైపు చూడటం మానేశారు. మరో వైపు అన్ని పథకాలకు వాలంటీర్లతోనే పని కానిచ్చేస్తుండటంతో.. పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిన పరిస్తితి నెలకొంది. ఈ విధంగా.. చేతిలో చిల్లిగవ్వ లేక.. చేసేందుకు పని లేక పంచాయతీ వ్యవస్థ మొత్తం కుప్ప కూలే స్థితికి చేరుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన సర్పంచ్‌లే 90 శాతం పైగా ఉన్నారు. అయినా.. వీరిలో చాలా మంది బయటపడలేక.. లోలోన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. కొంత మంది మాత్రం గళం విప్పుతున్నారు. జగన్ రెడ్డిని నమ్మి సర్పంచ్‌గా పోటీ చేసినందుకు తమకు తగిన శాస్తే జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం విజయవాడలో సమావేశం అయ్యింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఇప్పటికే.. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలపై తాము పోరాటం చేస్తుంటే.. కొత్తగా కన్వీనర్లు, గృహసారథులను తెచ్చి సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, వైసీపీ తరఫున సర్పంచ్‌గా గెలిచి తాము సిగ్గు పడుతున్నామని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చినాంపల్లె గ్రామ సర్పంచ్ పగడాల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను గెలిపించినందుకు చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు.

మొత్తం మీద.. సీఎం జగన్ రెడ్డి నిర్వాకం వల్ల.. ఏపీలో పంచాయతీల అకౌంట్లన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఫలితంగా పంచాయతీల్లో అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. తన ప్రచార ఆర్భాటం కోసం పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న జగన్ రెడ్డి తీరుపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సీఎం జగన్ రెడ్డి తీరు మార్చుకుని.. పంచాయతీల నిధుల స్వాహా పర్వాన్ని ఆపాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *