
అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా?
- Ap political StoryNewsPolitics
- May 15, 2023
- No Comment
- 36
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరోసారి సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించింది. దాంతో, ఆయన అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. దాంతో, ముందస్తు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని హైదరాబాద్ కు వెళ్లిపోయారు అవినాష్ రెడ్డి. రేపటి విచారణలో సీబీఐ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది. కేవలం స్టేట్ మెంట్ రికార్డ్ చేసి మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తారా? లేక అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
గత నెలలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వరుసగా విచారించారు. ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలతో కలిపి ఓసారి..ముగ్గురిని వేర్వేరుగా మరోసారి విచారించారు. దాదాపు 15 రోజుల తర్వాత మళ్లీ నోటీసులు జారీ చేయడం ఉత్కంఠ రేపుతోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపుగా పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలను కూడా సీబీఐ సేకరిస్తోంది. వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి అవినాష్ రెడ్డేనని సీబీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే కోర్టుకెళ్లిన ప్రతిసారీ సంచలన విషయాలు వెల్లడిస్తోంది. అంతకుముందు విచారించిన సీబీఐ.. ఎంపీ అవినాష్‌పై రెండు నేరాలను మోపింది. ఒకటి వివేకా హత్య, రెండోది ఆధారాలను మాయం చేయడం.. ఈ రెండింటినీ ప్రధానంగా ప్రస్తావించింది.
ఈ క్రమంలోనే మళ్లీ నోటీసులను జారీ చేయడం సంచలనంగా మారింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించలేదు. వేసవి సెలవుల దృష్ట్యా విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని హైకోర్టును ఎంపీ తరపు న్యాయవాది కోరగా.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ రకమైన ఆదేశాలు ఇవ్వలేమని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో మరోసారి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్‌కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. అతడికి బెయిల్ ఇస్తే.. దర్యాప్తును ప్రభావితం చేస్తారంటూ సీబీఐ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఉదయ్‌కుమార్ బెయిల్‌పై బయటకి వస్తే.. సాక్షులను బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందని, పలువురి నుంచి ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని చెప్పారు.
వివేకా హత్య సంగతి బయటి ప్రపంచానికి తెలియక ముందే ఉదయ్‌కుమార్‌రెడ్డికి తెలిసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలినట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్య తర్వాత వివేకా మృతదేహానికి కుట్లువేసి, రక్తపు వాంతులతో చనిపోయారని నమ్మించడంలో ఉదయ్‌కుమార్‌రెడ్డిదే కీలక పాత్ర అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.